logo

జూనియర్‌ కళాశాలల్లో ఆకలి కేకలు

ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులందరూ నిరుపేద కుటుంబాలకు చెందినవారు.. సుదూర ప్రాంతాల నుంచి రావాల్సి ఉంది. ఆ సమయానికి ఇళ్లల్లో భోజనం సిద్ధం కాకపోవడంతో చదువుల కోసం విద్యాలయాలకు వచ్చేవారు.

Published : 23 Jan 2023 02:22 IST

మూడున్నరేళ్లుగా అమలు కాని మధ్యాహ్న భోజనం

న్యూస్‌టుడే, నెల్లూరు (విద్య): ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులందరూ నిరుపేద కుటుంబాలకు చెందినవారు.. సుదూర ప్రాంతాల నుంచి రావాల్సి ఉంది. ఆ సమయానికి ఇళ్లల్లో భోజనం సిద్ధం కాకపోవడంతో చదువుల కోసం విద్యాలయాలకు వచ్చేవారు. సాయంత్రం తరగతులు ముగిశాక ఇళ్లకు వెళ్లే వరకు ఖాళీ కడుపులతోనే ఉంటుండటంతో 2018లో రాష్ట్ర ప్రభుత్వం కళాశాలల్లోనూ మధ్యాహ్న భోజనం అమలు చేసింది. దీనికి మంచి స్పందన వచ్చింది. విద్యార్థుల హాజరు శాతం పెరిగింది. ఆ తర్వాత వైకాపా ప్రభుత్వం ఈ పథకాన్ని అటకెక్కించడంతో మూడున్నరేళ్లుగా విద్యార్థులు ఆకలితో అలమటిస్తున్నారు.

గ్రామీణ ప్రాంత విద్యార్థుల అవస్థలు

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో చదివే విద్యార్థులు చాలా వరకు గ్రామీణ ప్రాంతాలకు చెందిన పేదవారే. వారు పదో తరగతి తర్వాత ఇంటర్‌ విద్యను కొనసాగించేలా ప్రోత్సాహం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జూనియర్‌ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని 2018లో ప్రవేశపెట్టింది. ఉదయం ఇంటి వద్ద పనులు చేసుకుని కళాశాలకు వచ్చే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఇదెంతో ఉపయుక్తంగా ఉండేది. 2019లో అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం ఈ పథకాన్ని రద్దు చేసింది. అప్పట్లో తిరిగి ప్రారంభిస్తామని చెప్పిందే తప్ప.. నేటికీ అమలు చేసిన దాఖలాలు లేవు. గ్రామీణ ప్రాంతాల్లో వేకువజామునే తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లడంతో మధ్యాహ్న భోజనం ఇళ్లలో సిద్ధం చేసేవారు లేక క్యారేజీలు తెచ్చుకోవడం లేదు. ఒక వైపు పుస్తకాలు అందించకపోగా.. మరోవైపు మధ్యాహ్న భోజనం లేక పేద విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. జిల్లాలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు 23 ఉన్నాయి. వీటిలో ప్రథమ, ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు 7,800 మంది వివిధ కోర్సులు చదువుతున్నారు. దీనికి తోడు గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలోని జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాలల్లో ఇంటర్మీడియట్‌ విద్యను ప్రారంభించింది. మొదట 18 పాఠశాలలను ప్రతిపాదించినా 12 చోట్ల బాలికలకు మాత్రమే మొదటి విడతగా ఇంటర్‌ విద్యను అందించారు. ఆయా కళాశాలల్లో 180 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరందరూ మధ్యాహ్న భోజనానికి అవస్థలు పడుతున్నారు.


ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం
మధుబాబు, జిల్లా వృత్తి విద్యాశాఖాధికారి

గతంలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించేవారు. ఇది పేద విద్యార్థులకు అనుకూలంగా ఉండేది. ఆ తర్వాత ప్రభుత్వం దీన్ని నిలిపేసి అమ్మఒడి, తదితర పథకాలను అమలు చేస్తోంది. కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అందించే విషయాన్ని రాష్ట్ర ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని