logo

మహానాడుపై మనదైన ముద్ర

ఒంగోలు సమీప మండువవారిపాలెంలో ఈనెల 27, 28 తేదీల్లో జరిగే మహానాడుపై గురువారం జిల్లా తెదేపా కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఏర్పాట్లకు సంబంధించి ఒంగోలు నియోజకవర్గానికి చెందిన పార్టీ నాయకులతో తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల

Published : 20 May 2022 02:02 IST

సమీక్షలో దామచర్ల


సమావేశంలో మాట్లాడుతున్న తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: ఒంగోలు సమీప మండువవారిపాలెంలో ఈనెల 27, 28 తేదీల్లో జరిగే మహానాడుపై గురువారం జిల్లా తెదేపా కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఏర్పాట్లకు సంబంధించి ఒంగోలు నియోజకవర్గానికి చెందిన పార్టీ నాయకులతో తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్దన్‌ మాట్లాడారు. ఎన్టీఆర్‌ శత జయంతి సందర్భంగా ఒంగోలులో మహానాడు నిర్వహించడం సంతోషదాయకమన్నారు. నగర అలంకరణపై ప్రత్యేక సూచనలు చేశారు. భోజన వసతి, ఇతర సదుపాయాలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూసుకోవాలన్నారు. నిర్వహణలో మనదైన ముద్ర వేద్దామన్నారు. మహానాడు కార్యక్రమానికి ఇప్పటికే వివిధ కమిటీలను నియమించారు. సజావుగా నిర్వహించేలా నియోజకవర్గ ముఖ్య నాయకులను అనుబంధ కమిటీలో చేర్చారు. సమావేశంలో ఏఎంసీ మాజీ ఛైర్మన్‌ కామేపల్లి శ్రీనివాసరావు, మున్సిపల్‌ మాజీ ఛైర్మన్‌ మంత్రి శ్రీనివాసరావు, పార్టీ నాయకులు వైవీ.సుబ్బారావు, బండారు మదన్, కొఠారి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 
* మండువవారిపాలెం వద్ద మహానాడుకు భూమి పూజ చేసిన స్థలంలో ప్రస్తుతం చదును చేసే పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. తొమ్మిది డ్రోజర్లతో గురువారం పనులు ఆరంభించారు. వేదిక, గ్యాలరీ ఏర్పాటుకు శుక్రవారం కొలతలు తీసుకుని నిర్మాణ పనులు చేపట్టనున్నారు. 


ఒంగోలులో గదుల్లేవు

ఒంగోలు ట్రంకురోడ్డు, ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: మహానాడు నేపథ్యంలో ఈనెల 27, 28 తేదీల్లో లాడ్జిలు, హోటళ్లతో పాటు ప్రైవేటు అతిథిగృహాలకు డిమాండ్‌ పెరిగింది. కార్యక్రమానికి హాజరయ్యే పలువురు తెదేపా నాయకులు గదుల కోసం ఆరా తీశారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల నుంచి గిరాకీ ఏర్పడింది. పరిస్థితిని ముందే ఊహించిన హోటళ్ల నిర్వాహకులు భారీగా ధరలు పెంచేశారు. పార్టీ నాయకులకు వసతి కల్పన నిమిత్తం పలు ప్రాంతాల్లోని లాడ్జిలు, కల్యాణ మండపాలను స్థానిక నాయకులు రిజర్వు చేశారు.
ఇతర ప్రాంతాల్లోనూ బసకు ఏర్పాట్లు
27న ప్రతినిధుల సభ జరగనుంది. ఆ రోజు హాజరైనవారు తర్వాతి రోజు మహానాడుకు వచ్చేందుకు వీలుగా లాడ్జీలలో గదులను కేటాయించేలా ప్రతిపాదించారు. కర్నూలు, అనంతపురం జిల్లాల నుంచి వచ్చే వారితోపాటు.. రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జులు, కీలక నాయకులు 27వ తేదీ రాత్రి ఒంగోలులోనే ఉంటారు. తెదేపా అధినేత చంద్రబాబునాయుడు మహానాడు వేదిక పక్కనే ఉన్న బృందావన కల్యాణ మండపంలో బస చేసేందుకు వీలుగా ప్రణాళిక చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం జిల్లా ప్రతినిధులకు గుంటూరులో.... తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లా వాసులకు విజయవాడలో... కడప, చిత్తూరు ప్రాంత వాసులకు నెల్లూరులో గదులు కేటాయించేందుకు ఏర్పాట్లుచేసినట్లు నేతలు తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని