logo

ఆదిలోనే హంసపాదు..

పశు సంచార వైద్యశాలలకు ఆదిలోనే ఆటంకాలు ఎదురయ్యాయి. చెప్పిందొకటి.. చేసేదొకటిగా మారడంతో సిబ్బందికి వెతలు తప్పడం లేదు.. దాంతో పశు సంచార వైద్యశాలల సిబ్బంది విధులకు దూరంగా ఉంటున్నారు..

Published : 29 May 2022 01:39 IST

నిలిచిన పశు సంచార వైద్యశాలల సేవలు

పశు సంచార వైద్యశాల వాహనం వద్ద సేవలందిస్తున్న సిబ్బంది

నెల్లూరు (వ్యవసాయం), న్యూస్‌టుడే : పశు సంచార వైద్యశాలలకు ఆదిలోనే ఆటంకాలు ఎదురయ్యాయి. చెప్పిందొకటి.. చేసేదొకటిగా మారడంతో సిబ్బందికి వెతలు తప్పడం లేదు.. దాంతో పశు సంచార వైద్యశాలల సిబ్బంది విధులకు దూరంగా ఉంటున్నారు.. జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గానికో అంబులెన్స్‌ను ప్రభుత్వం మంజూరు చేసింది. దీనికి ప్రత్యేకంగా కాల్‌ సెంటర్‌ను కేటాయించింది. మారుమూల గ్రామాల్లోని పాడి రైతులకు సేవలందించేందుకు ఏర్పాటు చేసిన వీటి సేవలు అర్ధాంతరంగా ఆగిపోయాయి. వాస్తవానికి కాల్‌ సెంటర్‌ ద్వారా వచ్చిన సమాచారం మేరకు ఆయా ప్రాంతాలకు వెళ్లి పశువులకు చికిత్సను అందించడం వీటి ఉద్దేశం. వీరు చేరిన కొన్ని రోజుల తర్వాత జీవోలను విడుదల చేసి ఆర్‌బీకేల్లో ప్రతిరోజు రిపోర్టు చేయాలని సూచించారు. వాస్తవానికి వీరిని విధుల్లోకి తీసుకొనే ముందు ఈ విషయాన్ని తెలియజేయలేదు. వీరికి వస్తున్న సమాచారం మేరకు గ్రామాలకు వెళ్లి సేవలందించడమే వీరి బాధ్యత. ఇప్పటికే ప్రభుత్వం ద్వారా శాశ్వత ఉద్యోగులుగా పనిచేస్తున్న వీఏఎస్‌లు ఆర్‌బీకేలకు వెళ్లాల్సి ఉంటోంది. వీరిని పక్కనబెట్టి ప్రతిరోజు అంబులెన్స్‌ వైద్యులను ఆర్‌బీకేలకు వెళ్లి హాజరవ్వాల్సిందిగా చేయడంపై వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.మరోవైపు రూ.40 వేల జీతంలో రూ.31 వేలు ఇస్తూ.. మిగతా నగదును కటింగ్‌ల రూపంలో పట్టుకుంటున్నారు. దీనిపై వారు తమకు ఇచ్చే జీతం రూ.50 వేలు ఇవ్వాలని, ఆపైన కటింగ్‌ల రూపంలో అన్నీ పోనూ చేతికి రూ.40 వేలు అందజేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. మరోవైపు శాశ్వత ప్రాతిపదికన తీసుకుంటే రైతులకు ఎంతో ప్రయోజనకరంగా సేవలు అందుతాయని చెబుతున్నారు. ఈ కారణాలతో వీరు శుక్రవారం నుంచి అంబులెన్స్‌ సేవలను నిలిపేశారు. దాంతో పథకం ప్రారంభించిన కొద్దిరోజులకే ఆటంకాలు ఏర్పడటంతో జిల్లాలో చర్చనీయాంశమైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని