logo

అప్పుడు రూ.250.. ఇప్పుడు రూ.10,000

ఎన్నికల్లో పోటీ చేయాలంటే ప్రజాప్రాతినిధ్య చట్టం-1951 ప్రకారం అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు ధరావత్తు చెల్లించాలి. శాసనభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ధరావత్తుగా రూ.10 వేలు ఎన్నికల సంఘానికి చెల్లించాలి.

Published : 18 Apr 2024 04:45 IST

న్నికల్లో పోటీ చేయాలంటే ప్రజాప్రాతినిధ్య చట్టం-1951 ప్రకారం అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు ధరావత్తు చెల్లించాలి. శాసనభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ధరావత్తుగా రూ.10 వేలు ఎన్నికల సంఘానికి చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులైతే రూ.5 వేలు చెల్లిస్తే సరిపోతుంది. లోక్‌సభ ఎన్నికల్లో సాధారణ అభ్యర్థులు రూ.25 వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.12,500 చెల్లించాలి. 1996 వరకూ ధరావత్తు మొత్తం శాసనసభ ఎన్నికలకు రూ.250, లోక్‌సభకు రూ.500గా సాధారణ అభ్యర్థులకు ఉండేది. ఎస్సీ, ఎస్టీలయితే ఇందులో సగం చెల్లిస్తే చాలు. గెలిచే ఉద్దేశం లేకున్నా.. పోటీకి దిగేవారు ఉంటున్నారు. కొన్ని సందర్భాల్లో ఓటర్లను పక్కదారి పట్టించి, ప్రత్యర్థి ఓట్లు తగ్గించడానికి మరికొందరి చేత నామినేషన్లు వేయించడం సాధారణంగా జరుగుతోంది. అయితే పోలైన ఓట్లలో కనీసం ఆరోవంతు సాధించకపోతే అభ్యర్థులకు ఆ డిపాజిట్‌ మొత్తం తిరిగి రాదు.

న్యూస్‌టుడే, రాజాం, విజయనగరం అర్బన్‌


ఇవీ నిబంధనలు..

  • పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులను నలుగురు, స్వతంత్రంగా పోటీ చేసే వారిని పది మంది నియోజకవర్గానికి చెందిన ఓటర్లు బలపర్చాలి.  
  • నామినేషన్‌కు 48 గంటల ముందు గుర్తింపు పొందిన బ్యాంకులో ఖాతా తెరవాలి. దాని ద్వారానే ఎన్నికల ప్రచారం, ఇతర అవసరాలకు వెచ్చించిన సొమ్ముకు సంబంధించి లావాదేవీలు నిర్వహించాలి.
  •  ఫారం-2ఎ (పార్లమెంట్‌కు), 2బి (అసెంబ్లీకి) ప్రతాలు దాఖలు చేయాలి. దీంతో పాటు ఫారం-26 (అఫిడవిట్‌) సమర్పించాలి. అభ్యర్థి, అతని కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలు, కేసుల వివరాలు, క్రైం నంబరు పొందుపర్చాలి. స్వయంగా ఇస్తే ఆర్వో ఎదురుగా ప్రతిజ్ఞ చేయాలి. ఇతరులతో పంపిస్తే ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ నోటరీ చేసి ఉండాలి. అభ్యర్థులకు సంబంధించిన నామినేషన్లు, అఫిడవిట్లు ఆన్‌లైన్‌లో ప్రజలకు అందుబాటులో ఉంచుతారు. పారదర్శకంగా ఉండేందుకు వీడియో తీస్తారు.
  • ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటే ప్రభుత్వ ఉద్యోగి రాజీనామా చేయాలి. ఆమోద ధ్రువపత్రాన్ని నామినేషన్‌తో జతచేయాలి.  
  • పార్టీ తరఫున అభ్యర్థులు ఒరిజినల్‌ బి-ఫారం అందజేయాలి. నామినేషన్‌ గడువు ముగిసేరోజు 3 గంటల్లోపు అందజేయవచ్చు. రెండు ఫొటోలు, ఓటరు కార్డు, బలపరిచే వారి గుర్తింపు పత్రాలివ్వాలి.

నామినేషన్ల ప్రక్రియకు ఏర్పాట్లు

విజయనగరం తహసీల్దారు కార్యాలయం వద్ద 100 మీటర్ల పరిధిలో బారికేడ్లు కడుతున్న వీఆర్‌ఏలు

విజయనగరం గ్రామీణం, న్యూస్‌టుడే: జిల్లా కేంద్రంలోని తహసీల్దారు కార్యాలయంలో గురువారం నుంచి విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేసే అభ్యర్థుల నుంచి నామపత్రాలు స్వీకరించేందుకు రిటర్నింగ్‌ అధికారి, సంయుక్త కలెక్టరు కె.కార్తీక్‌ ఆధ్వర్యంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. అనంతరం నామపత్రాలు స్వీకరిస్తారు. అభ్యర్థితో సహా అయిదుగురిని మాత్రమే 100 మీటర్ల పరిధిలో లోపలికి అనుమతిస్తారు. ఉదయం 11 నుంచి 3 వరకు నామపత్రాలను ఆర్వో స్వీకరిస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు