logo

తండ్రి ‘హస్తం’ కాదని... ‘శంఖం’ పిడికిట పట్టుకొని..

సీనియర్‌ కాంగ్రెస్‌ నేత, ఖుర్దా జిల్లా జట్నీ ఎమ్మెల్యే సురేష్‌ రౌత్రాయి చిన్న కుమారుడు కెప్టెన్‌ మన్మధ రౌత్రాయి బుధవారం బిజదలో చేరారు.

Published : 28 Mar 2024 04:30 IST

బిజద గూటికి సురేష్‌ రౌత్రాయి కొడుకు

శంఖ భవన్‌లో ఎంపీల సమక్షంలో మన్మథ రౌత్రాయి

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: సీనియర్‌ కాంగ్రెస్‌ నేత, ఖుర్దా జిల్లా జట్నీ ఎమ్మెల్యే సురేష్‌ రౌత్రాయి చిన్న కుమారుడు కెప్టెన్‌ మన్మధ రౌత్రాయి బుధవారం బిజదలో చేరారు. వేలాదిమంది మద్దతుదారులతో ర్యాలీగా భువనేశ్వర్‌లోని శంఖ భవన్‌ (బిజద కార్యాలయం)కు చేరుకున్న ఆయనకు రాజ్యసభ సభ్యులు మానస్‌ మంగరాజ్‌, సస్మిత్‌ పాత్ర్‌, సులతదేవ్‌ తదితర నేతలు ఘన స్వాగతం పలికారు. పార్టీ కండువా ధరింపజేశారు. తర్వాత నవీన్‌ నివాస్‌కు వెళ్లి సీఎం ఆశీస్సులు పొందారు.

గతేడాది ఉద్యోగానికి రాజీనామా

వాయుసేనలో కెప్టెన్‌గా విధులు నిర్వహించిన మన్మధ గతేడాది వీఆర్‌ఎస్‌ తీసుకున్నారు. రాజకీయాల్లో చేరతానని ప్రకటించారు. 80 వసంతాలు దాటిన తాను 2024 ఎన్నికల్లో పోటీ చేయనని, తన రెండో కుమారుడు మన్మధ కాంగ్రెస్‌ అభ్యర్థిగా జట్నీ నుంచి పోటీ చేస్తారని ఆయన తండ్రి సురేష్‌ రౌత్రాయి ఇటీవల చెప్పారు. ఇంతలోనే ఈ మార్పు జరగడం విశేషం.

అమెరికా నుంచి పెద్ద కొడుకు రాక

ఇంతలో సురేష్‌ పెద్దకుమారుడు సిద్ధార్థ రౌత్రాయి అమెరికాలో ఉద్యోగం వదులుకొని జట్నీ వచ్చారు. 2024 ఎన్నికల్లో ఆయన పూరీ జిల్లా నిమపడ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తారని, ఇద్దరు కుమారుల విజయానికి తాను ప్రచారం చేస్తానని సురేష్‌ పేర్కొన్నారు. సిద్ధార్థ అత్తవారిల్లు నిమపడ కావడంతో అక్కడి నుంచి ఆయనను పోటీకి దింపాలని సురేష్‌ రౌత్రాయ్‌ వివరించారు. ఏఐసీసీకి దీనిపై తెలియజేశానని ఇద్దరు కుమారులు ఆ పార్టీ అభ్యర్థులవుతారన్నారు.

ఉద్దేశపూర్వకమా... వాస్తవమా...

మన్మధ తండ్రితో ఏకీభవించలేదు. కాంగ్రెస్‌లో చేరడానికి సుముఖత చూపలేదు. బిజదకు దగ్గరయ్యారు. ఆ పార్టీ నేతలతో సంప్రదించారు. మద్దతుదారులను కూడగట్టారు. ఈ నేపథ్యంలో చిన్న కుమారుడు బిజదకు దగ్గరయ్యారని, ఆయన మేజరని, తన అభిరుచిని గౌరవించాల్సి వస్తోందన్నారు. పెద్దకుమారుడు సిద్ధార్థ తన మాట జవదాటకుండా నిమపడ నుంచి కాంగ్రెస్‌ తరఫున పోటీకి సన్నద్ధంగా ఉన్నట్లు సురేష్‌ చెప్పుకున్నారు.

మన్మధకు భువనేశ్వర్‌ టిక్కెట్టు

కెప్టెన్‌ మన్మధ బిజదలో చేరిన రెండు గంటల వ్యవధిలో పార్టీ టికెట్టు ఖాయమైంది. భువనేశ్వర్‌ లోక్‌సభ స్థానానికి ఆయనను అభ్యర్థిగా చేసినట్లు ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ ప్రకటించారు.

అపరాజితతో ఢీ

భువనేశ్వర్‌ లోక్‌సభ స్థానానికి ఎంపీ అపరాజిత షడంగి భాజపా అభ్యర్థి కాగా, కెప్టెన్‌ మన్మధ రౌత్రాయి బిజద తరఫున పోటీ చేయనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని