logo

ఓటింగ్‌ శాతం పెంచడమే లక్ష్యం

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా.. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్‌ హరినారాయణన్‌ తెలిపారు.

Published : 16 Apr 2024 03:12 IST

18 నుంచి నామినేషన్ల ప్రక్రియ కలెక్టర్‌ హరినారాయణన్‌

ఈనాడు, నెల్లూరు: కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా.. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్‌ హరినారాయణన్‌ తెలిపారు. ఈ నెల 18 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని మీడియా సెంటర్‌ వద్ద ఆయన ఎన్నికల ఏర్పాట్లపై వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..

సెలవు రోజులు మినహాయించి..

జిల్లాలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఆయా రిటర్నింగ్‌ అధికారుల కార్యాలయాలు, లోక్‌సభ నియోజకవర్గానికి నెల్లూరు కలెక్టరేట్‌లోని ఆర్వో కార్యాలయంలో నామినేషన్లు స్వీకరిస్తారు. అందుకు రిటర్నింగ్‌ అధికారులు ఫారం 1 నోటిఫికేషన్‌ ఈ నెల 18న విడుదల చేస్తారు. అప్పటి నుంచి 25 వరకు ప్రభుత్వ సెలవులు మినహాయించి.. మిగిలిన రోజుల్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు.

ఫారం7 ద్వారా అభ్యర్థుల ప్రకటన

పోటీలో నిలిచిన అభ్యర్థులను ఫాం-7ఎ ద్వారా ప్రకటిస్తాం. మే 12 వరకు పోస్టల్‌ బ్యాలెట్లు, శిక్షణ మొదలైన ఎన్నికల ప్రక్రియ కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతాయి. మే 12న పోలింగ్‌ సిబ్బందికి ఈవీఎంలు, వీవీ ప్యాట్‌లు, స్టేషనరీ, ఇతర పోలింగ్‌ సామగ్రి అందిస్తాం. ముందుగా నిర్ణయించిన రూట్‌ మ్యాప్‌ మేరకు ఆయా కేంద్రాలకు సిబ్బందిని వాహనాల్లో పంపుతాం. మే 13న పోలింగ్‌ ప్రక్రియ జరుగుతుందన్నారు.  

పోస్టల్‌ బ్యాలెట్‌కు..

మే 3వ తేదీ వరకు పోస్టల్‌ బ్యాలెట్లు ప్రింట్‌ అవుతాయి. కేటగిరీల వారీగా అందిస్తాం. మీడియా, పోలీసువారు ఆయా ఆర్వో కార్యాలయాల్లోనే వాటిని వినియోగించుకునేలా ప్రణాళిక రూపొందిస్తాం. సర్వీసు ఓటర్లు.. ఓటరు పెసిలిటేషన్‌ కేంద్రాల్లో మాత్రమే వినియోగించుకోవాలి. ఎన్నికల సిబ్బందికి శిక్షణ ఇస్తున్న కేంద్రాల్లో ఓటరు ఫెసిలిటేషన్‌ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం.

58 కేసుల నమోదు..

ఇప్పటి వరకు రూ. 2.63 కోట్ల విలువైన నగదు, మద్యం, ఇతర వస్తువులు సీజ్‌ చేశారు. ఇప్పటి వరకు 58 కేసులు నమోదు కాగా- 35 పరిష్కరించాం. 23 పరిశీలనలో ఉన్నాయి. వెబ్‌ కెమెరాతో నమోదు చేస్తున్నాం.

అవగాహన కార్యక్రమాలు

బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు తదితర ప్రాంతాల్లో ఓటరు ఫెసిలిటేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేసి.. ఏ పోలింగ్‌ కేంద్రంలో ఓటు ఉందో తెలిసేలా చర్యలు చేపట్టాం. జిల్లాలో గతానికంటే.. ఎక్కువగా ఓటింగ్‌ శాతం పెంచడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని