logo

నిధులు లేక.. నిలిచిన భూ సేకరణ

జిల్లాలోని సాగునీటి పథకాల నిర్మాణాలకు నిధుల విడుదలలో జాప్యంతో భూ సేకరణ నిలిచిపోయింది. కాళేశ్వరం ప్యాకేజీ-22 పనులతో పాటు నాగమడుగు ఎత్తిపోతల పథకం పనులు నత్తనడకన సాగుతున్నాయి.

Updated : 29 Mar 2024 06:14 IST

నత్తనడకన సాగునీటి పథకాల పనులు

ప్యాకేజీ 22లో సొరంగం నిర్మాణం

ఈనాడు, కామారెడ్డి, నిజాంసాగర్‌, న్యూస్‌టుడే: జిల్లాలోని సాగునీటి పథకాల నిర్మాణాలకు నిధుల విడుదలలో జాప్యంతో భూ సేకరణ నిలిచిపోయింది. కాళేశ్వరం ప్యాకేజీ-22 పనులతో పాటు నాగమడుగు ఎత్తిపోతల పథకం పనులు నత్తనడకన సాగుతున్నాయి. జిల్లాకు గోదావరి జలాలు తరలించే ప్యాకేజీ-22 పనులను గుత్తేదారు తాత్కాలికంగా నిలిపివేశారు. కాలువల తవ్వకాలతో పాటు ఇతరత్రా పనులు చేపట్టడానికి అవసరమైన భూ సేకరణకు నిధులు మంజూరు చేయాల్సిన అవసరముంది.

బిల్లుల చెల్లింపుల్లో జాప్యంతో..

కాళేశ్వరం జలాశయం నుంచి నిజామాబాద్‌ జిల్లాతో పాటు కామారెడ్డి, మెదక్‌ జిల్లాలకు నీరందించేందుకు ప్యాకేజీ-20, 21, 22 కింద పనులు చేపట్టాలని నిర్ణయించారు. కామారెడ్డి జిల్లాకు గోదావరి జలాలు తరలించేందుకు ప్రారంభించిన 22-ప్యాకేజీ పనులు పూర్తికాలేదు. కాలువల తవ్వకాలతో పాటు ఇతర పనులకు పెద్దఎత్తున భూ సేకరణ చేయాలి. బిల్లుల చెల్లింపుల్లో జాప్యంతో ఆశించిన స్థాయిలో పనులు జరగడం లేదు.

నాగమడుగు ఎత్తిపోతలపై పట్టింపు కరవు

జుక్కల్‌ నియోజకవర్గంలోని 30 వేల ఎకరాలకు సాగునీరందించేందుకు నిజాంసాగర్‌ దిగువన నాగమడుగు వద్ద రూ.476.25 కోట్లతో ఎత్తిపోతల పథకం పనులను మూడేళ్ల కిందట ప్రారంభించారు. ఇప్పటికీ 5 శాతం పనులు పూర్తికాలేదు. పథకాన్ని రీడిజైన్‌ చేసి మరో 10 వేల ఎకరాలకు నీరందించాలని నిర్ణయించినా ప్రభుత్వం నుంచి ఆమోదం లభించలేదు. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ప్రాజెక్టు గురించి పట్టించుకునే వారే కరవయ్యారు. దీనికి తోడు నిధులు విడుదల కాకపోవడంతో గుత్తేదారు నామమాత్రంగా పనులు చేపడుతున్నారు. పంప్‌హౌస్‌ నిర్మించే ప్రాంతంలో కరకట్టలు, కాలువల నిర్మాణాలకు భూ సేకరణ చేయాల్సి ఉంది. రెవెన్యూ యంత్రాంగం సర్వే చేసినప్పటికీ నిధుల లేమితో అడుగు ముందుకు పడడం లేదు.

సాధ్యాసాధ్యాల పరిశీలన అవసరం..

గోదావరి జలాలను జిల్లాకు తరలించి సస్యశ్యామలం చేస్తామన్న గత పాలకుల మాటలు నీటి మూటలయ్యాయి. కాళేశ్వరం ప్రాజెక్టు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో జిల్లాకు సాగునీరందించడానికి ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించాల్సిన అవసరముంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు సాగునీటి పారుదల శాఖ అధికారులు ఎగువ మానేరు నుంచి కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలకు నీరు తరలించేందుకు ప్రతిపాదనలు రూపొందించారు. ప్రస్తుతం ప్యాకేజీ-22 పనులు పూర్తయ్యే పరిస్థితి లేదు. ఎగువ మానేరు నుంచి నీటిని ఎత్తిపోసేందుకు ఉద్దేశించిన ప్రాజెక్టును పట్టాలెక్కిస్తేనే గోదావరి జలాల తరలింపు సాధ్యమయ్యే అవకాశాలున్నాయి.

నాయకుల చొరవ కావాలి

ప్రభుత్వం ప్యాకేజీ-22తోపాటు నాగమడుగు ఎత్తిపోతల పథకం పనులతోపాటు భూ సేకరణపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించాల్సిన అవసరముంది. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుంటేనే సాగునీటి పథకాలకు మోక్షం లభించనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని