logo

ఓయూఏటీకి మహర్దశ

భువనేశ్వర్‌లోని ఒడిశా వ్యవసాయ, సాంకేతిక విశ్వవిద్యాలయానికి (ఓయూఏటీ) మహర్దశ రానుంది. ప్రభుత్వం ఈ వర్సిటీ విస్తరణ, ఆధునికీకరణ పనులకు రూ.727 కోట్లు కేటాయించింది.  

Published : 04 Feb 2023 03:08 IST

రూ.727 కోట్లతో విస్తరణ, ఆధునికీకరణ పనులు

ఒడిశా వ్యవసాయ, సాంకేతిక విశ్వవిద్యాలయం

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: భువనేశ్వర్‌లోని ఒడిశా వ్యవసాయ, సాంకేతిక విశ్వవిద్యాలయానికి (ఓయూఏటీ) మహర్దశ రానుంది. ప్రభుత్వం ఈ వర్సిటీ విస్తరణ, ఆధునికీకరణ పనులకు రూ.727 కోట్లు కేటాయించింది.  నిర్మాణాలు ఇప్పటికే ప్రారంభం కాగా, ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ ఆదేశాల మేరకు 5-టీ కార్యదర్శి వి.కార్తికేయ పాండ్యన్‌, వ్యవసాయశాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి అరవింద పాఢితో కలిసి గురువారం రాత్రి ఓయూఏటీ క్యాంపస్‌ను సందర్శించారు.

రైతులకు వెన్నుదన్నుగా...

రైతుల ప్రయోజనాలు, వ్యవసాయ పరిశోధనలు, వ్యవసాయ, సాంకేతిక విద్యార్ధుల ఉజ్వల భవిత ధ్యేయంగా 1962లో భువనేశ్వర్‌ సూర్యనగర్‌ ప్రాంతంలో ఓయూఏటీ ఏర్పాటైంది. ఇక్కడ వ్యవసాయ, సాంకేతిక డిగ్రీ, పీజీ విద్యతోపాటు అన్నదాతలకు ఉపయుక్తమైన పరిశోధనలు, విత్తనాల ఉత్పత్తి, కొత్త ప్రయోగాలు చేస్తారు. రైతులకిక్కడ శిక్షణ ఇస్తారు. విపత్తుల వేళల్లో పంట సంరక్షణ, చీడపడితే ఎలా నివారించాలన్న దానిపై నిపుణులు సూచనలిస్తారు. ఓయూఏటీ ఆధీనంలో ఉత్తరకోస్తా, దక్షిణ, పశ్చిమ ఒడిశా ప్రాంతాల్లో ప్రాంతీయ వ్యవసాయ కేంద్రాలున్నాయి.

గర్వకారణమవుతుంది

ఓయూఏటీ వీసీ ప్రభాత కుమార్‌ విలేకరులతో మాట్లాడుతూ... భారతదేశంలో ఈ వర్సీటీ గర్వకారణమవుతుందని చెప్పారు. నూతన నిర్మాణాలు పూర్తయినే వ్యవసాయ శాస్త్రానికి సంబంధించి మరిన్ని కొత్త కోర్సులు ప్రారంభించాలన్న ధ్యేయంతో ఉన్నామన్నారు. పరిశోధనలు ముమ్మరమవుతాయని, విదేశాల నుంచి విజిటింగ్‌ ఆచార్యులొస్తారని తెలిపారు. అన్నదాతలకు వర్సిటీలో వసతి సౌకర్యం అందుబాటులోకి వస్తుందని చెప్పారు. వ్యవసాయం ఉత్పత్తులు పెంచడానికి నిరంతర కృషి జరుగుతోందన్నారు.

సీఎం సందర్శన తర్వాత

గతేడాది నవీన్‌ ఓయూఏటీని సందర్శించిన తర్వాత విస్తరణ, ఆధునికీకరణ పనులకు నిర్ణయం తీసుకున్నారు. నిర్మాణాలకు సంబంధించి మాస్టర్‌ ప్లాన్‌ సిద్ధం చేశారు. రూ.60 కోట్ల వ్యయంతో రైతుల కోసం వెయ్యి సీట్ల ఆడిటోరియం, విద్యార్థుల వసతి గృహాలు, 11 వ్యవసాయ, 3 సాంకేతిక విభాగాల అదనపు భవనాలు, పాలనా కేంద్రం విస్తరణకు ధ్యేయంగా పెట్టుకున్నారు. నిర్మాణ రంగంలో విశేష అనుభవం గల కంపెనీకి పనులు కేటాయించారు. ఈ ఏడాది చివరినాటికల్లా ఈ నిర్మాణాలు పూర్తి చేసి 2024 జనవరి 1న ప్రారంభించాలని నిర్ణయించారు.

పనుల్లో నాణ్యత ఉండాలి

ఓయూఏటీ క్యాంపస్‌ సందర్శించిన పాండ్యన్‌ ఉపకులపతి (వీసీ) ఆచార్య ప్రభాత కుమార్‌ రౌళో, నిర్మాణ సంస్థ ప్రతినిధులతో మాట్లాడారు. పనుల్లో నాణ్యత ఉండాలని, నిర్ణీత వ్యవధిలో నిర్మాణాలు పూర్తి చేయాలని ఆదేశించారు. వర్సీటీ ఆచార్యులు, విద్యార్థులతో మాట్లాడారు.

విశ్వవిద్యాలయం సిబ్బందితో పాండ్యన్‌, అరవింద పాఢి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని