logo

హామీ ఇచ్చి.. కష్టాల్లో ముంచి

పాదయాత్రలో 3,648 కిలోమీటర్లు నడిచా... ప్రజలు పడుతున్న కష్టాలు విన్నా... కళ్లారా చూశా...  రాష్ట్రంలో సహాయం కోసం ఎదురుచూస్తున్న ప్రతి మనిషి, కుటుంబానికి ఒక మాట ఇస్తున్నా... నేను విన్నాను... నేను ఉన్నాను అని మాట ఇస్తున్నా...

Updated : 24 Apr 2024 05:16 IST

ఒప్పంద ఉద్యోగుల ఆవేదన
న్యూస్‌టుడే, దుత్తలూరు

పాదయాత్రలో 3,648 కిలోమీటర్లు నడిచా... ప్రజలు పడుతున్న కష్టాలు విన్నా... కళ్లారా చూశా...  రాష్ట్రంలో సహాయం కోసం ఎదురుచూస్తున్న ప్రతి మనిషి, కుటుంబానికి ఒక మాట ఇస్తున్నా... నేను విన్నాను... నేను ఉన్నాను అని మాట ఇస్తున్నా...

2019 ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్‌ పదేపదే చెప్పిన మాటలు


గోపాలమిత్ర

జిల్లాలో 37 మండలాల్లో 300కు పైగా గోపాలమిత్రలు పనిచేస్తున్నారు. వీరికి గతంలో నెలకు రూ. 3,500 అందే గౌరవ వేతనాన్ని తెదేపా ప్రభుత్వ హయాంలో రూ. 6,500కు పెంచారు. ముఖ్యమంత్రి జగన్‌ పాదయాత్రలో అధికారంలోకి రాగానే గోపాలమిత్రలకు ఉద్యోగ భద్రత కల్పించడంతోపాటు గౌరవ వేతనాన్ని పెంచుతామని హామీ ఇచ్చారు. పాలన చేపట్టి అయిదేళ్లు పూర్తవుతున్నా పైసా కూడా పెంచలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగ భద్రత ఎటూ కల్పించలేదు. ఆపై పైసా పెంపుదల లేదని వారు ఆవేదన చెందుతున్నారు. ఉద్యోగంలో చేరిన ప్రారంభంలో పాడి పశువులకు వైద్య చికిత్స అందిస్తే సంబంధిత రైతులు తగిన మొత్తం ఇచ్చేవారని జీతం ప్రవేశపట్టాక ఎటూ సరిపోక ఇబ్బందులు పడుతున్నామని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పెట్టా పెట్టదు.. రైతులనూ ఇవ్వనివ్వదన్నట్లు తమ పరిస్థితి తయారైందని వాపోతున్నారు.

ఎస్‌ఎస్‌ఏ

సమగ్రశిక్షా అభియాన్‌ కింద మండల వనరుల కేంద్రాల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్లు, అకౌంటెంట్లు, సీఆర్పీలుగా పనిచేస్తున్నా ఒప్పంద ఉద్యోగులు జిల్లాలో 476 మంది వరకు ఉన్నారు. వీరందరికీ గత ప్రభుత్వ కాలంలో నెలకు రూ. 18 వేలు చెల్లించారు. దీన్ని మరో రూ.5,500 పెంచుతూ రూ. 23,500కు తీసుకెళ్లారు. అప్పటి ప్రతిపక్ష నాయకుడు జగన్‌ పాదయాత్రలో వీరి ఉద్యోగ సేవలను క్రమబద్ధీకరించడంతోపాటు జీతభత్యాలను రూ. 8 వేల వరకు పెంచుతామని హామీ ఇచ్చారు. అయిదేళ్లలో అయిదు పైసలు పెంచకపోగా సేవల క్రమబద్ధీకరణ నీటి మీద రాతలా అయిందని వారు వాపోతున్నారు. ప్రత్యేక అత్యవసరాల చిన్నారుల కోసం పనిచేసే ఐఈఆర్టీలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆరోగ్య మిత్రలు, వైద్య ఆరోగ్య శాఖలో ఒప్పంద ఉద్యోగులు వేల మంది నిరాశ పడ్డారు. ఒప్పంద ఉద్యోగులకు జీతాలు పెంచలేదు. ఆందోళనలు, నిరసనలు చేసినా ప్రభుత్వ స్పందించలేదన్న విమర్శలొస్తున్నాయి.

దుత్తలూరులో అత్యవసరాలు కలిగిన పిల్లలకు పాఠాలు బోధిస్తున్న ఐఈఆర్టీ


వేతనం పెంచితే ఒట్టు
నారాయణ, ఒప్పంద ఉద్యోగి

పాదయాత్రలో గౌరవ వేతనం పెంచడంతోపాటు ఉద్యోగ భద్రత కల్పిస్తామని సీఎం జగన్‌ భరోసా ఇచ్చారు. ఎంతో సంతోషించాం. ఐదేళ్లుగా హామీ నెరవేరలేదు. ఏటా ఆశగా ఎదురుచూస్తున్నాం. అయినా ఎలాంటి ఫలితం లేదు. ప్రభుత్వానికి వినతిపత్రాలు ఇచ్చినా ఫలితం శూన్యం. మా బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. గౌరవ వేతనం పెంచడంతోపాటు ఉద్యోగ భద్రత కల్పిస్తే ఒప్పంద ఉద్యోగులకు ఎంతో మేలు జరుగుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని