logo

ఇన్నాళ్లు ఏమయ్యారు?.. మా సమస్యలపై ఏం చేశారు?

అభివృద్ధే అజెండాగా చేసుకున్నామని, తమకే ఓట్లేయండని ప్రచారానికి దిగిన ప్రధాన పార్టీల అభ్యర్థులకు ఆయాచోట్ల ఓటర్లు నిలదీస్తున్నారు.

Updated : 17 Apr 2024 06:37 IST

నిలదీస్తున్న ఓటర్లు... తడబడుతున్న నేతలు

నువాపడలో కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలతో శరత్‌ పాదయాత్ర

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే : అభివృద్ధే అజెండాగా చేసుకున్నామని, తమకే ఓట్లేయండని ప్రచారానికి దిగిన ప్రధాన పార్టీల అభ్యర్థులకు ఆయాచోట్ల ఓటర్లు నిలదీస్తున్నారు. గడిచిన అయిదేళ్లు వారంతా ఎక్కడున్నారని? తమ ప్రాంతాలకు ఎందుకు రాలేదని ప్రశ్నిస్తున్నారు. మంగళవారం చాలాచోట్ల ఇలాంటి దృశ్యాలు కనిపించాయి.

ఎందుకు ముఖం చాటేశారు?

సుందర్‌గఢ్‌ లోక్‌సభ స్థానానికి బిజద అభ్యర్థిగా పోటీ చేస్తున్న హాకీ క్రీడాకారుడు దిలీప్‌ తిర్కీ రాజ్‌గంగపూర్‌లో పాదయాత్ర నిర్వహించారు. నవీన్‌ పట్నాయక్‌ పాలనలో జరిగిన అభివృద్ధి గురించి చెప్పుకొచ్చారు. ఇంతలో గడిచిన అయిదేళ్లు తమరు ఈ ప్రాంతానికి ఎందుకు రాలేదని స్థానికులు ప్రశ్నించారు. రాజ్యసభ ఎంపీగా ఉన్న సమయంలోనూ ముఖం చాటేశారని, తమ ఇబ్బందులు ఎప్పుడైనా పట్టించుకున్నారా? అని నిలదీశారు. సమాధానం చెప్పుకోవడానికి తడబడిన తిర్కీ ఇకపై వారికి తోడునీడగా ఉంటానని సర్దిచెప్పారు.

పూరీకి ఎన్నిసార్లు వచ్చారు?

పూరీ లోక్‌సభ స్థానానికి బిజద అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఐపీఎస్‌ మాజీ అధికారి అరూప్‌ పట్నాయక్‌కు పూరీ బొడొదండోలో చేదు అనుభవం ఎదురైంది. పూరీ తన జన్మస్థలం అంటు చెప్పుకుంటున్న మీరు ఎన్నిసార్లు ఇక్కడికి వచ్చారని ఓటర్లు ప్రశ్నించారు. ప్రజల ఇబ్బందులపై మీకు అవగాహన ఉందా అని అడిగారు. దీంతో అరూప్‌ పట్నాయక్‌ నీళ్లు నమిలారు.

రహదారి పనులు ఇన్నాళ్లా?

55వ నెంబరు రహదారి పనులు నత్తనడక సాగుతున్న విషయం తెలిసినా ఎందుకు పట్టించుకోలేదని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు కుచిండ వాసులు ప్రశ్నించారు. కటక్‌-సంబల్‌పూర్‌ రహదారి పనుల జాప్యానికి రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనతే కారణమని, స్థల సేకరణ, అటవీశాఖ క్లియరెన్సు ఇవ్వడంలో జాప్యమైందని ధర్మేంద్ర తెలియజేశారు. ఆయన సంబల్‌పూర్‌ లోక్‌సభ స్థానానికి భాజపా అభ్యర్థిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.

మీది ఉత్తర కోస్తా కదా

సంబల్‌పూర్‌ లోక్‌సభ స్థానం బరిలో ఉన్న బిజద అభ్యర్థి ప్రణవ ప్రకాష్‌ దాస్‌ అలియాస్‌ బొబిపై సంబల్‌ వాసులు ప్రశ్నల వర్షం కురిపించారు. మీది ఉత్తరకోస్తా కదా, పశ్చిమ ఒడిశాలో పోటీ చేయడానికి కారణం ఏమిటని? గడిచిన అయిదేళ్లలో ఎన్నిసార్లు ఇక్కడికి వచ్చారో చెప్పాలన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి ఏంచేశారని ప్రశ్నించారు. శామలాయి అమ్మవారి ఆలయ కారిడార్‌, ఇతర అభివృద్ధి పనులు నవీన్‌ చేయించారని, జీఎం కళాశాలకు వర్సిటీగా చేశారని బొబి చెప్పుకున్నారు. తనను గెలిపిస్తే మంచి పనులు చేస్తానన్నారు.

పది గ్యారంటీలకు భరోసా ఉందా?

నువాపడ అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్న పీసీసీ అధ్యక్షుడు శరత్‌ పట్నాయక్‌ను ఓటర్లు కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో పేర్కొన్న పది గ్యారంటీలపై అడిగారు. చెప్పినవన్నీ మీరు అమలు చేస్తామని భరోసా ఇవ్వగలరా? అంటూ ప్రశ్నించారు. దీనికి సమాధానమిచ్చిన శరత్‌ కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో అమలు జరిగిందని చెప్పుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు