logo

ఊరూరా ఇసుక తోడేళ్ల గుంపు

‘రాష్ట్రంలో వనరులను నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. లేకపోతే మట్టి, ఇసుక, రాయి ఏదీ ఉండదు. చివరికి గుడిలో దేవుడు కూడా ఉండడు..’

Published : 25 Apr 2024 02:54 IST

నదులు, వాగుల్లో ఇష్టారీతిన తవ్వకాలు
మూడేళ్లలో కొల్లగొట్టింది రూ. 405 కోట్లు


ప్రతిపక్షంలో పలుకులు...: ‘రాష్ట్రంలో వనరులను నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. లేకపోతే మట్టి, ఇసుక, రాయి ఏదీ ఉండదు. చివరికి గుడిలో దేవుడు కూడా ఉండడు..’

ప్రతిపక్ష నేతగా వైఎస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డి చెప్పిన మాటలివి.


అధికారంలో ఆణిముత్యాలు...: ‘వినియోగదారులకు తక్కువ ధరకే ఇసుక అందేలా, ప్రభుత్వ ఖజానాకు రాబడి వచ్చేలా కొత్త విధానం సమగ్రంగా ఉండాలి. ఖనిజాభివృద్ధి సంస్థకు బాధ్యతలు అప్పగించి, క్వారీల్లో సీసీ కెమెరాలు, వాహనాలకు జీపీఎస్‌తో అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలి. రాష్ట్రంలో అమలు చేసే విధానం దేశానికే ఆదర్శంగా ఉండాలి.’

2019లో అధికారంలోకి వచ్చిన తొలి నాళ్లలో జగన్‌ నోటి నుంచి వెలువడిన పలుకులివి.


జగన్‌వన్నీ మాయమాటలని అధికారంలోకి వచ్చిన కొద్దికాలంలోనే పరిస్థితులు తేల్చాయి. సహజ వనరుల సంరక్షణ మరిచి భక్షణకు తమ నేతా గణానికి అనుమతిచ్చారు. గత ప్రభుత్వం అమలు చేసిన ఉచిత ఇసుక విధానానికి చరమగీతం పాడారు. తవ్వకాలను ఆపేసి ఒక్కసారిగా ఖరీదైన సరకుగా మార్చారు. డిమాండ్‌కు తగినట్లు సరఫరా లేక నిర్మాణాలు నిలిచిపోయాయి. పనులు లేక బేల్దారీలు, కార్మికులు పస్తులున్నారు. అదే సమయంలో వైకాపా నేతలు ఇసుక తోడేళ్ల అవతారమెత్తారు. దొంగలు దొంగలూ కలిసి ఊళ్లు పంచుకున్నట్లు.. జిల్లాలో ఇసుక లభించే ప్రాంతాలను పంచుకున్నారు. ఇష్టారాజ్యంగా తవ్వకాలు సాగించి సహజ వనరులు విధ్వంసం చేశారు. నదులను తోడేసి.. వాగులను కొల్లగొట్టారు. అధికారులు పట్టించుకోలేదు. విధేయులైన పోలీసులు తమవంతు సహాయ సహకారాలు అందించారు. మొత్తమ్మీద అధినేత జగన్‌ అండతో గజదొంగలందరూ ఇసుకలో రూ. కోట్లు దండుకున్నారు.

ఈనాడు, ఒంగోలు

రవాణా ఛార్జీల పేరుతో దోపిడీ...

ప్రభుత్వం నియోజకవర్గానికి ఒక స్టాక్‌ పాయింట్‌ ఏర్పాటు చేసింది. టన్నుకు యర్రగొండపాలెంలో రూ. 1,460, గిద్దలూరులో రూ. 1,215, సంతనూతలపాడులో రూ. 1,160, ఒంగోలులో రూ. 1,135, కొండపిలో రూ. 940, దర్శికి సంబంధించి రూ. 1,020, కనిగిరిలో 1,155, మార్కాపురం నుంచి 1,290 చొప్పున ధర నిర్ణయించింది. అనంతరం రవాణా ఛార్జీల పేరుతో దోపిడీకి తెర లేపింది. దీంతో ట్రాక్టర్‌ ఇసుకకు యర్రగొండపాలెంలో రూ.5,840 చెల్లించాల్సి వచ్చింది. అక్కడి నుంచి పుల్లలచెరువు, త్రిపురాంతంకం మండలంలోని చివరి గ్రామాలకు తీసుకెళ్లాలంటే రవాణా ఛార్జీలు మరో రూ.2 వేలు అదనం. దీంతో చిన్న నిర్మాణాలు ఆగిపోయాయి.

అనుమతులంటూ ఇతర రాష్ట్రాలకు...

కొండపి నియోజకవర్గంలోని జరుగుమల్లి, చింతలపాలెం, చిరుకూరిపాడు, పైడిపాడు, కామేపల్లి, పచ్చవ, కె.బిట్రగుంట, ముసి, పాలేరు వద్ద ఇసుక రీచులున్నాయి. ఇక్కడున్న కొన్నింటిలో తవ్వకాలకు అనుమతులున్నాయి. వీటిని అడ్డుపెట్టుకుని వైకాపా నాయకులు, అనుయాయులు రెచ్చిపోయారు. రాత్రీపగలు తేడా లేకుండా తవ్వకాలు సాగించారు. జేపీ సంస్థ పేరుతో తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకూ తరలించారు. రాత్రి వేళల్లో టెంట్లు ఏర్పాటు చేసుకుని మరీ ఇసుకను వాహనాలకు లోడు చేయంచి పంపారు. అయినా అధికారులు కన్నెత్తి చూడలేదు.

చిలకలేరును చెరబట్టారు...

చిలకలేరు వాగులో ఇసుక తవ్వకాల కోసం ఉమ్మడి ప్రకాశంలోని మూడు ప్రాంతాలకు చెందిన అధికార పార్టీ నాయకులు ఒక్కటయ్యారు. సమీపంలోని పోలవరం, తమ్మలూరు, మల్కాపురం, కుంకుపాడు, మోదేపల్లి రీచ్‌ల నుంచి రోజుకు 20 నుంచి 60 టిప్పర్ల వరకు తరలించారు. ఇందులో కొరిశపాడు మండలానికి చెందిన అధికార పార్టీ నాయకురాలు, చీమకుర్తి మండలానికి చెందిన మరో ఇద్దరు నాయకులు, తాళ్లూరు, ముండ్లమూరుకు చెందిన మరికొందరు ఇష్టారాజ్యంగా తవ్వి తరలించి సొమ్ము చేసుకున్నారు. వైకాపా అగ్రనాయకుడు, జిల్లాకు చెందిన మరో ముఖ్య నాయకుడి పేరు చెప్పి అధికారులను బెదిరింపులకు గురిచేశారు.

ఖజానాకు రూ. 64 కోట్ల గండి

రీచ్‌ల వద్దకే వద్ద నుంచే తీసుకెళ్తే టన్నుకు రూ.475 చెల్లిస్తే సరిపోతుందని ప్రభుత్వం ప్రకటనలు గుప్పించింది. ఆ ప్రకారం ట్రాక్టర్‌ ఇసుకకు రూ.1,900, టిప్పర్‌కు రూ.11 వేలు వ్యయమయ్యేది. ఈ లెక్కన రోజుకు 160 టిప్పర్లు ఇసుక తరలి పోతుందనుకున్నా.. టన్ను రూ.475 చొప్పున రూ.17 లక్షలు, నెలకు రూ.5.34 కోట్లు ఏడాదికి రూ.64 కోట్లు చొప్పన ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి అక్రమార్కులు జేబులు నింపుకొన్నారు.


ఇవిగో అక్రమార్కుల అడ్డాలు

  • జరుగుమల్లి, చింతలపాలెం, చిరుకూరిపాడు, పైడిపాడు, కామేపల్లి, పచ్చవ, కె.బిట్రగుంట, కొండపిలోని ముసి, పొన్నలూరులోని పాలేరు, గుండ్లకమ్మ నదీ పరివాహక ప్రాంతం, చిలకలేరు, పోలవరం, తమ్మలూరు, మల్కాపురం, కుంకుపాడు, మోదేపల్లి తదితర ప్రాంతాలు.
  • జరుగుమల్లి మండలంలో కొన్ని ప్రైవేట్‌ భూముల్లో అనుమతులున్నా అంతకుమించి, వాటిని ఆనుకుని ఉన్న నదీ పరివాహక ప్రాంతాల్లోనూ ఇసుక అక్రమంగా తవ్వి తరలించారు.
  • రక్షిత మంచినీటి పథకాలకు సమీపంలో ఇసుక తవ్వకూడదన్న నిబంధనలున్నా పట్టించుకోలేదు. పాలేరు, ముసి, చిలకలేరు ప్రాంతాల్లో ఇష్టారాజ్యంగా తవ్వి తాగునీటి పథకాలు ఒట్టిపోయే పరిస్థితి తెచ్చారు.
  • జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి రోజుకు సరాసరిన 120 నుంచి 160 టిప్పర్ల చొప్పున మూడేళ్లపాటు ఇసుక అక్రమ రవాణా ఇష్టారాజ్యంగా సాగింది. స్థానిక అవసరాల పేరుతో ఎద్దలబండ్లు, ట్రాక్టర్లతో రోజుకు వంద టన్నుల వరకు అక్రమంగా తరలిపోయింది అదనం.
  • రోజుకు 120 టిప్పర్లనుకున్నా.. నెలకు 3,600, ఏడాదికి 43,200 అవుతాయి. ఆ లెక్కన మూడేళ్లలో 1.29 లక్షల టిప్పర్ల ఇసుకను అక్రమంగా తవ్వి తరలించి జేబులు నింపుకొన్నారు.
  • ఒక్కో టిప్పర్‌కు 20 నుంచి 35 టన్నుల ఇసుక పడుతుంది. సగటున 25 టన్నులనుకున్నా.. మూడేళ్లలో 32 లక్షల టన్నుల వరకు అక్రమంగా తరలిపోయింది.
  • ప్రభుత్వం ప్రకటించినట్లు రీచ్‌ వద్ద టన్ను రూ.475 అనుకున్నా.. ఈ మొత్తం విలువ రూ.153 కోట్లుగా ఉంటుంది. బహిరంగ మార్కెట్‌లో విక్రయ ధర ప్రకారమైతే ఏకంగా రూ.405 కోట్లు. ఈ సొమ్మును అక్రమార్కులు జేబుల్లో నింపుకొన్నారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని