logo

ఊహూనే కానీ..ఉ అనేవారు లేరు...

ఒకప్పుడు ప్రభుత్వ భవనాల నిర్మాణ పనులంటే టెండర్లను దక్కించుకునేందుకు గుత్తేదారులు పోటీ పడేవారు. ఇప్పుడు బిల్లులు వస్తాయో రావో అనే భయంతో చాలా మంది ముందుకు రావడం లేదు. కొందరైతే చేసిన పనులకు సొమ్ము చెల్లించలేక

Published : 24 Jan 2022 05:19 IST

బిల్లులు రావని గుత్తేదారుల వెనకడుగు

జిల్లాలో రూ.212 కోట్ల మేర బకాయిలు

సంతనూతలపాడు మండలం ఎండ్లూరులో

అసంపూర్తిగా మిగిలిన గ్రామ సచివాలయ భవనం

కొత్తపట్నం, న్యూస్‌టుడే ఒకప్పుడు ప్రభుత్వ భవనాల నిర్మాణ పనులంటే టెండర్లను దక్కించుకునేందుకు గుత్తేదారులు పోటీ పడేవారు. ఇప్పుడు బిల్లులు వస్తాయో రావో అనే భయంతో చాలా మంది ముందుకు రావడం లేదు. కొందరైతే చేసిన పనులకు సొమ్ము చెల్లించలేక కూలీలకు కూడా ముఖం చాటేస్తున్నారు. ఇటువంటి వారిలో ఎక్కువ మంది అధికార పార్టీ సానుభూతిపరులే ఉండటం గమనార్హం. గత ప్రభుత్వ హయాంలో పనులు చేసిన గుత్తేదారుల్లోనూ చాలా మందికి బిల్లులు అందలేదు. కొత్తగా చేపట్టిన పనుల్లోనూ అదే పరిస్థితి.

టెంకాయలు కొట్టి ప్రారంభించినప్పటికీ...

గ్రామ సచివాలయాలకు కొత్త భవనాలు నిర్మించేందుకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనుసంధాన నిధులను రాష్ట్ర వ్యాప్తంగా కేటాయించింది. వీటి పురోగతిపై రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్ఢి. జిల్లా స్థాయిలో కలెక్టర్‌ సమీక్షిస్తున్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతా కార్యక్రమాలు కావడంతో రాష్ట్రస్థాయిలో ఉన్నతాధికారుల నుంచి జిల్లా, మండల అధికార యంత్రాంగంపై ఒత్తిడి ఉంటోంది. వీటిని త్వరితగతిన పూర్తిచేసేలా గతేడాది జూన్‌లో ‘భవన నిర్మాణ పక్షోత్సవాలు’ కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. క్షేత్రస్థాయిలో టెంకాయ కొట్టి పనులు ప్రారంభించినప్పటికీ.. పురోగతి ఆశించిన మేర లేకపోయింది.

మొత్తం రూ. 289 కోట్ల మేర పనులు...

అన్ని భవన నిర్మాణ పనులను విడతల వారీగా 2020 జనవరి నెల నుంచే ప్రారంభించారు. బిల్లుల చెల్లింపులో నెలల తరబడి జాప్యం చోటుచేసుకోవడంతో గుత్తేదారులు పనులు ఆపేశారు. జూన్‌లో పక్షోత్సవాలు నిర్వహించి అప్పటి వరకు ఉన్న బకాయిల్లో కొంత చెల్లించారు. హెల్త్‌ క్లినిక్‌ భవనాలకు మాత్రం డిసెంబర్‌లో జమ చేయగా, మిగతా వాటికి ఇంతవరకు లేవు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు మెటీరియల్‌ కాంపోనెంట్‌ కింద రూ.289 కోట్ల మేర పనులు చేపట్టగా.. అందులో రూ.212 కోట్ల మేర బిల్లులు బకాయిలున్నాయి. సకాలంలో బిల్లులు రాకపోవడంతో గుత్తేదారులు కూడా త్వరగా పనులు పూర్తి చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. దీంతో కొన్ని ప్రాంతాల్లో పనులు నత్తనడకన సాగుతుండగా; మరికొన్ని చోట్ల పలు దశల్లో నిలిచిపోయాయి. ఇసుక అందుబాటులో లేక కూడా నిలిచిపోయినవి ఉన్నాయి.

సింగరాయకొండ గ్రామ పంచాయతీలో అసంపూర్తిగా

ఆగిన విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ భవన నిర్మాణం

మూడు కేటగిరీలుగా విభజించి...

జిల్లా వ్యాప్తంగా 1046 గ్రామ పంచాయతీలుండగా.. జనాభా ప్రాతిపదికన 879 గ్రామ సచివాలయాలుగా విభజించారు. వీటిలో సొంత భవనం లేని.. శిథిలావస్థకు చేరిన చోట్ల కొత్తగా నిర్మించేందుకు మొదటి కేటగిరీలో రూ.40 లక్షలు మంజూరు చేశారు. రెండో కేటగిరీ కింద ప్రస్తుత భవనం పైన మరొకటి నిర్మిస్తారు. అందుకు రూ.25 లక్షలు అంచనా వేశారు. మూడో కేటగిరీగా ప్రస్తుత భవనాన్ని విస్తరించేందుకు రూ.35 లక్షల నిధులు మంజూరు చేశారు. రైతు భరోసా కేంద్రం, విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లు నిర్మించాలనీ నిర్ణయించారు. ఈ పనులన్నీ 2019-20 ఆర్థిక సంవత్సరంలోనే శ్రీకారం చుట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని