logo

అన్నొస్తే.. ఇబ్బందులే

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ‘సిద్ధం’ సభ జరుగుతోందంటే ప్రజలకు ప్రయాణానికి పాట్లు తప్పడం లేదు.

Published : 24 Apr 2024 04:41 IST

ఉదయం 8:30 గంటల ప్రాంతంలో బొబ్బిలి ఆర్టీసీ కాంప్లెక్సు వద్ద ఒక్క బస్సు లేని వైనం

బొబ్బిలి, రామభద్రపురం, చీపురుపల్లి, గంట్యాడ గ్రామీణం, గజపతినగరం, రాజాం, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ‘సిద్ధం’ సభ జరుగుతోందంటే ప్రజలకు ప్రయాణానికి పాట్లు తప్పడం లేదు. మంగళవారం విజయనగరంలోని చెల్లూరులో జరిగిన వైకాపా సిద్ధం సభకు జనాల్ని తరలించేందుకు ఆర్టీసీ బస్సులను మళ్లించడంతో ఇక్కట్లు ఎదురయ్యాయి. ఉదయం 6 గంటల నుంచే బస్సులను రద్దు చేయడంతో చాలామంది ప్రైవేటు వాహనాలను ఆశ్రయించారు. ఉన్న బస్సుల కోసం ప్రజలు గంటల కొద్దీ నిరీక్షించారు.

 బొబ్బిలి ఆర్టీసీ డిపో నుంచి సుమారు 20కి పైగా సర్వీసులు రద్దు చేయడంతో ప్రయాణికులు నివ్వెరపోయారు. గంటకు ఒక బస్సు కూడా లేకపోవడంతో విసిగిపోయారు. కొన్ని కారణాలతో బస్సులు రద్దు చేసినట్లు ఆర్టీసీ ఉద్యోగులు వెల్లడించారు. రామభద్రపురం ఆర్టీసీ కాంప్లెక్సుకు వచ్చిన ప్రయాణికులు బస్సులు లేక ఆటోలు, జీపులు, వ్యాన్లులను ఆశ్రయించారు. గజపతినగరంలో విద్యార్థులు కళాశాలలకు వెళ్లేందుకు బస్సులు లేక ఇబ్బందులు పడ్డారు. మరికొందరు ఇళ్లకు వెనుదిరిగారు. చీపురుపల్లి ఆర్టీసీ కాంప్లెక్సు నుంచి రాజాం, విజయనగరం, శ్రీకాకుళం తదితర ప్రాంతాలకు వెళ్లేందుకు బస్సులు పూర్తిస్థాయిలో రాకపోకలు చేయకపోవడంతో ప్రయాణికులు వేచి ఉండాల్సి వచ్చింది. చివరికి ప్రైవేటు వాహనాల్ని ఆశ్రయించారు. మూడు జిల్లాలకు ప్రధాన కూడలిగా ఉన్న రాజాం ఆర్టీసీ కాంప్లెక్సుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు బస్సుల్లేక ఇబ్బందులు పడ్డారు.  సామాన్యులకు ఇబ్బందులు

 మాది తెర్లాం. వేరే పనిమీద పక్కి గ్రామం వెళ్లేందుకు ఉదయం 7 గంటలకు వచ్చాను. 8:30 గంటలు అయినా బస్సు రాకపోవడంతో అనుమానం వచ్చి ఉద్యోగులను అడిగితే బస్సు రద్దు అయినట్లు చెప్పారు. అక్కడ వేలాడ దీసిన బోర్డును చూసి, ఆశ్చర్యపోయాను. ఆ గ్రామానికి వెళ్లేందుకు ప్రైవేటు వాహనాలు కూడా ఉండవు. సామాన్యుల్ని ఇబ్బందిపెడుతున్నారు.

- ఎన్‌. రమణ, తెర్లాం


విశాఖ నుంచి వచ్చి ఆగిపోయా..

మక్కువ వెళ్లేందుకు విశాఖ నుంచి బొబ్బిలికి వచ్చాను. ఉదయం 8:30 గంటల బస్సుకు వెళ్లాలి. వైకాపా సభల పేరుతో బస్సులు రద్దు చేయడం అన్యాయం. మారుమూల ప్రాంతాలకు ప్రైవేటు వాహనాలు ఉండవు. ఇప్పుడెలా చేరుకోవాలో తెలియడం లేదు.

   - ఆర్‌కే నారాయణ, విశాఖ
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు