logo

ఏదీ ఆ పర్యవేక్షణ

ఉమ్మడి జిల్లాలో క్షయ విజృంభిస్తోంది. గత మూడేళ్లలో ఏడు వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది విజయనగరం జిల్లాలో మూడు నెలల వ్యవధిలో 600 మందికి పైగా వ్యాధి బారిన పడ్డారు.

Updated : 30 Mar 2024 04:51 IST

జిల్లాలో క్షయ విజృంభణ
మూడేళ్లలో 7 వేలకు పైగా కేసులు

రోగుల పర్యవేక్షణ కోసం నియమించిన సూపర్‌వైజర్లకు కేటాయించిన ద్విచక్ర వాహనాలివీ. ప్రస్తుతం విజయనగరంలోని టీబీ వార్డు వద్ద ఇలా నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి

విజయనగరం వైద్యవిభాగం, న్యూస్‌టుడే: ఉమ్మడి జిల్లాలో క్షయ విజృంభిస్తోంది. గత మూడేళ్లలో ఏడు వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది విజయనగరం జిల్లాలో మూడు నెలల వ్యవధిలో 600 మందికి పైగా వ్యాధి బారిన పడ్డారు. దీనిని బట్టి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి 2025 నాటికి నిర్మూలించాలనే లక్ష్యంతో కేంద్రం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. కానీ క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. రోగుల సంఖ్యగా పెరుగుతోంది.

వ్యాధిగ్రస్థుల్లో పురుషులే అధికంగా ఉంటున్నారు. గత నాలుగేళ్లుగా చికిత్స పొందిన వారిలో బాలలూ ఉన్నారు. మద్యం, ధూమపానం, పని ఒత్తిడి, ఆరోగ్యంపై శ్రద్ధ చూపకపోవడం, సరైన ఆహారం తీసుకోకపోవడం తదితర కారణాలతో ఇబ్బంది పడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. చరవాణులు, కంప్యూటర్ల అధిక వినియోగంతో నిద్ర లేక, సరైన తిండి లేక విద్యార్థులను సైతం వ్యాధి వెంటాడుతోందని పేర్కొంటున్నారు.

పీహెచ్‌సీల పరిధిలోని ఎంఎల్‌హెచ్‌పీలు, ఏఎన్‌ఎంలు, ఆశాలు క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించాలి. వీరు రోగుల ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు నివేదికలు అందజేయాలి. బాధితులకు నెలకు రూ.500 చొప్పున పింఛను సౌకర్యం కూడా ఉంది. ఆ నగదు అందుతుందో లేదో చూడాలి. నియంత్రణ, పర్యవేక్షణ కోసం గతంలో సూపర్‌వైజర్లను నియమించారు. వీరు కానరావడం లేదు. వారికి కేటాయించిన ద్విచక్ర వాహనాలు విజయనగరంలోని టీబీ వార్డు వద్దే మూలుగుతున్నాయి. ఈ భవనం సైతం శిథిలావస్థకు చేరింది. సరైన సౌకర్యాలు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

ఆదేశాలు జారీ చేస్తాం

విజయనగరం జిల్లావ్యాప్తంగా 10 టీబీ యూనిట్లు ఉన్నాయి. ఇవి కాకుండా పీహెచ్‌సీల్లో మైక్రో ల్యాబ్‌లు పెట్టాం. రెండు సీబీ నాట్‌ యంత్రాలు పనిచేస్తున్నాయి. రెండు గంటల్లోనే ఫలితాలు పొందవచ్చు. సక్రమంగా మందులు వాడితే ఇబ్బంది ఉండదు. సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో కొందరికి తీవ్రమవుతోంది. ఈ మేరకు అవగాహన కల్పిస్తున్నాం. క్షేత్రస్థాయి సిబ్బంది పక్కాగా పనిచేసేలా ఆదేశాలు జారీ చేస్తాం.

ఎస్‌.భాస్కరరావు, డీఎంహెచ్‌వో, విజయనగరం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని