logo

రోడ్‌షోలు.. సభలు

లోక్‌సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు కోలాహలం మధ్య నామినేషన్లు సమర్పించారు.

Published : 26 Apr 2024 05:49 IST

సమాయత్తమవుతున్న ప్రధాన పార్టీలు 

ఈనాడు, కామారెడ్డి : లోక్‌సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు కోలాహలం మధ్య నామినేషన్లు సమర్పించారు. పోలింగ్‌కు సమయం దగ్గరపడుతుండడంతో రోడ్‌షోలు, బహిరంగసభలు, కార్నర్‌ సమావేశాలు నిర్వహించేందుకు భారాస, కాంగ్రెస్‌, భాజపాల అభ్యర్థులు సమాయత్తమవుతున్నారు. పార్టీల ఆధ్వర్యంలో నిర్వహించే ర్యాలీలు, సభలకు అధినేతలు, ముఖ్య నేతలు పాల్గొనేలా ప్రణాళికలు రూపొందించారు. వీరితో పాటు స్వతంత్రులు సైతం తమదైన శైలిలో ప్రచారం కొనసాగిస్తున్నారు.

ప్రధాని సభకు భాజపా సన్నాహాలు

ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కాగానే అభ్యర్థిని ప్రకటించిన భాజపా ఇప్పటికే కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్‌ నియోజకవర్గాల్లో మొదటి విడత ప్రచారం పూర్తిచేసింది. క్రియాశీల కార్యకర్తలతో పాటు బూత్‌, శక్తి కేంద్రాల ఇన్‌ఛార్జులు కేంద్ర ప్రభుత్వ పరిపాలనను వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా పరిధిలోని అందోల్‌, నారాయణఖేడ్‌, జహీరాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పట్టుసాధించేందుకు జాతీయస్థాయి నాయకులను ఆహ్వానించి రోడ్‌షోలు, బహిరంగసభలు నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఈ నెల 30న అందోల్‌లో ప్రధాని నరేంద్రమోదీ బహిరంగ సభకు భాజపా ఏర్పాట్లు చేస్తోంది. మెదక్‌, జహీరాబాద్‌ రెండు లోకసభ స్థానాలకు కలిపి ఉమ్మడి బహిరంగసభ నిర్వహించబోతోంది. ఇప్పటికే భాజపా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహించి కార్యకర్తలను ఎన్నికలకు సమాయత్తం చేస్తోంది.

పట్టణాలు, మండలకేంద్రాల్లో కాంగ్రెస్‌ ర్యాలీలు

ఈ నెల 26న జహీరాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రోడ్‌షో నిర్వహించేందుకు కాంగ్రెస్‌ పార్టీ సమాయత్తమవుతోంది. ఇప్పటికే అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ముఖ్యపట్టణాలు, మండల కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఇటీవల ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు గాంధారితో పాటు లింగంపేట మండలాల్లో ర్యాలీలు నిర్వహించారు. మిగిలిన నియోజకవర్గాల్లోనూ ర్యాలీలు నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన నియోజకవర్గాలపై కాంగ్రెస్‌ నేతలు ప్రత్యేక దృష్టి సారించి ప్రచారం చేపట్టేందుకు కార్యాచరణ రూపొందించారు.

గ్రామస్థాయి సమావేశాలకు భారాస కసరత్తు

భారాస లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కార్యకర్తల సన్నాహక సమావేశాలు నిర్వహించింది. మండలస్థాయిలోనూ పూర్తి చేసి గ్రామస్థాయిలో నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. భారాస అధినేత కేసీఆర్‌ వచ్చే నెల 7న కామారెడ్డిలో నిర్వహించే రోడ్‌షోలో పాల్గొననున్నారు. భారాస ముఖ్యనేతలు నియోజకవర్గ, మండల కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని