logo

ఖేలో ఇండియా కేంద్రం మంజూరు

అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటేలా క్రీడాకారులను తయారు చేయాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇందు కోసం భారత క్రీడా సంస్థ(సాయ్‌) ఖేలో ఇండియా ప్రాజెక్టును విడతల వారీగా ప్రారంభించింది.

Published : 09 Dec 2022 05:09 IST

న్యూస్‌టుడే, కామారెడ్డి క్రీడావిభాగం

కామారెడ్డిలోని బ్యాడ్మింటన్‌ స్టేడియం

అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటేలా క్రీడాకారులను తయారు చేయాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇందు కోసం భారత క్రీడా సంస్థ(సాయ్‌) ఖేలో ఇండియా ప్రాజెక్టును విడతల వారీగా ప్రారంభించింది. తెలంగాణలో 17 జిల్లాలకు వివిధ క్రీడాంశాలకు సంబంధించి ఖోలో ఇండియా కేంద్రాలు మంజూరు చేసింది. ఇందులో కామారెడ్డి జిల్లాకు బ్యాడ్మింటన్‌ దక్కింది. జిల్లా కేంద్రంలో ఇప్పటికే నడుస్తున్న బ్యాడ్మింటన్‌ అకాడమీలోనే నిర్వహించేందుకు కేంద్రం అనుమతిచ్చింది. దీని నిర్వహణకు 2020లోనే దరఖాస్తులు స్వీకరించగా చాలా మంది పోటీపడ్డారు. చివరకు బ్యాడ్మింటన్‌ అకాడమీనే సాయ్‌ ఎంపిక చేసింది. జిల్లా క్రీడాకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

పర్యవేక్షణ బాధ్యతలు

ఖేలో ఇండియా కేంద్రాన్ని సాయ్‌ ఏర్పాటు చేస్తున్నప్పటికీ దాని పర్యవేక్షణ బాధ్యతలను జిల్లా క్రీడా ప్రాధికారిక సంస్థ(డీఎస్‌ఏ), రాష్ట్ర క్రీడా ప్రాధికారిక సంస్థ(శాట్స్‌)కు అప్పగించారు. అకాడమీ నిర్వాహకులు, అంతర్జాతీయ, జాతీయ స్థాయి పోటీల్లో ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారులను శిక్షకులుగా నియమించి ఉపాధి అవకాశం కల్పిస్తారు. నిర్వహణ నిధులను కేంద్ర ప్రభుత్వమే విడుదల చేస్తుంది. ఏడాదికి రూ.5 లక్షలు, శిక్షకుడికి రూ.3 లక్షలు చెల్లిస్తారు. క్రీడా పరికరాలు పంపిణీ చేస్తారు.

ఆధునిక ఇండోర్‌ స్టేడియం

జిల్లా కేంద్రానికి చెందిన జాతీయ క్రీడాకారుడు సందీప్‌గౌడ్‌ ఆధునిక హంగులతో బ్యాడ్మింటన్‌ ఇండోర్‌ స్టేడియం నిర్మించారు. అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటాలనే ఆయన కల వసతుల లేమి కారణంగా నెరవేర్చుకోలేకపోయారు. తనలా మరో క్రీడాకారుడికి కాకూడదనే ఉద్దేశంతో కామారెడ్డిలోనే అంతర్జాతీయ ప్రమాణాలతో స్టేడియం నిర్మించారు. ఇందులో రెండు వుడెన్‌(చెక్క) కోర్డులు ఉన్నాయి. స్వయంగా విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. కొందరు పేద పిల్లలకు ఉచితంగా నేర్పుతున్నారు. ఇప్పటి వరకు ఎనిమిది మంది విద్యార్థులు జాతీయస్థాయి టోర్నీలు ఆడారు. ఖేలో ఇండియా కేంద్రం కోసం దరఖాస్తు చేసుకోవడంతో మంజూరైంది.

ఖరీదైన పరికరాలు

బ్యాడ్మింటన్‌ క్రీడ చాలా ఖరీదైంది. వుడెన్‌ కోర్టులు, రాకెట్లు, మ్యాట్‌లు, దుస్తులు, బూట్లు వంటి వాటికి వేల రూపాయలు వెచ్చించాలి. ఖేలో ఇండియా కేంద్రం మంజూరవ్వడంతో క్రీడాకారులకు ఇవన్నీ సమకూరే అవకాశం ఉంది.


చాలా ఆనందంగా ఉంది
- సందీప్‌గౌడ్‌, బ్యాడ్మింటన్‌ శిక్షకుడు

నా అకాడమీనే ఖేలో ఇండియా కేంద్రంగా నడపడానికి సాయ్‌ ఉత్తర్వులు జారీ చేసింది. ఎంతో ఖర్చుతో ఈ కేంద్రాన్ని నడుపుతున్నా. ఈ ప్రకటన చాలా ఆనందంగా ఉంది. దేశం గర్వించేలా క్రీడాకారులను తయారు చేస్తా.


మార్గదర్శకాలు రావాలి
దామోదర్‌రెడ్డి, జిల్లా క్రీడల అధికారి, కామారెడ్డి

జిల్లాకు బ్యాడ్మింటన్‌ ఖేలో ఇండియా కేంద్రం మంజూరైంది. స్థానికంగా ఉన్న అకాడమీనే ఎంపిక చేశారు. మార్గదర్శకాలు వచ్చిన తర్వాత మరింత స్పష్టత వస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు