logo

పర్యాటకంపై ‘జగన్‌ పడగ’

ఎత్తయిన పచ్చని గిరులు, గలగల పారే కొండవాగులు, గుట్టల నుంచి జాలువారే సెలయేళ్లు, నదులకు నిలకడ నేర్పే జలాశయాలు, చారిత్రక అవశేషాల నిలయాలు, ఉత్సాహానిచ్చే సాహస క్రీడలు...

Published : 09 May 2024 03:45 IST

ఎత్తయిన పచ్చని గిరులు, గలగల పారే కొండవాగులు, గుట్టల నుంచి జాలువారే సెలయేళ్లు, నదులకు నిలకడ నేర్పే జలాశయాలు, చారిత్రక అవశేషాల నిలయాలు, ఉత్సాహానిచ్చే సాహస క్రీడలు... ఇలా ఉభయ జిల్లాల్లో ప్రకృతి రమణీయత, ప్రత్యేకతలు ఉట్టిపడే సందర్శనీయ స్థలాలు ఎన్నో.. గతంలో పర్యాటకుల తాకిడితో సందడిగా ఉండేవి. విశిష్టతలతో ఆకట్టుకుంటూ మధురానుభూతులు మిగిల్చేవి. గత అయిదేళ్లూ వైకాపా హయాంలో నిర్లక్ష్యానికి గురై ఆ ప్రాభవాన్ని కోల్పోయాయి.. నేడు అభివృద్ధి, నిర్వహణకు నోచుకోక కళావిహీనంగా గోచరిస్తున్నాయి.


వీర బొబ్బిలిపై నిర్లక్ష్యం..

బొబ్బిలిలోని యుద్ధస్తంభం

తిహాసానికి సాక్ష్యంగా నిలుస్తున్న పౌరుషాల గడ్డ బొబ్బిలిలో అయిదేళ్ల వైకాపా పాలనలో ప్రగతి అటకెక్కింది. చారిత్రక యుద్ధస్తంభం పార్కు అభివృద్ధిలో భాగంగా పదేళ్ల కిందట ల్యాండ్‌ స్కేపింగుతో పాటు వివిధ రకాల మొక్కలు వేసి సుందరంగా తీర్చిదిద్దారు. సంరక్షణ కొరవడటంతో అవన్నీ పాడవుతున్నాయి. పర్యాటకుల కోసం నిర్మించిన క్యాంటీన్‌ శిథిలావస్థకు చేరుకుంది. రాణిమల్లమ్మదేవి పార్కులో రూ.7 లక్షలతో చేపట్టిన నడక దారి పనులు మధ్యలో నిలిచిపోయాయి.భైరవసాగరం వద్ద రూ.50 లక్షలతో ల్యాండ్‌స్కేపింగు, విద్యుద్దీకరణ, అభివృద్ధి పనులకు భూమి పూజ చేసినా.. గట్టు చదును తప్ప అడుగులు ముందుకు పడలేదు. భైరవసాగరం, రాణిమల్లమ్మదేవి కోనేరులో బోటు షికారు ప్రతిపాదనలు కార్యరూపం దాల్చలేదు. పురపాలక సంఘం కమిషనర్‌ రామలక్ష్మి మాట్లాడుతూ.. పట్ణణాన్ని పర్యాటకంగా తీర్చిదిద్దేందుకు నిధులు కేటాయించిన పనులపై దృష్టి సారించి ముందుకు తీసుకువెళ్తామని తెలిపారు.

న్యూస్‌టుడే, బొబ్బిలి


సాగరతీరంతో సమస్యల ఘోష

విజయనగరం జిల్లాకు ప్రకృతి మణిహారం.. సాగరతీరం. పర్యాటక రంగంగా అభివృద్ధికి అవకాశమున్నా ఆ దిశగా వైకాపా ప్రభుత్వంలో చొరవ కొరవడింది. బంగాళాఖాతం వెంబడి భోగాపురం, పూసపాటిరేగ మండలాల్లో 28 కి.మీ. మేర తీర ప్రాంతం విస్తరించి ఉంది. బీచ్‌ల్లో కనీస సదుపాయాలు గగనమే అవుతోంది. కనీసం కూర్చోవడానికి బల్లలూ లేవు. సముద్రంలో స్నానాలు చేసే వారికి మరుగు సౌకర్యం లేదు. ఆధ్యాత్మిక కేంద్రాలుగా విరాజిల్లుతున్న గోవిందపురం గీతామందిరం, కందివలస సాయిస్తూపం సందర్శించే భక్తులు సమీపంలోని చింతపల్లి బీచ్‌కు చేరుకొని ఆనందంగా గడిపి వెళతారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ రూ.కోటి వ్యయంతో పర్యాటకాభివృద్ధికి తెదేపా ప్రభుత్వం చొరవ తీసుకుంది. ఇందుకు తగ్గట్టుగా అతిథి గృహాలు, చిన్నారుల క్రీడా ప్రాంగణం వంటివి రూపుదిద్దుకున్నాయి. ఆ తర్వాత వచ్చిన వైకాపా ప్రభుత్వం పక్కన పెట్టేయడంతో కట్టడాలన్నీ శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇదే తీరంలో స్కూబా డ్రైవింగు వంటి ప్రతిపాదనలు సంద్రంలో కలసిపోయాయి.

న్యూస్‌టుడే, భోగాపురం/పూసపాటిరేగ


పడకేసిన ప్రతిపాదనలు

రామతీర్థం.. పుణ్యక్షేత్రమే కాదు. పురాణ, ఇతిహాసాలకు నెలవు. ప్రధాన దేవాలయానికి ఆనుకొని ఉన్న బోడికొండ, ఘనికొండ, గురుభక్తుల కొండలపై చారిత్రక విశేషాలు ఎన్నో ఉన్నాయి. భక్తులు, పర్యాటకుల తాకిడి ఉన్నా మౌలిక సదుపాయాలు కొరవడ్డాయి. బోడికొండ (నీలాచలం)పై సీతారామలక్ష్మణులు, పాండవులు నడయాడిన చిహ్నాలు కనిపిస్తాయి. చంపావతి నదితీరాన ఉన్న ఘనికొండ, గురుభక్తుల కొండలపై బౌద్ధ భిక్షువులు కొలువుదీరిన ఆరామాల శిథిలాలు ఉన్నాయి. నీలాచలంపై ఉన్న కోదండరాముని ఆలయం, పాతాళగంగ, భీముని బుర్ర, బుద్ధ విగ్రహం, పర్ణశాల, పలుకురాయి, పాండవుల పంచలు సందర్శించేందుకు యాత్రికులు ఆసక్తి చూపుతుంటారు. కానీ మెట్ల మార్గంలో, కాలినడకన కొండపై వెళ్లేందుకు ఇబ్బందులు పడుతుంటారు. గతంలో రోప్‌వే ఏర్పాటుకు ప్రతిపాదనలు వెళ్లినా కార్యరూపం దాల్చలేదు. దీనిపై రామతీర్థం దేవస్థానం ఈవో వై.శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి.. పర్యాటకాభివృద్ధికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

న్యూస్‌టుడే, నెల్లిమర్ల


బోటు షికారు.. నామమాత్రమే..

పార్వతీపురం మన్యం జిల్లాలో తోటపల్లి ప్రాజెక్టు పర్యాటక కేంద్రంగా గుర్తింపు పొంది. ఉల్లిభద్ర వద్ద జలాశయానికి ఆనుకొని ఉన్న ఐటీడీఏ పార్కు, బోటు షికారు కేంద్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచేవి. ఇప్పుడు ప్రభుత్వపరంగా ప్రోత్సాహం లేక నిర్వహణ కొరవడ్డాయి. పార్కు ముఖద్వారమే కళ తప్పగా.. గిరిజనుల జీవన విధానం ఉట్టిపడే బొమ్మల రంగులు వెలిశాయి. పిల్లల ఆట పరికరాలు పాడయ్యాయి. బోటు షికారు కోసం గతంలో పనిచేసిన పీవో సువర్ణ పండాదాస్‌ చొరవ తీసుకున్నారు. రూ.లక్షలు వెచ్చించి.. 24 మంది సామర్థ్యంతో డీలక్స్‌ బోటును ఐటీడీఏ, పాంటెన్‌ బోటును టూరిజం శాఖ కొనుగోలు చేశాయి. మరో రెండు చిన్న పడవలు సమకూర్చాయి. ప్రస్తుతం విహారయాత్రకు చిన్నవే అందుబాటులో ఉన్నాయి. ఈ విషయాన్ని బోటు షికారు నిర్వహణను పర్యవేక్షించే పవన్‌కుమార్‌ వద్ద ప్రస్తావించగా బీమా, ఎన్‌వోసీ అనుమతులు లేనందున పెద్ద బోట్లను నాలుగేళ్లుగా నడపడం లేదన్నారు.  

న్యూస్‌టుడే, గరుగుబిల్లి


జాలువారే జలపాతాలు..

మన్యంలో జలపాతాలకు సాలూరు మండలం పుట్టినిల్లు. కొండలపై నుంచి జలధారలు దిగువకు చేరుకుంటూ చూపరులను ఆకట్టుకుంటున్నాయి. దండిగాం, దళాయివలస, శిఖపరువు, తోనాం తదితర జలపాతాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.  కురుకుట్టి పంచాయతీలో దళాయివలస వరకే రహదారి ఉంది. అక్కడ నుంచి పువ్వలవలస వరకూ ద్విచక్ర వాహనం వెళ్లగలిగే మట్టిరోడ్డు ఉంది. అక్కడ నుంచి  రెండు కి.మీ. దూరంలో ఉన్న దళాయివలస జలపాతానికి నడిచి వెళ్లాల్సిందే. సారిక పంచాయతీ పరిధిలో దండిగాం జలపాతం వద్ద పదేళ్ల క్రితం విద్యుదుత్పత్తి కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకున్నా.. ఆ ప్రాజెక్టు నిలిచిపోయింది. దండిగాం కూడలి నుంచి అర కిలోమీటరు దూరంలోని జలపాతానికి చేరుకోవాలంటే కాలినడకే శరణ్యం. పట్టుచెన్నూరు పంచాయతీలో శిఖపరువు జలపాతం వద్ద సౌకర్యాలు లేవు. రెండేళ్ల క్రితం ఉపాధి హామీలో రహదారి వేశారు. రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్‌ డైరెక్టరుగా ఉన్న రేగాన శ్రీనివాసరావు ఈ ప్రాంతంలో పర్యటించినప్పుడు జలపాతాల వరకు రహదారుల నిర్మాణంతో పాటు స్నానానికి, దుస్తులు మార్చుకునేందుకు గదులు ఏర్పాటు చేస్తామని చెప్పినా.. ఇంతవరకు ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాలేదు.

న్యూస్‌టుడే, సాలూరు గ్రామీణం  


తాటిపూడి జలాశయం

జిల్లాలో తాటిపూడి జలాశయం.. ప్రకృతి అందాల ఒడి.. సందర్శకుల విడిది. బోటు షికారు ప్రత్యేకం. ఇది ఒకప్పటి మాట. గోదావరి, కృష్ణా నదుల్లో జరిగిన ప్రమాదాల తరువాత రాష్ట్రవ్యాప్తంగా పడవ ప్రయాణాలను ప్రభుత్వం నిషేధించింది. 2019 నుంచి తాటిపూడిలోనూ నిలిచింది. గోదావరి, కృష్ణా నదుల్లో పడవ ప్రయాణాలకు అనుమతులిచ్చినా.. ఇక్కడ మాత్రం బోటు షికారును పునరుద్ధరించలేదు. దీనిపై ఆధారపడిన ఇరవై మంది ఉద్యోగులు ఉపాధి కోల్పోయారు. ఇక్కడ పర్యాటక శాఖ రూ.43 లక్షలతో కట్టించిన రివర్‌బే రెస్టారెంటు ఆరేళ్లుగా వృథాగా ఉంది. జలాశయం ఆవల గిరివినాయక ఏకో టూరిజం కేంద్రంలో రూ.కోటితో నిర్మించిన కాటేజీలు నిరుపయోగంగా ఉన్నాయి.

న్యూస్‌టుడే, గంట్యాడ, గ్రామీణం


ఏదీ.. నాటి వైభవం..

సీతంపేటలో ఎన్టీఆర్‌ సాహస ఉద్యానవనం రాష్ట్రానికే తలమానికంగా నిలిచింది. తెదేపా హయాంలో అప్పటి ఐటీడీఏ పీవో లోతేటి శివశంకర్‌ చొరవతో అద్భుతంగా పార్కు రూపుదిద్దుకుంది. తొలుత రూ.40 లక్షల అంచనాతో మూడు ఎకరాల్లో జలవిహార్‌ కేంద్రానికి శంకుస్థాపన చేయగా.. ఏడాదిలోనే రూ.3 కోట్ల వ్యయంతో ఎన్టీఆర్‌ సాహస ఉద్యాన పార్కుగా అవతరించింది. 2018 ఏప్రిల్‌ 25న అప్పటి మంత్రి నారా లోకేశ్‌ చేతుల మీదుగా ప్రారంభమైంది. ఈ పార్కుతో పాటు మెట్టుగూడ జలపాతం వద్ద 54 మంది గిరిజన యువతకు ఉపాధి లభించింది. పర్యాటకుల సందడితో.. రూ.కోట్లలో ఆదాయంతో ఓ వెలుగు వెలిగింది. వైకాపా అధికారంలోకి వచ్చాక పార్కు వైభవం కోల్పోయింది. ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ఆల్‌ టెర్రైన్‌ వాహనాలు మూలకు చేరగా.. పర్యాటకులు గాల్లో విహరించే పారామోటారింగ్‌ ఆగిపోయింది.

న్యూస్‌టుడే, సీతంపేట

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు