logo

భూగర్భ మురుగు కాల్వల అనుసంధానానికి.. రూ.162 కోట్లతో ప్రతిపాదనలు

ఇళ్లలో నుంచి వెలువడే మురుగు రహదారిపై కనిపించొద్దని నిజామాబాద్‌ నగరంలో భూగర్భ మురుగు కాల్వలు నిర్మించారు. కానీ ఇంటింటికి పైపులైన్ల అనుసంధానం పూర్తి కాలేదు. దీని కోసం నగరపాలక సంస్థ ప్రజల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది.

Published : 29 Sep 2022 03:21 IST

న్యూస్‌టుడే, నిజామాబాద్‌ నగరం

ప్రగతినగర్‌లో నిర్మించిన ఛాంబర్‌

ళ్లలో నుంచి వెలువడే మురుగు రహదారిపై కనిపించొద్దని నిజామాబాద్‌ నగరంలో భూగర్భ మురుగు కాల్వలు నిర్మించారు. కానీ ఇంటింటికి పైపులైన్ల అనుసంధానం పూర్తి కాలేదు. దీని కోసం నగరపాలక సంస్థ ప్రజల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. కేటగిరీల వారీగా విభజిస్తూ కొంత రుసుం విధించినా నగరవాసుల నుంచి స్పందన రాలేదు. దీంతో సంబంధిత పనుల కోసం అమృత్‌ 2.0 కింద ఏప్రిల్‌లో రూ.162 కోట్లతో అంచనాలు రూపొందించి అధికారులు సర్కారుకు నివేదిక అందించారు. త్వరలో నిధులు విడుదలయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. అదే జరిగితే అనుసంధాన ప్రక్రియ పూర్తయి స్వచ్ఛ ఇందూరుకు బాటలు పడనున్నాయి.

నిజామాబాద్‌ నగరంలో భూగర్భ మురుగు కాల్వల నిర్మాణాన్ని రూ.230 కోట్లతో చేపట్టారు. మొదట్లో పనులు నెమ్మదిగా సాగాయి. 2018 నుంచి వేగం పుంజుకొంది. ప్రధాన దారుల్లో 12.43 కిలోమీటర్లు, అంతర్గత కాలనీల్లో 51.07 కిలోమీటర్ల మేర పైపులైన్లు వేశారు. 2,550 వరకు మ్యాన్‌హోళ్లు, ఇళ్ల పక్కన ఛాంబర్లు 12,143 వరకు నిర్మించారు. ఇందుకు ప్రతిదారిని తవ్వేయడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. మురుగు నీరు శుద్ధి చేసేందుకు దుబ్బ, ఎల్లమ్మగుట్ట ప్రాంతాల్లో రెండుచోట్ల కేంద్రాలు ఏర్పాటు చేశారు.

దెబ్బతింటున్న నిర్మాణాలు
భూగర్భ మురుగు కాల్వ పనులు పూర్తయి ఏడాదిన్నర కావస్తోంది. ఇళ్ల పైపులైను ఛాంబర్లలో కలపాలి. అక్కడి నుంచి మురుగు రోడ్డు మధ్యలో నిర్మించిన మ్యాన్‌హోళ్ల ద్వారా శుద్ధికేంద్రాలకు వెళ్తుంది. ఇంటి పైపులైన్ల అనుసంధానంలో జాప్యం చోటుచేసుకుంది. ఇటు నిర్వహణ లేక కొన్నిచోట్ల ఛాంబర్లు, మ్యాన్‌హోళ్లు పగిలి పైకప్పులు లేచిపోయాయి. కొందరు అనధికారికంగా ఇళ్లలో నుంచి పైపులను ఛాంబర్లలోకి కలిపేసుకున్నారు. దీనివల్ల దుబ్బ ఎస్టీపీలోకి 7 ఎంఎల్‌డీ, ఎల్లమ్మగుట్ట ప్లాంటుకు 5 ఎంఎల్‌డీల మురుగు వస్తోంది. దీన్ని శుద్ధి చేసి పక్కనే ఉన్న కాల్వలోకి వదిలేస్తున్నారు.

నిధులు రాగానే పనులు
- నగేశ్‌రెడ్డి, డీఈ, ప్రజారోగ్య శాఖ

త్వరలోనే నిధులు వస్తాయనే నమ్మకం ఉంది. విడుదల కాగానే ఇంటింటికి పైపులైను అనుసంధానం చేపడతాం. మ్యాన్‌హోళ్లు, ఛాంబర్లను పగలకొడితే చర్యలు తీసుకుంటాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని