logo

ఆయుష్‌ సేవలు దూరం

వైద్యంలో ఆయుష్‌కు ప్రత్యేక స్థానం కేటాయిస్తు న్నట్లు ప్రధాని మోదీ పలుమార్లు ప్రకటించారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి.

Updated : 31 Jan 2023 04:52 IST

పార్వతీపురంలో తలుపులు మూసి ఉన్న కేంద్రం

పార్వతీపురం పట్టణం, న్యూస్‌టుడే: వైద్యంలో ఆయుష్‌కు ప్రత్యేక స్థానం కేటాయిస్తు న్నట్లు ప్రధాని మోదీ పలుమార్లు ప్రకటించారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఆయుష్‌ ఆసుపత్రుల్లో వైద్యులు, సిబ్బంది కొరతతో కొన్నాళ్లుగా రోగులకు సేవలు దూరమవుతున్నాయి. 

ఉమ్మడి జిల్లాలో వైద్యుల కొరత..

పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో మొత్తం 38 ఆయుష్‌ ఆసుపత్రులున్నాయి. ఇందులో 20 ఆయుర్వేదం, 17 హోమియో, ఒక యునాని ఆసుపత్రి నడుస్తోంది. వీటిలో చాలా చోట్ల వైద్యుల కొరత వేధిస్తుంది. కొన్ని చోట్ల నాలుగో తరగతి సిబ్బంది తాళం తీయడం, వేయడానికే వస్తున్నారనంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ఎక్కువగా ఆయుర్వేదం, హోమియోపతి వైద్యాన్ని ఆశ్రయిస్తున్నారు. అయినా జిల్లాలో తగిన సేవలు అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు.

మందులు ఇవ్వలేని పరిస్థితి..

జిల్లా ఆసుపత్రి ఆయుష్‌ విభాగంలో గతంలో హోమియో విభాగంలో వైద్య సేవలు అందించేవారు. రోజుకు 30 నుంచి 40 మంది వరకు రోగులు వచ్చేవారు. కానీ ఇక్కడ వైద్యురాలిని ఏడాది క్రితం బొబ్బిలి మండలం శివడవలసకి బదిలీ చేశారు. తర్వాత ఎవరినీ నియమించలేదు. ఆమెనే తిరిగి పార్వతీపురం విభాగం ఇన్‌ఛార్జిగా నియమించారు. దీంతో ప్రతి గురువారం వచ్చి సేవలు అందించి వెళ్లేవారు. కొన్ని నెలల క్రితం ఇన్‌ఛార్జి బాధ్యతలు రద్దుచేసి వేరొకరికి అప్పగించారు. ఆయన ఇప్పటి వరకు ఆసుపత్రికే రాలేదు. దీంతోపాటు ఇక్కడ పనిచేసిన సిబ్బంది బదిలీపై వెళ్లిపోవడంతో ఏఎన్‌ఎం సేవలు కూడా దూరం అయ్యాయి. ప్రస్తుతం బ్లాక్‌ లాగ్‌ కింద విధుల్లో చేరిన కిందిస్థాయి ఉద్యోగి ఒక్కరు మాత్రమే ఉన్నారు. తాళం తీయడం, మూసి వెళ్లడం తప్ప మందులు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. ఈ ఒక్క ఆసుపత్రిలోనే కాదు ఉమ్మడి జిల్లాల్లో చాలా చోట్ల ఇదే దుస్థితి ఉంది.

కొవిడ్‌ తర్వాత ఆదరణ..

రెండేళ్ల పాటు అన్ని వర్గాల వారిని తీవ్ర వేదనకు గురిచేసిన కొవిడ్‌ నుంచి జనాలు కోలుకుంటున్నారు. గతంలో వినియోగించినట్లు యాంటీబయాటిక్స్‌, నొప్పి నివారణ మందులకు ప్రస్తుతం ప్రాధాన్యం ఇవ్వడం లేదు. సాధ్యమైనంత మేర హోమియో, ఆయుర్వేదం, యోగాపై శ్రద్ధచూపుతున్నారు. అయినా ఆయుష్‌ విభాగంలో వైద్యులు అంబుబాటులో లేక సేవలు, మందులు సక్రమంగా అందటం లేదు.

ఏళ్లుగా భర్తీకాని పోస్టులు

ఆయుష్‌ విభాగంలో ఏళ్లగా పోస్టులు భర్తీ చేయడం లేదు. 1995లో ఒక పోస్టును భర్తీ చేశారు. అనంతరం 2011లో విజయనగరం, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో 20 పోస్టులు భర్తీ అయ్యాయి. అప్పటి నుంచి నేటి వరకు ఉద్యోగాల భర్తీ లేదు. గతంలో బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీకి సన్నహాలు జరిగినా అనంతరం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నచందంగా మారింది.


ప్రతిపాదనలు పంపించాం...

ఆయుష్‌ విభాగాల్లో ఉన్న ఖాళీలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లాం. పారామెడికల్‌ పోస్టుల ఖాళీలు ఎక్కువగానే ఉన్నాయి. ఆ విషయాన్ని ఉన్నతాధికారులకు ప్రతిపాదించాం. కాంపౌండర్సు  ఉన్నచోట సేవలు అందేలా చూస్తున్నాం. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వస్తే భర్తీకి చర్యలు తీసుకుంటాం.

వై.శేఖర్‌, ఆయుష్‌ ఆర్‌డీడీ, జోన్‌1, విశాఖపట్టణం


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు