logo

నాడు రైతన్నలా ఠీవి నేడు తిండిగింజల్లేని కూలీ

ప్రకృతి కనికరించక.. పాలకులు పట్టించుకోక అభాగ్యులు తల్లడిల్లుతున్నారు. తెలుగుదేశం హయాంలో పలు ప్రోత్సాహకాలు, తగినంత విద్యుత్తు సరఫరాతో సాగు సాఫీగా సాగిపోయింది.

Published : 25 Apr 2024 02:42 IST

అయిదేళ్లలో తల్లకిందులైన చిత్రం
ఉపాధి లేక ఊళ్లొదిలిన అభాగ్యులు
నీటి మూటల్లా జగన్‌ హామీలు

న్యూస్‌టుడే, కనిగిరి : ప్రకృతి కనికరించక.. పాలకులు పట్టించుకోక అభాగ్యులు తల్లడిల్లుతున్నారు. తెలుగుదేశం హయాంలో పలు ప్రోత్సాహకాలు, తగినంత విద్యుత్తు సరఫరాతో సాగు సాఫీగా సాగిపోయింది. తదనంతరం జగన్‌ అధికార పీఠమెక్కాక రాయితీలకు మంగళం పాడటం.. గిట్టుబాటు ధరలు కన్పించకపోవడంతో రైతన్నలు కాస్తా కూలీల్లా మారారు. ఊళ్లో ఉండలేక ఉపాధి వెతుక్కుంటూ వెళ్లిపోతున్నారు  ప్రధానంగా కనిగిరి, దర్శి ప్రాంతాల్లో ఊళ్లకు ఊళ్లు ఖాళీ అయ్యాయి. పిల్లలు, వృద్ధులను ఇళ్ల వద్ద పెట్టి వలసపోయారు. బిడ్డలు వదిలేయడంతో మాతృమూర్తులు దీనంగా రోదిస్తున్నారు.

మాచవరంలో కొడుకులు, కోడళ్లు ఊరొదిలి వెళ్లడంతో ఒంటరిగా వృద్ధులు

ముందుకు కదలని నిమ్జ్‌...: గత అయిదేళ్లుగా ప్రభుత్వ విధానాలతో రైతన్నకు దిక్కుతోచడం లేదు. గత్యంతరం లేక తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ముంబయి, పుణె, ఢిల్లీ, మధ్యప్రదేశ్‌, చివరకు అండమాన్‌కు సైతం వెళ్లి బేల్దారి పనులు చేసుకుని పొట్ట పోషించుకుంటున్నారు. గ్రామంలో హుందాగా బతికిన వీరంతా చిన్నచిన్న వ్యాపారాలు చేసుకుంటూ..హోటళ్లలో సర్వర్లు, టీ బడ్డీలు నిర్వహిస్తూ దయనీయంగా బతుకులీడిస్తున్నారు. ఇలా పశ్చిమ ప్రకాశంలో లక్ష కుటుంబాలు వలస బాట పట్టాయి. గత అయిదేళ్లలో లక్షలాదిమందికి ఉపాధి కల్పించే నిమ్జ్‌ వైపు పాలకులు కన్నెత్తి చూడలేదు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయలేదు. బత్తాయి రసం ఫ్యాక్టరీ, చిన్న తరహా పరిశ్రమల స్థాపన విస్మరించారు. దీంతో స్థానికంగా పనులు లేక ఇతర ప్రాంతాలకు వారు వెళ్లిపోతున్నారు. గత పాదయాత్ర సమయంలో అప్పటి ప్రతిపక్ష నేత హోదాలో జగన్‌ పీసీ పల్లి, పామూరు మండలాలకు విచ్చేసి నిమ్జ్‌ను పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. 5 లక్షల మంది నిరుద్యోగ యువతీ యువకులకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పిస్తామన్నారు. అయిదేళ్లలో ఒక్క అడుగు పడలేదు.

ప్రకటనలకే పరిమితమైన కారిడార్‌: దర్శి నియోజకవర్గంలోని దొనకొండ మండలంలో పరిశ్రమల కారిడార్‌ కోసం గతంలో  25 వేల ఎకరాలు సేకరించారు. అయిదేళ్ల కాలంలో వైకాపా ప్రభుత్వం అక్కడ ఎలాంటి పనులు చేపట్టకపోవడంతో స్థానిక యువకులు ఉపాధి కోసం మహా నగరాలకు వలసపోతున్నారు. స్థానికంగా పనులు కల్పించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


ఊళ్లో మిగిలిన నానమ్మ.. మనుమరాలు

ఈ చిత్రం వాగుపల్లి గ్రామంలోనిది. మనుమరాలు మేఘనను చదివిస్తున్న నానమ్మ వేటగిరి రాములమ్మ! కుమారుడు మల్లికార్జున తన మూడెకరాల్లో సాగు చేసేందుకు వేసిన బోరు ఎండిపోయింది. పంటలు పంటక అప్పుల పాలయ్యారు. గత్యంతరం లేక తెలంగాణలోని నిజామాబాద్‌ వెళ్లిపోయారు. చిన్నారి మనమరాలిని తల్లిని  ఊళ్లో వదిలి వెళ్లిపోయారు.


తాళం వేసి.. తెలంగాణ బాట పట్టి..

కనిగిరి శివారు కొత్తూరులోని నాగేశ్వరరావు కుటుంబం పరిస్థితి మరీ దయనీయం స్థానికంగా పనులు లేకపోవడంతో ఊరొదిలి..తెలంగాణలోని బోధన్‌కు వెళ్లిపోయారు.


గతం ఘనం.. ఎండిపోయింది నిజం

ఈ తోట కనిగిరి మండలంలో పేరంగుడిపల్లిలోనిది. నీళ్లు లేక నిలువెల్లా ఎండి పోయింది. గతంలో ఉద్యాన పంటలకు చిరునామాగా ఉన్న కనిగిరిలో ప్రస్తుత పరిస్థితి ఇదీ! నీరు పెట్టలేక పండ్ల తోటలను వదిలేసి ఇతర ప్రాంతాలకు వలసబాట పట్టారు.


జగనన్నా.. ఇక్కడేనా లక్షల మందికి ఉపాధి కల్పిస్తోంది ?

ఈ చిత్రం పామూరు మండలం బోడవాడు సమీపంలో నిమ్జ్‌కు సంబంధించిన బోర్డు. ముఖ్యమంత్రి జగన్‌ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో కనిగిరి ప్రాంతంలో పాదయాత్ర చేశారు. నిమ్జ్‌ పూర్తిచేసి వలసలకు చరమగీతం పాడతానని, స్థానికంగా ఉన్న 5 లక్షల మంది యువతకు ఉపాధి కల్పిస్తానన్నారు. ఇప్పటికి కనీసం భూ సేకరణే జరగలేదు.


ఒంటరిగా మిగిలిన మాతృమూర్తి

ఈ చిత్రంలో వృద్ధురాలి పేరు బత్తుల లక్ష్మమ్మ. కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోని కొత్తూరు బీసీ కాలనీ. కుమారుడు కొండలరావుకు రెండెకరాల పొలం ఉన్నా, వర్షాధారం కావడంతో ఊళ్లో ఉపాధి లేక భార్య నాగలక్ష్మి, ఇద్దరు పిల్లలను తీసుకుని భాగ్యనగరానికి వెళ్లి బేల్దారి పనులు చేసుకుంటున్నారు. తల్లి లక్ష్మమ్మ దీనంగా ఇంటి వద్ద మిగిలారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని