logo

అయిదేళ్ల కథ.. గోషా ఆసుపత్రి వ్యథ!

మహిళలకు ప్రత్యేకంగా ఆసుపత్రిని ఏర్పాటు చేసి.. అత్యాధునిక వైద్య సేవలు అందిస్తామని వైకాపా ప్రజాప్రతినిధులు, నాయకులు ఊకదంపుడు ఉపన్యాసాలు చేశారు.

Published : 24 Apr 2024 04:42 IST

గోషా ఆసుపత్రి భవనానికే పరిమితం

నెల్లూరు(నగరపాలకసంస్థ): న్యూస్‌టుడే:  మహిళలకు ప్రత్యేకంగా ఆసుపత్రిని ఏర్పాటు చేసి.. అత్యాధునిక వైద్య సేవలు అందిస్తామని వైకాపా ప్రజాప్రతినిధులు, నాయకులు ఊకదంపుడు ఉపన్యాసాలు చేశారు. నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ మరో అడుగు ముందుకేసి.. ఆసుపత్రిని నిర్మించి, ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే.. ఎన్నికల్లో ఓట్లు అడుగుతామని సెలవిచ్చారు. 23.1.2021న రాష్ట్ర మంత్రులు బొత్స సత్యనారాయణ, బాలినేని శ్రీనివాసరెడ్డిలతో శంకుస్థాపన చేశారు.  ఎన్నికలైతే వచ్చాయి గానీ.. మూడేళ్లుగా భవన నిర్మాణం కొనసాగుతూనే ఉంది.

రూ. 3.82 కోట్లతో..

నెల్లూరు నగరంలోని 48వ డివిజన్‌ పాత మున్సిపల్‌ కార్యాలయం సమీపంలో గోషా ఆసుపత్రి నిర్మించాలని ప్రతిపాదించారు. ప్రజారోగ్య, పురపాలక సాంకేతికశాఖ ఆధ్వర్యంలో రూ. 3.82 కోట్లతో నిర్మించాలని నిర్ణయించి.. గుత్తేదారుకు పనులు అప్పగించారు. అధికార పార్టీ నాయకుడి అనుచరుడికే పనులు కట్టబెట్టగా.. గత మూడేళ్లుగా నత్తనడకన సాగుతున్నాయి. భవనం మాత్రమే నిర్మించి.. సున్నం వేసి వదిలేశారు.  

పట్టించుకుంటే ఒట్టు..

ఆసుపత్రి అందుబాటులోకి వస్తుందని ఎదురు చూసిన నగర మహిళలకు నిరాశే ఎదురవుతోంది. భవనం కట్టి.. పూర్తి చేసినట్లు వైకాపా నాయకులు ప్రచారం చేసుకుంటుండగా- వైద్య సేవలకు అవసరమైన ఆపరేషన్‌ థియేటర్‌, కాన్పుల గది తదితర సౌకర్యాల కల్పనకు మరో మూడేళ్లు పట్టేలా ఉంది. భవనానికి శంకుస్థాపన చేసిన పాలకులు.. అనంతరం పట్టించుకున్న దాఖలాలు లేవు.


మూడేళ్లుగా ఎదురుచూపులే
- షమీమ్‌, కోటమిట్ట

గోషా ఆసుపత్రి నిర్మించి మహిళలకు ప్రత్యేక వైద్య సేవలు అందిస్తామని వైకాపా నాయకులు పలుమార్లు చెప్పారు. భవనం కట్టేందుకు మూడేళ్లు పట్టింది. సౌకర్యాలు కల్పించాలంటే... మరెన్నేళ్లు పడుతుందో?


మాటలకే పరిమితం
- రోషిణి, మన్సూర్‌నగర్‌

వైకాపా నాయకులు ఏడాదికే అందుబాటులోకి తెస్తామన్నారు. మాటలైతే చెప్పారుగానీ.. ఆసుపత్రి మాత్రం నిర్మించలేదు.  నిర్మించి మహిళలకు అంకితం చేస్తామన్న మాటలు ఏమయ్యాయో తెలియడం లేదు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు