logo

నిలిచిన సాయం... ప్రాణాలకు గండం

రాష్ట్రంలో కిడ్నీ వ్యాధి బాధితులు అధికంగా ఉన్న జిల్లాల్లో ప్రకాశం ఒకటి. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న పింఛన్‌ సాయంతో వందల మంది బాధితులు జిల్లాలోని వివిధ వైద్యశాలల్లోని డయాలసిస్‌ కేంద్రాల్లో చికిత్స పొందుతున్నారు. అయితే ప్రస్తుతం కొంతమందికి పింఛన్లు నిలిచిపోవడంతో ప్రాణాలు కాపాడుకొనేందుకు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. రవాణా,

Published : 27 Jan 2022 06:34 IST

 

డయాలసిస్‌ రోగులకు అందని పింఛన్లు 

కనిగిరి కేంద్రంలో రోగులు 

కనిగిరి, న్యూస్‌టుడే:  రాష్ట్రంలో కిడ్నీ వ్యాధి బాధితులు అధికంగా ఉన్న జిల్లాల్లో ప్రకాశం ఒకటి. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న పింఛన్‌ సాయంతో వందల మంది బాధితులు జిల్లాలోని వివిధ వైద్యశాలల్లోని డయాలసిస్‌ కేంద్రాల్లో చికిత్స పొందుతున్నారు. అయితే ప్రస్తుతం కొంతమందికి పింఛన్లు నిలిచిపోవడంతో ప్రాణాలు కాపాడుకొనేందుకు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. రవాణా, ఆహార పదార్థాల ధరలు సైతం పెరిగిపోవడంతో ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నారు.  

10 శాతం మందికి...

జిల్లాలో డయాలసిస్‌ పేషెంట్లు మొత్తం 475 మంది ఉన్నారు. చీరాల కేంద్రంలో 70, కనిగిరిలో 120, కందుకూరులో 90, మార్కాపురంలో 65, ఒంగోలు రిమ్స్‌లో 110, సంఘమిత్ర ఆసుపత్రిలో 20 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. వీరిలో ఒక్క కనిగిరి ప్రాంతంలోనే 15 మందికి పింఛను నిలిచిపోయి అవస్థలు పడుతున్నారు. జిల్లాలోని అన్ని కేంద్రాల్లో కలిపి సుమారు 50 మంది వరకు పింఛను నగదు కోసం ఎదురు చూస్తున్నారు. వీరిలో కొందరు వారానికి రెండుసార్లు, మరి కొందరు వ΄డుసార్లు డయాలసిస్‌ చేయించుకుంటున్న వారు ఉన్నారు. 

పల్లెల్లోనే బాధితులు అధికం...

కిడ్నీ సంబంధ వ్యాధులతో బాధపడుతూ డయాలసిస్‌ చేయించుకుంటున్న రోగులు గ్రామాల్లోనే అధికంగా ఉన్నారు. వీరంతా వారానికి రెండు, వ΄డు సార్లు సమీపంలోని కేంద్రాలకు వచ్చి చికిత్సలు చేయించుకోవాలి. ప్రభుత్వం రూ.10 వేలు నగదును పింఛనుగా అందిస్తున్నప్పటికీ మందులు, వైద్యం, ఆహార పదార్థాలు ఇలా అన్ని రకాల ఖర్చులు పెరిగిపోవడంతో ఆ నగదు సరిపోక ఇబ్బందులు పడుతున్నారు. కనిగిరి, కందుకూరు డయాలసిస్‌ కేంద్రాలకు చుట్టు పక్కల ప్రాంతాల రోగులే కాకుండా నెల్లూరు జిల్లాలోని వరికుంటపాడు, పెదరాజుపాలెం, కొండాపురం, ఉదయగిరి, వింజమూరు, కలిగిరి, మర్రిపాడు తదితర మండలాల నుంచి కూడా రోగులు వస్తున్నారు. బస్సు సౌకర్యం లేక చాలా మంది ప్రైవేటు వాహనాలను ఆశ్రయించి రెట్టింపు సొమ్ము చెల్లించి ప్రయాణిస్తున్నారు.

 

 

పది నెలలుగా ఎదురుచూస్తున్నా

మాది వెలిగండ్ల మండలం రంగన్నపల్లి. నేను వారానికి మూడుసార్లు డయాలసిస్‌ చేయించుకోవాలి. మాది నిరుపేద కుటుంబం. నేను పింఛను కోసం 10 నెలల క్రితం దరఖాస్తు చేసుకున్నా. ఇంతవరకు మంజూరు కాలేదు. ఆసుపత్రికి, కార్యాలయానికి తిరగడానికి ప్రతిసారి రవాణా ఖర్చులు రూ.500 అవుతున్నాయి. ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి. - ఎం.కుమారి, రంగనపల్లి

రవాణా ఖర్చులూ భరించలేకున్నా

మాది కనిగిరి మండలం వాగుపల్లి. గత ఏడాది జూన్‌లో దరఖాస్తు చేసుకున్నా. ఇప్పటికీ మంజూరు కాలేదు. వారానికి మూడుసార్లు డయాలసిస్‌ చేయించుకోవాలి. రవాణా ఖర్చులూ భరించలేని పరిస్థితి మాది. దీనికితోడు ఉన్న డబ్బులన్నీ బలవర్థకమైన తిండి, మందుల కోసం ఖర్చు చేయాల్సి వస్తోంది. అధికారులు స్పందించి మా బాధలు తీర్చాలి. - ముప్పూరి వెంకటేశ్వర్లు, వాగుపల్లి

మంజూరుకు కృషి చేస్తా

కనిగిరి డయాలసిస్‌ కేంద్రంలో డయాలసిస్‌ రోగులకు పింఛను రావడం లేదని ఇప్పుడే తెలుసుకున్నాను. కనిగిరితో పాటు జిల్లాలో దరఖాస్తు చేసుకున్న వారికి ఎక్కడెక్కడ పింఛన్లు మంజూరు కాలేదో తెలుసుకుని వారికి అందేలా చర్యలు తీసుకుంటాం. - శ్రీనివాస్‌, డయాలసిస్‌ కేంద్రాల జిల్లా మేనేజర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని