logo

కేసరగుంట.. అవస్థలేనంట

పట్టణంలో అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో కేసరగుంట కాలనీ ఒకటి. పల్లెల నుంచి కందుకూరు పట్టణానికి వలస వచ్చే వారు ఈ ప్రాంతంలోనే నూతన భవనాలు నిర్మించుకుంటున్నారు.

Published : 17 Apr 2024 03:42 IST

మౌలిక వసతుల లేమితో స్థానికుల అవస్థలు 

కందుకూరు పట్టణం, న్యూస్‌టుడే: పట్టణంలో అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో కేసరగుంట కాలనీ ఒకటి. పల్లెల నుంచి కందుకూరు పట్టణానికి వలస వచ్చే వారు ఈ ప్రాంతంలోనే నూతన భవనాలు నిర్మించుకుంటున్నారు. మౌలిక వసతుల సమస్య కాలనీని తీవ్రంగా వేధిస్తోంది. కాలువలు, రోడ్లు లేక స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో కాలనీ మొత్తం చెరువును తలపిస్తోంది. ఎగువన ఉన్న కేసరగుంట సంగం, అగ్నిమాపక కార్యాలయం, సింహాద్రినగర్‌ పడమర ప్రాంతాల నుంచి వరద భారీగా చేరుతోంది. దీంతో ఆ ప్రాంతంలో ఉన్న రెండు ప్రైవేటు పాఠశాలలు మధ్య మోకాల్లోతు నీళ్లు నిలుస్తున్నాయి. భారీ వర్షం పడినప్పుడు ఇక పరిస్థితి వర్ణనాతీతం. కాలనీలోని భూములు ఆర్‌ఎస్‌ఆర్‌లో ప్రైవేటు భూములున్నా.. గతంలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో తయారు చేసిన మాస్టర్‌ప్లాన్‌లో ఈ కాలనీని కుంటగా నమోదు చేయడంతో అనుమతులు రావడం లేదు. సుమారు 10 ఏళ్ల నుంచి ఈ ప్రాంతంలో నూతనంగా ఇల్లు కట్టుకునే వారికి మున్సిపాలిటీ నుంచి ప్లాన్‌ అనుమతులు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమస్యపై పలుమార్లు మున్సిపల్‌, సబ్‌కలెక్టర్‌ కార్యాలయాల్లో స్థానికులు వినతిపత్రాలు అందజేసినా సమస్య పరిష్కారం కాలేదు.


అనుమతులు రావడం లేదు :

యు.విష్ణు.

మాకు కేసరగుంట ప్రాంతంలో ఇంటి స్థలం ఉంది. ఇల్లు కట్టుకుందామని అనుకుంటే మున్సిపాలిటీ నుంచి ప్లాన్‌ అనుమతులు రావడం లేదు. కుంట భూమిగా నమోదై ఉన్న కాలనీ ప్రైవేటు భూమిగా మారాలంటే నూతన మాస్టర్‌ప్లాన్‌ అమలులోకి రావాలని చెబుతున్నారు. మా సమస్య ఎప్పటికీ పరిష్కారమవుతుందో తెలియడం లేదు.


కాలువల్లేక మురుగు పారక..

బి.కృష్ణారావు

కాలనీలో రోడ్లు, కాలువలు లేక ఇబ్బంది పడుతున్నాం. వర్షాకాలం వచ్చిందంటే ఇళ్ల పక్కన ఖాళీ స్థలాల్లో నీరు నిల్వ ఉంటోంది. దోమలు, పందుల బెడద అధికంగా ఉంటుంది. కాలువలు ఏర్పాటు చేయాలని అనేకసార్లు విన్నవించాం. అధికారులు పట్టించుకోవడం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని