logo

జనహితం బిజద ధ్యేయం

పేదల సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి ధ్యేయంగా బిజుబాబు పేరిట ఏర్పాటైన ప్రాంతీయ పార్టీ బిజు జనతాదళ్‌ (బిజద) సేవలకు ప్రతీకగా నిలవాలని, ఈ బాధ్యత నేతలు, కార్యకర్తలు స్వీకరించాలని ముఖ్యమంత్రి, బిజద అధినేత నవీన్‌

Published : 30 Sep 2022 03:48 IST

శ్రేణులు చిత్తశుద్ధితో పని చేయాలి

నేతలకు నవీన్‌ ఉద్బోధ

వీసీ ద్వారా అభివాదం చేస్తున్న నవీన్‌

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: పేదల సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి ధ్యేయంగా బిజుబాబు పేరిట ఏర్పాటైన ప్రాంతీయ పార్టీ బిజు జనతాదళ్‌ (బిజద) సేవలకు ప్రతీకగా నిలవాలని, ఈ బాధ్యత నేతలు, కార్యకర్తలు స్వీకరించాలని ముఖ్యమంత్రి, బిజద అధినేత నవీన్‌ పట్నాయక్‌ పిలుపునిచ్చారు. గురువారం భువనేశ్వర్‌లోని బర్ముండా మైదానంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ, పట్టణ పార్టీ అధ్యక్షుల రెండ్రోజుల సమావేశం ప్రారంభమైంది. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నవీన్‌ మాట్లాడుతూ... 25 వసంతాల పార్టీ జనాశీస్సులతో సాగుతోందన్నారు. బిజద రాజకీయాలకే పరిమితం కాదని, సామాజిక సేవలకు అంకితమైందన్న వాస్తవం అందరికీ తెలియాలన్నారు. నాయకులు నిరాడంబరంగా ఉండాలని, ప్రజలతో మమేకం కావాలన్నారు.

నేతలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న బిజద రాజకీయ వ్యవహారాల ప్రధాన కార్యదర్శి ప్రణవ్‌ ప్రకాష్‌దాస్‌

ఎన్నికలు సమీపిస్తున్నాయి
సాధారణ ఎన్నికలు (2024) సమీపిస్తున్నాయని పార్టీని మరింత బలోపేతం చేయడానికి అహర్నిశలు శ్రమిస్తున్నామని నవీన్‌ చెప్పారు. నేతలు, కార్యకర్తలు కలిసి కట్టుగా పనిచేయాలన్నారు. మహిళా, యువ, ఛాత్ర బిజద నాయకులంతా చిత్తశుద్ధిగా విధులు నిర్వహించాలని సీఎం పిలుపునిచ్చారు.

పొగడ్తలతో ముంచెత్తిన నేతలు
కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు నవీన్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. ఆయన అమలు చేసిన కార్యక్రమాలు ప్రస్తావించారు. 2024లో బిజదను మళ్లీ అధికారంలోకి తెస్తామని, నవీన్‌ ఆరోసారి ముఖ్యమంత్రి పీఠంలో ఆసీనులవుతారని పేర్కొన్నారు. పార్టీ రాజకీయ వ్యవహారాల ప్రధాన కార్యదర్శి ప్రణవ్‌ ప్రకాష్‌దాస్‌ మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి తీసుకుంటున్న చర్యలు, నేతలు, కార్యకర్తల బాధ్యతను వివరించారు.

కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ, పట్టణ సంస్థల అధ్యక్షుడు

రాష్ట్రం ముందంజ వేసింది
బిజద పాలనలో రాష్ట్రం ముందంజ వేసిందని, జనహిత పథకాల రూపకల్పన అమల్లో దేశంలో ఒడిశా అగ్రగామిగా ఉందని నవీన్‌ పేర్కొన్నారు. అన్నదాతల కోసం కాలియా, బలరాం, తల్లులకు మమతా, మిషన్‌శక్తి, ప్రజారోగ్యం ధ్యేయంగా బీఎస్‌కేవై, పేదల ఆశ్రయానికి బిజుపక్కా ఘోరో వంటి కార్యక్రమాలెన్నో చేపట్టిన సంగతి నవీన్‌ ప్రస్తావించారు. విపత్తుల నివారణలో రాష్ట్రం అంతర్జాతీయంగా మన్నననలు అందుకుంటోందని చెప్పారు.

వేలాది మంది హాజరు
బిజద సమావేశంలో వేలాది మంది నేతలు పాల్గొన్నారు. భాజపా కేంద్ర శాఖ అధ్యక్షుడు జె.పినడ్డా భువనేశ్వర్‌ జనతా మైదానంలో చేపట్టిన కార్యక్రమానికి దీటుగా బిజద పెద్దలు బర్ముండా మైదానంలో సమావేశం చేపట్టారు.

ప్రజల ఇబ్బందులు తెలుసుకోండి
గాంధీ జయంతి (అక్టోబరు 2) నుంచి నవంబరు 2 వరకు బిజద రాష్ట్రవ్యాప్తంగా జనసంపర్క యాత్రలు ప్రారంభిస్తోందని, క్షేత్రస్థాయిలో పర్యటించే నేతలు ప్రజలు ఇబ్బందులు తెలుసుకొని తనకు నివేదికలు సమర్పించాలని సీఎం ఆదేశించారు.

కేటాయింపుల్లో కత్తెర
రాష్ట్రానికి కేంద్రం కేటాయింపులు తగ్గించిందని, ప్రత్యేక హోదా ఇవ్వాలని, అన్నదాతలకు గిట్టుబాటు ధరలు, స్వామినాథన్‌ కమిటీ సిపార్సులు అమలు చేయాలన్న వినతులు పట్టించుకోవడం లేదన్న సీఎం ఈ దిశగా బిజద ఉద్యమిస్తోందన్నారు.

రైతుల ఆదాయం మూడు రెట్లు
రైతుల ఆదాయం మూడురెట్లు పెంచాలన్నది ప్రభుత్వ ధ్యేయమన్నారు. పారిశ్రామిక ప్రగతి దిశగా పెట్టుబడిదారులతో సంప్రదింపులు జరుగుతున్నాయని, త్వరలో భారీ పరిశ్రమలు ఏర్పాటవుతాయని వివరించారు. లక్షలాది మందికి రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని, వలసలకు అడ్డుకట్ట పడుతుందని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని