logo

వేటగాళ్ల ఎరకు దినసరి కూలీ బలి

అడవి పందులు, ఇతర అటవీ జంతువుల కోసం పెట్టిన విద్యుత్తు తీగలు తగిలి దినసరి కూలీ బలయ్యారు. భీమ్‌గల్‌ ఎస్సై శ్రావణ్‌కుమార్‌ కథనం ప్రకారం.. కుప్కల్‌ గ్రామానికి చెందిన

Published : 28 Jan 2022 03:23 IST

విద్యుదాఘాతంతో అక్కడిక్కడే మృతి

కుప్కల్‌ అటవీ ప్రాంతం నుంచి మృతదేహాన్ని తరలిస్తున్న ఎస్సై శ్రావణ్‌కుమార్‌

భీమ్‌గల్‌, న్యూస్‌టుడే: అడవి పందులు, ఇతర అటవీ జంతువుల కోసం పెట్టిన విద్యుత్తు తీగలు తగిలి దినసరి కూలీ బలయ్యారు. భీమ్‌గల్‌ ఎస్సై శ్రావణ్‌కుమార్‌ కథనం ప్రకారం.. కుప్కల్‌ గ్రామానికి చెందిన మూడ్‌ బద్దు(48) అనే కూలీ గురువారం ఉదయం 4 గంటలకు వంట చెరకు కోసం అడవికి వెళ్లారు. అటవీ ప్రాంతంలో వేటగాళ్లు అడవి జంతువుల కోసం ఏర్పాటు చేసిన తీగలు ఆయన కాలికి తగలడంతో విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతిచెందారు. ఉదయం అటువైపు వెళ్లిన పశువుల కాపరులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహానికి పంచనామా నిర్వహించి, శవపరీక్షల నిమిత్తం ఆర్మూర్‌ ఆసుపత్రికి తరలించారు. ఆయన భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.


ఆటోను ఢీకొన్న ద్విచక్ర వాహనం.. రాంచంద్రపల్లి(మాక్లూర్‌ గ్రామీణం): రాంచంద్రపల్లి వద్ద 63వ జాతీయ రహదారిపై ఆగి ఉన్న ఆటోను గురువారం సాయంత్రం ద్విచక్రవాహనం ఢీకొంది. ఈ ఘటనలో జక్రాన్‌పల్లికి చెందిన వ్యక్తి గాయపడ్డారు. ఆయణ్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.


మెడలో గొలుసు లాక్కుని పరారు.. నాందేడ్‌, న్యూస్‌టుడే: పొలంలో పనులు చేసుకుంటున్న మహిళ వద్దకు గురువారం ఉదయం ముసుగులు ధరించి ఇద్దరు వ్యక్తులు వచ్చి మెడలోని గొలుసులాక్కుని ద్విచక్ర వాహనంపై పారిపోయిన ఘటన జరిగింది. బోకర్‌ తహసీల్‌ కేంద్రానికి చెందిన సునితా రేడిమ్‌వార్‌ పొలంలో పని చేసుకుంటుండగా ఇద్దరు వ్యక్తులు వచ్చి ఏదో అడిగినట్లు నటించి మెడలోంచి గొలుసు లాక్కున్నారు. బోకర్‌ పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేశారు.


పిస్తోలుతో బెదిరిస్తున్న వ్యక్తి అరెస్టు.. నాందేడ్‌ : పిస్తోలు చూపించి డబ్బులు ఇవ్వాలని బెదిరిస్తున్న యువకున్ని వజీరాబాద్‌ పోలీసులు బుధవారం రాత్రి అరెస్టు చేశారు. పాత కౌఠ రహదారిలో సోమేష్‌ మదన్‌సింగ్‌ అనే యువకుడు పిస్తోలుతో వచ్చి పోయే వారిని బెదిరిస్తున్న విషయం తెలుసుకున్న పోలీసులు నాలుగు దిక్కుల నుంచి వచ్చి అతన్ని అదుపులోకి తీసుకొన్నారు. పిస్తోలు స్వాధీనం చేసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.


యువకుడి అదృశ్యం.. ధర్పల్లి, న్యూస్‌టుడే: మండలకేంద్రానికి చెందిన జెన్నీ రనీల్‌(21) బుధవారం నుంచి కనబడటం లేదని గురువారం అతని అన్నయ్య రఘు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మురళి తెలిపారు.


నిందితుల కోసం గాలింపు.. నిజామాబాద్‌ నేరవార్తలు: నగరంలో ఇటీవల గుట్కా నిల్వలు పట్టుబడిన కేసుకు సంబంధించి పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఇప్పటికే ముగ్గురిని అరెస్టు చేశారు. మరో వ్యక్తి హమీద్‌ గురించి గాలిస్తున్నారు. కర్ణాటకలోని బీదర్‌లో ఉన్న మరో వ్యక్తి వివరాలు ఆరా తీస్తున్నారు. ఈ కేసులో పోలీసులు సీరియస్‌గా దర్యాప్తు జరిపితే అసలు వ్యాపారులు బయటపడే అవకాశం ఉంది. గుట్కాకు కట్టడి పడాలంటే సీపీ నాగరాజు స్వయంగా పర్యవేక్షించాల్సిన అవసరముంది.


సీపీకి ఫిర్యాదు.. ఖలీల్‌వాడి: తొర్తిలో సాంఘిక బహిష్కరణపై ఫిర్యాదు చేయడానికి వెళ్లిన వారిపై ఏర్గట్ల ఎస్సై దురుసుగా ప్రవర్తించారని ఆరోపిస్తూ దళిత, బహుజన, ప్రజా సంఘాల నాయకులు గురువారం సీపీ నాగరాజుకు ఫిర్యాదు చేశారు. అనంతరం ప్రెస్‌క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభాకర్‌, గంగాధర్‌, మాణిక్యం, దేవరాం, సుమన్‌కుమార్‌ తదితరులున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని