logo

రైతన్నలూ సాగుకు సన్నద్ధం కండి

గత అనుభవాల దృష్ట్యా వ్యవసాయశాఖ ఓ అడుగు ముందుకేసింది.. రైతన్నలను సాగుకు సిద్ధం చేస్తోంది.. ముందస్తు నాట్లు వేసుకొని రాబోయే వర్షాలకు నష్టం వాటిల్లకుండా అప్రమత్తం చేస్తోంది.. మరోవైపు జలవనరులశాఖ సాగునీటిని విడుదల చేయడంతో

Published : 26 May 2022 03:22 IST

సమృద్ధిగా ఎరువులు, విత్తనాలు


సుధాకర్‌రాజు, జేడీ, వ్యవసాయశాఖ

న్యూస్‌టుడే, నెల్లూరు (వ్యవసాయం) గత అనుభవాల దృష్ట్యా వ్యవసాయశాఖ ఓ అడుగు ముందుకేసింది.. రైతన్నలను సాగుకు సిద్ధం చేస్తోంది.. ముందస్తు నాట్లు వేసుకొని రాబోయే వర్షాలకు నష్టం వాటిల్లకుండా అప్రమత్తం చేస్తోంది.. మరోవైపు జలవనరులశాఖ సాగునీటిని విడుదల చేయడంతో వడివడిగా పొలం పనులు చేపట్టాలని వ్యవసాయశాఖ జేడీ సుధాకర్‌రాజు అన్నదాతలకు సూచించారు. విత్తనాలు, ఎరువులు జిల్లాకు సరిపడా అందుబాటులో ఉన్నాయని, ఈ విషయంపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఆయనతో ‘న్యూస్‌టుడే’ నిర్వహించిన ముఖాముఖిలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.వివరాలు ఆయన మాటల్లోనే..

15 వేల కిసాన్‌ క్రెడిట్‌ కార్డుల లక్ష్యం
సొంత భూమి ఉండి ఇప్పటివరకు పంట రుణాలు తీసుకోని 15 వేల మంది రైతులను గుర్తించి వారికి కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు మంజూరు చేస్తున్నాం. బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరయ్యేలా దృష్టిసారించాం. 25 వేల మంది కౌలు రైతులకు పంట హక్కు పత్రాలు అందజేసి బ్యాంకు రుణాలు మంజూరయ్యేలా చర్యలు తీసుకున్నాం.
ఎరువులకు ఇబ్బందుల్లేవ్‌..
ఖరీఫ్‌ సీజన్‌కు ఎరువుల కొరత లేకుండా చర్యలు చేపట్టాం. సీజన్‌కు సంబంధించి 1.22 లక్షల మెట్రిక్‌ టన్నులు అవసరమవుతుండగా ఇప్పటికే డీఏపీ 4,500 ఎంటీలు, కాంప్లెక్సు ఎరువులు 14,500 ఎంటీలు, యూరియా 21 వేలు ఎంటీలు, ఎంవోపీ 2,200 ఎంటీలు, ఎస్‌ఎస్‌ఎస్‌ 3,200 ఎంటీలు సిద్ధంగా ఉన్నాయి. సెప్టెంబరు చివరి వరకు మిగతావి విడతల వారీగా వస్తాయి. ఫలితంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు.

అంచనాలకు మించి సాగు
జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌ అంచనాలకు మించి సాగవనుంది. సాధారణ విస్తీర్ణ లక్ష్యం 1.20 లక్షల ఎకరాలకు 1.85 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇందులో వరి పంట లక్ష ఎకరాలకు పైగా సాగులోకి రానుంది. ఇప్పటికే 18,990 ఎకరాల్లో వేరుశనగ, పత్తి, ఇతర పంటలు వేశారు. ఈ దఫా పత్తి ధర క్వింటా రూ.10 వేల నుంచి రూ.14 వేల వరకు పలుకుతోంది. దాంతో రైతులు ఎక్కువగా ఈ పంట సాగు చేసే అవకాశం కనిపిస్తోంది.

89 వేల క్వింటాళ్ల  విత్తనాలు
వ్యవసాయశాఖ తరఫున అందజేస్తున్న వరి విత్తనాలు సమృద్ధిగా ఉన్నాయి. జిల్లాకు 52 వేల క్వింటాళ్ల విత్తనాలు అవసరం అవుతుండగా, వ్యవసాయశాఖ వద్ద ఇప్పటికే 89 వేల క్వింటాళ్ల ధాన్యం అందుబాటులో ఉంది. ఎన్‌ఎల్‌ఆర్‌ 34449, కేఎన్‌ఎం 1638, జేజీఎల్‌ 1798 వంటి రకాలు ప్రస్తుత సాగుకు అనుకూలం. ఎన్‌ఎల్‌ఆర్‌ 34449 రకం దాదాపు 60 వేల ఎకరాల్లో సాగు చేయనున్నారు. విత్తనాలకు ఎలాంటి ఇబ్బందులు లేవు. భూమిని సారవంతం చేసేందుకు జీలుగ, జనుము, పిల్లిపెసర విత్తనాలను ఎస్టీ రైతులకు 90 శాతం, ఎస్సీ, బీసీ, ఓసీ రైతులకు 50 శాతం రాయితీతో ఇస్తున్నాం. ఆర్‌బీకేల్లో వీటిని తీసుకోవచ్చు.

వచ్చే నెల ఒకటి నుంచే ఈ-క్రాప్‌ నమోదు
గత అనుభవాల దృష్ట్యా ఈ దఫా ఈ-క్రాప్‌ను వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ప్రారంభిస్తున్నాం. రైతులు తప్పనిసరిగా దీనిలో నమోదు చేసుకోవాలి. ఫలితంగా వ్యవసాయశాఖ ద్వారా అమలయ్యే సున్నా వడ్డీ, రైతు భరోసా, ధాన్యం కొనుగోలు వంటి వాటికి ఇబ్బందులు ఉండవు. వ్యవసాయ సహాయకుల ద్వారా పొలాల వద్దే పండించిన పంటను ఈ-క్రాప్‌లో నమోదు చేయడంతో పాటు రైతుల వేలిముద్రలు (ఈకేవైసీ) సేకరిస్తాం. ప్రత్యేక యాప్‌ ద్వారా పంటల వివరాలను పక్కాగా నమోదు చేస్తున్నాం. వ్యవసాయ యాంత్రీకరణ పథకానికి సంబంధించి వచ్చే నెల ఆరో తేదీన మెగా మేళా నిర్వహిస్తున్నాం. వ్యవసాయ పరికరాలకు రైతులు జమచేసిన రాయితీ మొత్తాన్ని వారి ఖాతాల్లో వేస్తున్నాం. ట్రాక్టర్ల కింద 202 మంది దరఖాస్తు చేసుకోగా 160 మంది వరకు రాయితీ కట్టారు. 56 వరికోత యంత్రాలను 36 మందికి మంజూరు చేశాం.


సాగుకు సిద్ధం చేస్తున్న పొలం 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని