logo

నీటిలోని చేపొచ్చి.. నేలమీద పడుతోంది..!

తగ్గుతున్న భూగర్భ జలాలతో రైతులతో పాటు మత్స్యకారులు నష్టపోతున్నారు. ఉమ్మడి జిల్లాలోని చెరువుల నీటిమట్టాలు రోజురోజుకూ తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో చెరువుల్లోని చేపలు తగినంత పరిమాణం పెరగక ముందే పట్టేసి విక్రయించాల్సిన దుస్థితి నెలకొంది.

Published : 28 Mar 2024 05:32 IST

మేళ్లచెరువులో.. అడుగంటిన నాగుల చెరువు

భానుపురి, మేళ్లచెరువు, న్యూస్‌టుడే: తగ్గుతున్న భూగర్భ జలాలతో రైతులతో పాటు మత్స్యకారులు నష్టపోతున్నారు. ఉమ్మడి జిల్లాలోని చెరువుల నీటిమట్టాలు రోజురోజుకూ తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో చెరువుల్లోని చేపలు తగినంత పరిమాణం పెరగక ముందే పట్టేసి విక్రయించాల్సిన దుస్థితి నెలకొంది. ఈ ఏడాది 3,096 చెరువుల్లో 12.7 లక్షల చేపల పిల్లలను మత్స్యశాఖ అధికారులు వదిలారు. అప్పట్లో 40 ఎం.ఎం. నుంచి 100 ఎం.ఎం వరకు పరిమాణం ఉన్న చేప పిల్లలు వదిలారు. ఇవి కిలో, రెండు కిలోల వరకు పెరగాలంటే కనీసం ఐదు నుంచి ఆరు నెలలు నీటిలో ఉండాలి. వర్షాలు ఆలస్యంగా కురవటంతో అక్టోబరు, నవంబరు మాసాల్లో చెరువులు, కుంటల్లో చేప పిల్లలను వదిలారు. ఆ తర్వాత వర్షాల జాడే లేకుండాపోయింది. ప్రస్తుతం ఉన్న నీరు తగ్గుముఖం పట్టడంతో ఎండకు నీరు వేడిగా మారి.. వాటి పరిమాణం పెరగలేకపోయింది. ఫలితంగా మత్స్యకారులే చేపలు పట్టి మార్కెట్లకు తరలించి తక్కువ ధరకు విక్రయించుకోవాల్సిన పరిస్థితి.

ఉమ్మడి జిల్లాలో 3,096 చెరువులు

ఉమ్మడి నల్గొండ జిల్లాలో 3,096 చెరువులు ఉండగా.. 445 మత్స్య సహకార సంఘాలున్నాయి. వాటిలో 49,583 మంది మత్స్యకారులు సభ్యులుగా ఉన్నారు. ఈ సారి 2,591 చెరువుల్లో అధికారులు చేప పిల్లలు వదిలారు. అదను దాటి వదలటంతో పరిమాణం పెరగలేదు. కొన్నిచోట్ల ఎండలను చూసి పెద్దగా పెరగకపోయినా వాటిని పట్టి అమ్ముతున్నారు. మరికొన్ని చోట్ల నీరున్న ప్రాంతాలను చూసి పట్టి అందులో వదిలినట్లు సమాచారం. కొందరు వ్యాపారులు 250 గ్రాముల వరకు పెరిగిన చేపలను స్థానిక మార్కెట్లలో విక్రయిస్తున్నారు. ఏప్రిల్‌, మే నెలలో ఎండలు మరింత ముదిరే అవకాశం ఉండటంటతో పూర్తిస్థాయిలో చెరువులు ఎండిపోయే ప్రమాదం ఉంది. భానుడి ప్రతాపంతో ఇప్పటికే చేపలు మృత్యువాత పడుతున్నట్లు మత్స్యకారులు వాపోయారు. ఈ సారి వర్షాలు సమృద్ధిగా కురవకపోవడంతో మార్చిలోనే అడుగంటి చాలావరకు చేపలు ఎదగలేదు. దీనికి తోడు ఆలస్యంగా పంపిణీ చేయడంతో వాటి వృద్ధిపై వేటుపడింది. చేపల వేటపై ఆధారపడి జీవనం సాగించే మత్స్యకారులకూ ఈసారి ఉపాధి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.


ప్రభుత్వం ఆదుకోవాలి..
-కోల కరుణాకర్‌, ముదిరాజ్‌ ఎంప్లాయీస్‌ అండ్‌ ప్రొఫెషనల్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు, సూర్యాపేట

ఎండల ప్రభావంతో ఉమ్మడి జిల్లాలోని చెరువులు ఎండిపోయాయి. మత్స్యకారులకు ఉపాధి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం ఎండిపోయిన చెరువుల పరిధిలోని మత్స్యకారులను ఆదుకోవాలి. వారికి పరిహారం అందించి తోడ్పాటునందించాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని