logo

మాధ్యమిక విద్య మిథ్య

జిల్లాలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ఇంటర్మీడియట్‌లో విద్యార్థుల ఉత్తీర్ణత గణనీయంగా తగ్గింది. ప్రభుత్వం బుధవారం ప్రకటించిన ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలో చివరిస్థానంలో నిలవడం ఆందోళన కలిగిస్తోంది.

Updated : 26 Apr 2024 06:16 IST

గణనీయంగా తగ్గిన ఇంటర్‌ ఉత్తీర్ణత శాతం

 మాచారెడ్డి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో 135 విద్యార్థులకు ఒక్కరే ఉత్తీర్ణులయ్యారు.

సదాశివనగర్‌ జూనియర్‌ కళాశాలలో ద్వితీయ సంవత్సరంలో 134 మంది విద్యార్థులకు గాను కేవలం ఆరుగురు మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. ప్రథమ సంవత్సరంలో 160 మందికి ఐదుగురు ఉత్తీర్ణులయ్యారు.

ఈనాడు, కామారెడ్డి : జిల్లాలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ఇంటర్మీడియట్‌లో విద్యార్థుల ఉత్తీర్ణత గణనీయంగా తగ్గింది. ప్రభుత్వం బుధవారం ప్రకటించిన ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలో చివరిస్థానంలో నిలవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ కళాశాలలను తీర్చిదిద్దేందుకు అధ్యాపకుల నియామకం, మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోంది. అధ్యాపకుల హాజరుపై పర్యవేక్షణ లోపం, నామమాత్రంగా బోధనతో ఉత్తీర్ణత తగ్గినట్లు విద్యార్థి సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. జిల్లాలోని ప్రభుత్వ కళాశాలల్లో మాధ్యమిక విద్య మిథ్యగా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కొరవడిన  సమీక్షలు

జిల్లా యంత్రాంగం కేవలం ఇంటర్‌ పరీక్షల నిర్వహణపై మాత్రమే సమీక్షిస్తోంది. నిబంధనల మేరకు మూడునెలలకోసారి విద్యాప్రగతి, అధ్యాపకులు, విద్యార్థుల హాజరుపై సమీక్షిస్తూ దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. జిల్లాల విభజన అనంతరం కొత్తజిల్లాలకు పర్యవేక్షణ నిమిత్తం నోడల్‌ అధికారిని నియమించి ఇంటర్‌బోర్డు అధికారులు మమ అనిపిస్తున్నారు. పదోతరగతిలో అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్న విద్యార్థుల ఉత్తీర్ణత శాతం ఇంటర్‌కు వచ్చే సరికి గణనీయంగా తగ్గుతోంది.

నామమాత్రపు బోధనే కారణమా..?

ప్రథమ సంవత్సరంలో జిల్లాలో 8262 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 4146 మంది ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరంలో ఉత్తీర్ణత శాతం పెరగాల్సి ఉండగా తగ్గడం గమనార్హం. గత నాలుగేళ్లతో పోల్చితే ప్రస్తుతం చూచిరాతలు లేకుండా పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించారు. పరీక్షల ప్రారంభంలో సదాశివనగర్‌లో చూచిరాతకు ప్రోత్సహిస్తున్నారనే ఉద్దేశంతో నలుగురు అధ్యాపకులను ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. కట్టుదిట్టంగా పరీక్షల నిర్వహణ, విద్యార్థుల్లో భయాందోళన కారణాలతో ఉత్తీర్ణత తగ్గినట్లు అనధికార సంభాషణల్లో ఇంటర్‌ అధ్యాపకులు చెబుతున్నారు. జిల్లాలోని ప్రైవేటు కళాశాలల్లో సైతం ఉత్తీర్ణత శాతం గణనీయంగా తగ్గింది. ప్రభుత్వ కళాశాలల మాదిరి ఫలితాలను వెల్లడించకుండా ఇవి మాయ చేస్తున్నాయి. అత్యధిక మార్కులు వచ్చిన విద్యార్థుల సమాచారమే వెల్లడిస్తూ ఇతర ఫలితాలను దావేస్తున్నాయి. రూ.వేలల్లో రుసుంలు వసూలు చేస్తున్నా బోధన నామమాత్రమేనని ప్రస్తుత ఫలితాల్లో స్పష్టమైంది.

డిగ్రీ ప్రవేశాలపై  ప్రభావం

జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో 11 వేలకు పైగా సీట్లున్నాయి. ప్రస్తుతం ద్వితీయ సంవత్సరంలో 7234 మంది విద్యార్థులకు 3204 మంది(44.29 శాతం) మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. ఇందులో కొందరు ఇంజినీరింగ్‌, మెడిసిన్‌తో పాటు ఇతరత్రా సాంకేతిక కోర్సుల్లో ప్రవేశం పొందనున్నారు. దీంతో డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలు పడిపోయే అవకాశం ఉంది.


సమీక్ష చేస్తున్నాం

 షేక్‌ సలాం, జిల్లా ఇంటర్‌ నోడల్‌ అధికారి

ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో ఉత్తీర్ణత శాతం తగ్గడంపై సమీక్ష చేస్తున్నాం. గతేడాదితో పోల్చితే ఉత్తీర్ణత తగ్గడానికి కారణాలను తెలుసుకుంటాం. నాణ్యమైన బోధన అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటాం. అనుత్తీర్ణులైన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నాం. తక్కువ ఉత్తీర్ణత సాధించిన కళాశాలలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని