logo

చీపురుపల్లికి కొత్త కళా

తీవ్ర ఉత్కంఠకు తెరపడింది. చీపురుపల్లి నియోజకవర్గ తెదేపా అభ్యర్థిగా మాజీ మంత్రి, ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కిమిడి కళా వెంకటరావుకు అవకాశం దక్కింది.

Updated : 30 Mar 2024 04:53 IST

ఈనాడు-విజయనగరం, రాజాం,  గరివిడి, న్యూస్‌టుడే: తీవ్ర ఉత్కంఠకు తెరపడింది. చీపురుపల్లి నియోజకవర్గ తెదేపా అభ్యర్థిగా మాజీ మంత్రి, ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కిమిడి కళా వెంకటరావుకు అవకాశం దక్కింది.

చీపురుపల్లిలో మంత్రి బొత్స సత్యనారాయణపై పోటీకి సమర్థుడైన నేతను ఎన్నికల సమరంలోకి దించాలని చంద్రబాబు తొలి నుంచి యోచిస్తున్నారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావును తీసుకురావాలని నిర్ణయించారు. ఆయన భీమిలి టికెట్‌ ఆశించడం.. అక్కడ సైతం సమర్థుడైన నేత కనిపించకపోవడంతో ఈ రెండు స్థానాల్లో ధీటైన నేతలను బరిలో నిలపాలని చంద్రబాబు కసరత్తు చేశారు. చివరకు భీమిలిలో గంటాను, చీపురుపల్లిలో కళా వెంకటరావుల పేర్లు శుక్రవారం మధ్యాహ్నం విడుదల చేసిన జాబితాలో ప్రకటించడంతో ఉత్కంఠకు తెరపడింది.

జిల్లాతో అనుబంధం

విజయనగరంతో ఎంతో అనుబంధం ఉంది. మహరాజా కళాశాలలో డిగ్రీ పూర్తి చేసుకుని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రంలో పట్టా అందుకున్నారు. జిల్లాల విభజన తర్వాత ఆయన స్వగ్రామం విజయనగరంలో చేరింది. చీపురుపల్లి తెదేపా ఇన్‌ఛార్జి, విజయనగరం పార్లమెంట్‌ జిల్లా తెదేపా అధ్యక్షుడు కిమిడి నాగార్జునకు కళావెంకటరావు పెదనాన్న. మాజీ ఎమ్మెల్యే గణపతిరావు సోదరుడు. మరదలు డాక్టర్‌ కిమిడి మృణాళిని 2014లో ప్రస్తుత మంత్రి బొత్స సత్యనారాయణపై గెలుపొంది మంత్రి పదవి చేపట్టారు. వైకాపాలో కాపు నాయకుడిగా ఎదిగి అధికార పార్టీలో చక్రం తిప్పుతున్న బొత్సకు రాజకీయంగా చెక్‌ పెట్టాలన్న ఉద్దేశంతో తెదేపా అధినేత కళావెంకటరావును ఎంపిక చేశారనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో  వినిపిస్తోంది. 

ఇదీ రాజకీయ ప్రస్థానం

1983, 1985, 1989, 2004 సంవత్సరాల్లో జరిగిన ఎన్నికల్లో అప్పటి ఉణుకూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1983లో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ డైరెక్టర్‌గా, ఏపీ టూరిజం డైరెక్టర్‌గా పనిచేశారు. 1984లో తితిదే పాలక మండలి సభ్యుడు. 1985లో ఎన్టీఆర్‌ మంత్రి వర్గంలో రెండున్నర సంవత్సరాలు పురపాలక శాఖ మంత్రిగా, తర్వాత వాణిజ్యపన్నుల శాఖ మంత్రిగా సేవలు అందించారు. 1988లో హోం మంత్రి పదవి చేపట్టారు. 1989లో తితిదే పాలక మండలి ఛైర్మన్‌గా పనిచేశారు. 1998 రాజ్యసభకు ఎన్నికయ్యారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా సేవలు అందించారు. 2009లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరి ఎచ్చెర్ల స్థానం నుంచి పోటీ చేసి ఓటమి చవిచూశారు. తర్వాత 2014లో ఎచ్చెర్ల నుంచి తెదేపా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పార్టీ ఎన్నికల కమిటీ రాష్ట్ర అధ్యక్షుడిగా, ఇంధన శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2015-21 తెదేపా రాష్ట్ర అధ్యక్షుడిగా సేవలు అందించారు. ప్రస్తుతం తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడిగా, ఎచ్చెర్ల నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా కొనసాగుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని