logo

ప్రజలపై దౌర్జన్యాలు చేస్తున్నారనే మాజీ మంత్రి హత్య

మాజీ మంత్రి నబకిశోర్‌ దాస్‌ను హతమార్చేందుకు మాజీ ఏఎస్‌ఐ గోపాల్‌చంద్ర దాస్‌ ఆరు నెలలుగా ప్రయత్నిస్తున్నట్లు క్రైమ్‌ బ్రాంచ్‌ వర్గాల ద్వారా వెలుగులోకి వచ్చింది.

Published : 07 Feb 2023 01:36 IST

నిందితుడు గోపాలచంద్ర దాస్‌ వెల్లడి

కటక్‌, న్యూస్‌టుడే: మాజీ మంత్రి నబకిశోర్‌ దాస్‌ను హతమార్చేందుకు మాజీ ఏఎస్‌ఐ గోపాల్‌చంద్ర దాస్‌ ఆరు నెలలుగా ప్రయత్నిస్తున్నట్లు క్రైమ్‌ బ్రాంచ్‌ వర్గాల ద్వారా వెలుగులోకి వచ్చింది. అధికారులు నిందితుడ్ని రిమాండ్‌లోకి తీసుకుని విచారిస్తున్నారు. రాష్ట్రంలో కొంతమంది రాజకీయ నేతలు ప్రజలపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని, వీరిలో నబకిశోర్‌ దాస్‌ కూడా ఉన్నారని, అందుకే ఆయనను హత్య చేశానని దర్యాప్తులో గోపాల్‌చంద్ర దాస్‌ తెలిపినట్లు అధికారులు చెప్పారు. 2022 సెప్టెంబరు 18న పట్టణంలో నువఖాయి వేడుకల్లో మంత్రి పాల్గొన్నారని, ఆరోజు వర్షం కురవడంతో ఎక్కువమంది ప్రజలు రాలేదని, ఆ సమయంలో ఆయనను హతమార్చేందుకు ప్రయత్నించానని, మంత్రి దూరంగా ఉండడంతో అవకాశం లభించలేదని ఆయన అధికారులకు చెప్పాడు. అదే ఏడాది డిసెంబరు 30న పట్టణంలో ప్రముఖల విగ్రహావిష్కరణ కార్యక్రమంలో కూడా నబకిశోర్‌ దాస్‌ను హత్య చేయాలని ప్లాన్‌ చేశానని, అప్పుడు కూడా ఆయన తనకు దూరంగా ఉండడంతో సాధ్యం కాలేదని నిందితుడు చెప్పాడు. మరికొన్నిసార్లు ప్రయత్నం చేసి చివరికి జనవరి 29న మంత్రి దగ్గరగా కనిపించడంతో కాల్పులు జరిపినట్లు గోపాల్‌దాస్‌ తెలిపినట్లు క్రైమ్‌ బ్రాంచి అధికారులు వివరించారు.

ఠాణాధికారి విఫలం.. సాధారణంగా మంత్రులు, వీఐపీలు పట్టణంలోకి వస్తే స్థానిక ఠాణాధికారి వారి వెంట ఉంటారు. కారు నుంచి సభాస్థలి వరకు వారిని దగ్గరుండి తీసుకెళ్లి తీసుకు వస్తుంటారు. మాజీ మంత్రి హత్య జరిగిన రోజున అప్పటి  ఠాణా అధికారి ప్రద్యుమ్నకుమార్‌ స్వయ్‌ మంత్రి వద్దకు రాలేదు. ఆయనకు దూరంగా నిలుచున్నాడు. కాల్పులు జరిగిన అనంతరం అధికారి గోపాల్‌చంద్ర దాస్‌ వద్దకు చేరుకొని పిస్టల్‌ను లాక్కున్నాడు. ఆరు మాసాలుగా నిందితుడు మాజీ మంత్రి హత్యకు ప్రయత్నిస్తుంటే ఎందుకు ఠాణాధికారి తెలుసుకోలేకపోయారని పలువురు ప్రశ్నిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని