logo

జయహో.. నిక్‌ వుజిసిక్‌

రెండు తెలుగు రాష్ట్రాల్లో నిక్‌ స్వయంగా ప్రేరణ వాక్యాలు వినిపించడానికి పలు విద్యాలయాలు ప్రాధాన్యం ఇచ్చాయి. వుజిసిక్‌ జీవితమే ఏపీలో ఒక పాఠ్యాంశంగా బోధిస్తున్నారు.

Updated : 03 Feb 2023 08:06 IST

కాళ్లు, చేతులు లేకున్నా వక్తగా, రచయితగా రాణింపు
ఆయన జీవితమే ఓ పాఠం  

మనం పనికిరాని వారమని అనుకోవడం పెద్ద అబద్ధం.. మిమ్మల్ని మీరు ప్రేమించిన రోజున ఏదైనా సాధ్యపడుతుంది. ప్రతి వక్తా చెప్పేవి ఇలాంటి స్ఫూర్తి మాటలే కదా వాటిలో కొత్తేముంది అనుకుంటే పొరపాటే..

ప్రపంచ ప్రేరణ వక్త, రచయిత నిక్‌ వుజిసిక్‌ మాటలు ఇవి..


ఆయన జీవితమే ఒక స్ఫూర్తి పాఠం..

అందరిలా కాళ్లు, చేతులు, రెండింట్లో ఏదో ఒకటైయినా సవ్యంగా ఉన్న వ్యక్తి కాదు.. పుట్టుకతోనే అమిలియా సిండ్రోమ్‌ అనే వ్యాధి కారణంగా కేవలం మొండెంతో మాత్రమే పుట్టిన ఆయన సాధారణ వ్యక్తులకు సమానంగా పోటీ పడుతున్నారు. అందుకే విశ్వవ్యాప్తంగా ఆ మాటలు ఉత్తేజ తరంగాలు

న్యూస్‌టుడే, బోధన్‌ పట్టణం


రెండు తెలుగు రాష్ట్రాల్లో నిక్‌ స్వయంగా ప్రేరణ వాక్యాలు వినిపించడానికి పలు విద్యాలయాలు ప్రాధాన్యం ఇచ్చాయి. వుజిసిక్‌ జీవితమే ఏపీలో ఒక పాఠ్యాంశంగా బోధిస్తున్నారు. జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి మంత్రమే. భారతీయ యువతలో అసాధారణ మేధోశక్తి ఉందని చెప్పే ఆయన జీవితంలో ఒక్కో దశను క్లుప్తంగా తెలుసుకుని నేటి సమాజంలో పిల్లలు, ముఖ్యంగా యువత స్ఫూర్తి పొందాల్సిన తరుణమిది. అన్ని అవయవాలు సవ్యంగా ఉన్నా... తమలోని నైపుణ్యాలను నిద్ర లేపడంలో నిర్లిప్తత... సరైన మార్గదర్శన లోపం, వనరులున్నా వినియోగలేమి, చిన్న ప్రతికూలతకే కుంగుబాటు... ఇలాంటి కారణాలతో నేటితరం యువత గమ్యం లేకుండా ప్రయాణిస్తోంది. తమ జీవితాల్లో వెలుగు నింపుకోవడానికి నిక్‌ జీవితం చీకటిలో దివ్వెలా నిలవనుంది.


ముట్టుకోవడానికే సంకోచం..

పుట్టుకతోనే కాళ్లు, చేతులు లేకపోవడంతో తల్లిదండ్రులు తొలుత ముట్టుకోవడానికే భయపడ్డారట. అయినా కన్న మమకారానికి ఆ వైకల్యం అడ్డుకాదని నిరూపించింది. బాధను దిగమింగుతూ అతని పరిస్థితికి తగినట్లు పెంచుతూ వచ్చారు. అదే తల్లిదండ్రులు వదిలేసి ఉంటే... ఈ రోజు నిక్‌ జీవితం ఏమై ఉండేదో కదా?.

* అవును ఈ రోజుల్లో అలాంటి తల్లిదండ్రులే అవసరం. కారణం ఏదైనా పిల్లల పట్ల మమకారం తగ్గిపోతోంది. కుటుంబ కలహాల వల్ల పిల్లలతో సహా ఆత్మహత్యలు చేసుకునే ఘటనలు కలవరపరుస్తున్నాయి. మరికొందరు పిల్లలను నిర్దాక్షిణ్యంగా చెత్తకుప్పలు, పొదల్లో వదిలేసి వెళ్తున్న ఘటనలు ఉంటున్నాయి. పూర్తిగా కాళ్లు, చేతులు లేని వ్యక్తిని ఈ స్థాయికి ఎదిగేలా చేసిన తల్లిదండ్రులే స్ఫూర్తి.


ఎదుటి వారితో  ప్రేరణ పొంది..

కాళ్లు, చేతులు లేని వ్యక్తి సాధిస్తున్న విజయాలపై పత్రికల్లో వచ్చిన వ్యాసం తల్లి చూపించారు. అది చూసి తనంతట తానే అన్ని పనులు చేసుకోవడం అలవరచుకున్నారు. నోటితో రాయడం, శరీరం అడుగు భాగాన ఉన్న చిన్న పాదం సాయంతో కంప్యూటర్‌ కీబోర్డు ఆపరేట్‌ చేయడం వంటివి నేర్చుకున్నారు. అకౌంట్స్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. తల్లి చూపించిన ఒక వ్యాసం ఆయన జీవితం మార్చేసింది.

* మన దగ్గర బాల్యం నుంచే ఇతరులతో పోలికలు చూపించడం అలవాటు. అది మంచి ధోరణి అయితే బాగుంటుంది. మార్కుల విషయంలో దెప్పి పొడవడం ద్వారా ఆత్మవిశ్వాసం బలహీనపరిచే తీరు సమాజంలో ఉంది. ఇక ఈ పోటీ కాస్తా తోటి పిల్లల మధ్య వస్త్రాలు, సెల్‌ఫోన్లు, బైక్‌లలో పోటీ పడే స్థాయికి చేరుకుంటోంది. ఇలాంటి స్ఫూర్తి కాదు కావాల్సింది. ప్రతికూల పరిస్థితుల్లోనూ తమదైన ముద్ర వేసుకుంటున్న వారి విజయగాథలు వినిపించాలి. సానుకూల ఆలోచనలు నింపాలి.


బహుముఖ  ప్రజ్ఞ..

క్రీడలు నేర్చుకోవడమే కాదు.. ఇప్పటికే ఆయన 50 దేశాల్లో ప్రేరణ ప్రసంగాలు చేశారు. ‘లైఫ్‌ వితౌట్‌ లిమిట్స్‌’ పేరుతో రాసిన పుస్తకం 30 భాషల్లోకి అనువాదమైంది. ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు పొందారు.


ఆత్మహత్యాయత్నం

శరీరాకృతిపై సమాజంలో వింత చూపులు, హేళన మాటలు.. ఆయనను కుంగదీశాయి. ఒక దశలో ఆత్మహత్య చేసుకోవాలని యత్నించి విఫలమయ్యారు. ఎదుటి వారిలో ఆత్మవిశ్వాసం నింపడానికే భగవంతుడు తనకీ వైకల్యం కల్పించాడని విశ్వసించి ఎందరిలోనో ప్రేరణ కలిగిస్తున్నారు. గోల్ఫ్‌, ఈత, సముద్రంలో చేసే సర్ఫింగ్‌ వంటివి నేర్చుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు.
* శరీరాకృతి కాస్త భిన్నంగా ఉండటంతో సమాజం నుంచి ఎదురైన పరాభావం కుంగదీసి ఉండవచ్చు. అన్ని సవ్యంగా ఉన్న వ్యక్తులు చిన్నపాటి సమస్యకే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రేమ, చదువు, వృత్తిలో విఫలమయ్యామని బలన్మరణం చెందడం దారుణం. ఒకదానిలో కోల్పోయిన దానికి మరో ప్రత్యామ్నాయం వెతుక్కోవాలని నిరూపించారు. ప్రతికూలతలోనే విజయావకాశాలను వెతుక్కోవాలి.


ఇక్కడా ఉన్నారు..

* నవీపేటకు చెందిన సామల మురళీమోహన్‌ వైకల్యంతో బడికి వెళ్లలేని స్థితిలో తల్లిదండ్రులు తోడ్పాటునందించారు. సాధనతో నడక సాధ్యమని చెప్పిన వైద్యుల సూచన పాటించారు. కాస్త నడక అలవరచుకున్నారు. రెవెన్యూ శాఖలో తొలి ఉద్యోగం లభించగా బ్యాంకు పరీక్షలకు హాజరై సఫలమయ్యారు. ప్రస్తుతం ఎస్‌బీఐ నిజామాబాద్‌ కార్యాలయంలో చీఫ్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నారు.


* జిల్లా అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్న రవీందర్‌కు 12 ఏళ్ల వయసులో కంటిచూపు పోయింది. ఎంఏ పూర్తి చేసి 2002లో గ్రూప్‌-4లో జూనియర్‌ అసిస్టెంట్‌గా చేరారు. అసిస్టెంట్‌ చిట్స్‌ రిజిస్ట్రార్‌గా ఎదిగారు. కేవలం ఉద్యోగానికే పరిమితం కాకుండా కళలపై మమకారంతో దువ్వెనపై సప్తస్వరాలు పలికించే నైపుణ్యం సాధించారు.



*ఇందల్‌వాయి మండలం స్టేషన్‌తండాకు చెందిన బలరాం పుట్టుకతోనే రెండు కాళ్లు పనిచేయవు. చేతులపైనే నడుస్తూ పొలం పనులు చేస్తుంటారు. వారసత్వంగా వచ్చిన ఎకరం పొలం సాగు చేసి మూడెకరాలు కొనుగోలు చేశారు. కూతురు పెళ్లి చేశారు. కుమారులిద్దరూ ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని