logo

జనానికి ‘జగన్‌’ షాక్‌

‘విద్యుత్తు రేట్లను పూర్తిగా తగ్గించేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా’.. అంటూ 2019, మే 30న ప్రమాణ స్వీకారం అనంతరం.. అదే వేదికపై నుంచి  మొదటి ప్రసంగంలో తానిచ్చిన మాటను సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తప్పారు.

Updated : 19 Apr 2024 05:28 IST

మాటతప్పి అయిదేళ్లలో అయిదుసార్లు పెంపు
రకరకాల పేర్లతో రూ.852.58 కోట్ల అదనపు భారం
ఈనాడు, నెల్లూరు: విద్య, న్యూస్‌టుడే

‘విద్యుత్తు రేట్లను పూర్తిగా తగ్గించేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా’.. అంటూ 2019, మే 30న ప్రమాణ స్వీకారం అనంతరం.. అదే వేదికపై నుంచి  మొదటి ప్రసంగంలో తానిచ్చిన మాటను సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తప్పారు. అయిదేళ్లలో అయిదుసార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచి.. ప్రజలకు షాక్‌ ఇచ్చారు. అసలు బిల్లు మూరెడైతే.. కొసరు బిల్లు బారెడు అయింది. ట్రూఅప్‌, ఇంధన సర్దుబాటు ఛార్జీలు(ఎఫ్‌పీపీసీఏ).. పేర్లతో అదనపు భారాన్ని ప్రజలపై మోపారు. ఏ ఇంటి విద్యుత్తు బిల్లు చూసినా.. ప్రభుత్వ టారిఫ్‌ ప్రకారం వినియోగించిన విద్యుత్తుకు వసూలు చేసే మొత్తంతో పాటు ట్రూఅప్‌, ఎఫ్‌పీపీసీఏ (2021-22), ఎఫ్‌పీపీసీఏ(6/2023) పేర్లతో అదనపు ‘బాదుడే బాదుడు’కు తెరదీశారు.

మె పేరు దారా మరియమ్మ. నెల్లూరు నగరం కొండాయపాళెం పరిధిలోని నక్కలగుంట దగ్గర తన తల్లికి ఇందిరమ్మ ఇళ్లు పథకంలో ఎప్పుడో ఇచ్చిన ఇంట్లో మనవరాలితో కలిసి ఉంటున్నారు. ప్రస్తుతం అదీ శిథిలావస్థకు చేరుకుంది. ఒక లైటు, ఫ్యాన్‌, టీవీ మాత్రమే ఉన్నాయి. ఈ ఇంటికి రూ. 1150 విద్యుత్తు బిల్లు రావడంతో ఆమె కంగుతిన్నారు. ఇంటి ముందు కూరగాయలు పెట్టుకుని.. అందులో వచ్చే డబ్బుతో కడుపు నింపుకొనే మేము.. అంతేసి బిల్లులు ఎలా కట్టగలమని వాపోయారు. గతంలో ఉచితంగా ఇచ్చేవారని,  ఇప్పుడు బిల్లు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

వైకాపా అధికారంలోకి రాక ముందు చెప్పిన మాటలకు.. అధికారంలోకి వచ్చిన తర్వాత చేతలకు తేడా అర్థం కావడానికి ప్రజలకు అట్టే సమయం పట్టలేదు. పేదలకు విద్యుత్తు ఛార్జీలతో షాక్‌ ఇచ్చారు. ఏటా ఏదో ఒక పేరుతో భారం మోపి నడ్డి విరిచారు. సంక్షేమం పేరుతో ఒక చేత్తో ఇచ్చి.. మరో చేత్తో విద్యుత్తు ఛార్జీల రూపంలో ఎలా లాగేసుకున్నారో తెలుసుకునేందుకు భారీగా వస్తున్న విద్యుత్తు బిల్లులే నిదర్శనంగా నిలిచాయి. 2014-15 నుంచి 2018-19 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి నష్టాలు వచ్చాయంటూ.. ఆ సమయంలో వినియోగించుకున్న ప్రతి యూనిట్‌కు 22 పైసల మేర లెక్కకట్టి బిల్లులో విధించారు. ప్రతి నెలా బిల్లు వచ్చీ రావడంతోనే ట్రూఅప్‌, ఎఫ్‌పీపీసీఏ భారం ఎంత పడిందో చూసుకునే దుస్థితిని వినియోగదారులకు ప్రభుత్వం కల్పించింది. ఏడాదిలో విద్యుత్తు కొనుగోలు, ఇతర ఖర్చులకు ఏపీఆర్‌సీ అనుమతించిన మొత్తానికి అదనంగా చేసిన ఖర్చును ట్రూఅప్‌ పేరుతో డిస్కంలు వసూలు చేశాయి. నెల్లూరు సర్కిల్‌ పరిధిలో మొత్తం 12 లక్షలకుపైగా విద్యుత్తు కనెక్షన్లు ఉండగా- వీటిల్లో గృహ, వాణిజ్య, పారిశ్రామిక కనెక్షన్లపైనే ఎక్కువ మోపారు. నికరంగా 10 లక్షల మంది వినియోగదారులపై మొత్తం రూ. 852.58 కోట్ల మేర అదనపు భారం వేశారు.

అదనపు వడ్డింపు ఇలా...

  • ట్రూఅప్‌ ఛార్జీలు యూనిట్‌కు 17 పైసల చొప్పున.. నెల్లూరు సర్కిల్‌ వినియోగదారుల నుంచి నెలకు రూ. 6.85 కోట్లు వసూలు చేశారు. 2022 ఆగస్టు నుంచి ఇప్పటి వరకు జిల్లాలో వినియోగదారుల నుంచి రూ. 116.61 కోట్లు వసూలు చేశారు.
  • ఎఫ్‌పీపీసీఏ-2 పేరుతో 2023 మే నుంచి యూనిట్‌కు 40 పైసల చొప్పున మరో భారం మోపుతున్నారు. సర్కిల్‌లో రోజుకు సగటున 13.45 మి.యూనిట్ల విద్యుత్తు వినియోగం జరుగుతోంది. ఆ లెక్కన నెలకు రూ. 16.14 కోట్ల అదనపు సుంకం విధిస్తున్నారు. ఇప్పటికే 12 నెలల నుంచి నెలకు రూ. 16.14 కోట్ల చొప్పున రూ. 484.20 కోట్లు వినియోగదారుల నుంచి వసూలు చేశారు. మరో ఏడాది పాటు ఈ ఇంధన కొనుగోలు సర్దుబాటు ఛార్జీల భారం ప్రజలు మోయాల్సిందే.

రెట్టింపు అయ్యింది

- యూ.లక్ష్మి, కందుకూరు

గతంలో మాకు రూ. 250 వచ్చేది. ఇప్పుడు రూ. 250 నుంచి రూ. 600 వస్తుంది. ఫ్యాన్లు, లైట్లు వేయాలంటే భయపడాల్సి వస్తోంది. గత కొన్నేళ్లుగా.. 3, 4 నెలలకు ఒకసారి ఛార్జీలు పెరుగుతున్నాయి. ఇందులో ట్రూఅప్‌, ఎఫ్‌పీపీసీఏ బిల్లులు కలిపి వడ్డిస్తున్నారు. పెరిగిన బిల్లులు కట్టాలంటే కష్టంగా మారింది.  


ఎలా భరించగలం..

- బడితల నాంచారమ్మ, ఉలవపాడు

విద్యుత్తు బిల్లులు భరించలేకున్నాం. నెలవారీ ఖర్చులు పెరిగిపోయాయి.  గతంలో రూ.125నుంచి రూ.145 వచ్చే  బిల్లులు శ్లాబ్‌ సిస్టం మార్చడంతో రూ.600 వరకు వస్తోంది.

జిల్లాలో కనెక్షన్లు..(సుమారుగా)!

  • గృహ: 9,04,358
  • వాణిజ్య: 88,190
  • పరిశ్రమలు: 4,148
  • వ్యవసాయం: 1,61,878
  • ఆక్వా: 26,230
  • హెచ్‌టీ: 658
  • ఇతర: 24,897
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని