logo
Updated : 12 Aug 2022 06:05 IST

వీరుడు.. నేతాజీకి చేదోడు

బ్రిటిష్‌ సేనలతో సమరంలో మనోడు
మద్దిపాడు, న్యూస్‌టుడే

‘మీరు రక్తాన్ని ఇవ్వండి. నేను మీకు స్వాతంత్య్రాన్ని ఇస్తాను..’
‘స్వేచ్ఛ ఎవ్వరూ ఇవ్వరు. మనకు మనమే తీసుకోవాలి..’
అనే ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ దళపతి అయిన నేతాజీ నినాదాలు ఆ యువకుడిని ఎంతగానో ఆకర్షించాయి. బ్రిటిష్‌ సైన్యంలో చేరాలనుకున్న తన లక్ష్యాన్ని మార్చుకున్నారు. దేశ మాత దాస్య శృంఖలాలను తెంచేందుకు నేతాజీ మార్గదర్శనంలో ముందుకు నడిచారు. యుద్ధ సమయంలో బ్రిటిష్‌ సైన్యం చేతికి చిక్కి జైలు జీవితాన్ని అనుభవించారు. ఈ క్రమంలో ఎలాంటి సమాచారమూ లేక.. కుమారుడు ఏమయ్యాడో తెలియక చనిపోయాడని అతని తల్లిదండ్రులు భావించారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత యుద్ధ ఖైదీగా జైలు నుంచి విడుదలయ్యారు. ఆ తర్వాత ఉద్యోగ విధులు నిర్వహిస్తూనే దేశభక్తిని చాటుకున్నారు. తన కుమారులను సైన్యంలో చేర్చి శెభాష్‌ అనిపించుకున్నారు. అయనే మద్దిపాడు మండలం పెదకొత్తపల్లికి చెందిన కోటా వీరాస్వామి పీటర్‌ అలియాస్‌(వీరాస్వామి రెడ్డి).

* యుద్ధం చేసి.. బంధీగా చిక్కి...: పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం గురవాయపాలెం గ్రామానికి చెందిన కోటా జోసఫ్‌, ఫ్లారెన్స్‌ దంపతులు. వీరి రెండో కుమారుడు కోటా వీరాస్వామి పీటర్‌. తల్లిదండ్రులిద్దరూ అప్పటి బ్రిటిష్‌ ప్రభుత్వంలో ఉపాధ్యాయులు కావడంతో వీరాస్వామి ఎస్‌ఎస్‌ఎల్‌సీ వరకు చదువుకున్నారు. విద్యార్థి దశలో క్రీడల్లో చురుగ్గా ఉండి పతకాలు పొందేవారు. స్నేహితులు అతన్ని పోలీసు శాఖలో చేరేందుకు ప్రోత్సహించారు. తాను కూడా ఆ దిశగా ఆసక్తి చూపారు. అదే సమయంలో దేశ స్వాతంత్య్రం కోసం ఆంగ్లేయులను తరిమి కొట్టేందుకు యుద్ధం చేసే దిశగా ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ పేరుతో సుభాష్‌ చంద్రబోస్‌ సైన్యాన్ని సిద్ధం చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న వీరాస్వామి ముందుగా బెంగళూరు కేంద్రంగా పనిచేసే మద్రాస్‌ సాపర్స్‌లో సిపాయిగా చేరారు. అనంతరం అదే దళంలో అవుల్దార్‌గా నియమితులయ్యారు. యుద్ధ విద్యలో మెలకువలు నేర్చుకుని కొత్తగా చేరిన వారికి శిక్షణ ఇచ్చేవారు. ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ దళంలో లెఫ్టినెంట్‌ ఇన్‌ఛార్జిగా బాధ్యతలు చేపట్టి రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్‌ సేనలకు వ్యతిరేకంగా పోరాడారు. యుద్ధం ముగిసిన అనంతరం దళ నాయకులను అరెస్టు చేయాలని బ్రిటిష్‌ ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు వీరాస్వామిని అప్పటి బర్మాలో అరెస్టు చేశారు. అనంతరం ఆయన్ను అండమాన్‌ నికోబర్‌ దీవుల్లోని జైలుకు యుద్ధఖైదీగా తరలించారు.

* చనిపోయాడని తలచి కన్నీరు...: వీరాస్వామి వివరాలు తెలియని తల్లిదండ్రులు కలత చెందారు. నెలలు గడచినప్పటికీ ఇంటికి రాకుండటంతో యుద్ధంలో తనువు చాలించాడని అంతా భావించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన అనంతరం యుద్ధ ఖైదీలను ప్రభుత్వం జైళ్ల నుంచి విడుదల చేసింది. ఆ తర్వాత వీరాస్వామి ఇంటికి చేరారు. అతన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు, గ్రామస్థులు సంతోషంతో వేడుక చేసుకున్నారు. 1950లో లస్కర్‌గా కొలువులో చేరి మద్దిపాడు మండలం పెదకొత్తపల్లి వచ్చారు. అదే గ్రామంలో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్న తెలగలపూడి విమలమ్మను వివాహం చేసుకున్నారు. వీరికి నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. కుమారులను సైన్యంలో చేర్పించి దేశానికి సేవ చేయించారు. కుమార్తెలు ఉపాధ్యాయులుగా స్థిరపడ్డారు. కుమారులతో పాటు చదువుకున్న పలువురు యువకులూ సైన్యంలో చేరేలా వీరాస్వామి ఎంతగానో ప్రోత్సహించారు. గ్రామంలో సుభాష్‌ చంద్రబోస్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేయించడమే కాకుండా.. తుదిశ్వాస విడిచే వరకు ప్రజల్లో దేశభక్తిని పెంపొందించేందుకు తనవంతు కృషి చేశారు.

Read latest Prakasam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని