logo

దాసుల తప్పు ఖాకీలెక్కలతో సరి

దర్శిలోని కేబీ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లో జిల్లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు, ఎన్నికల ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందం సభ్యులు ఇటీవల తనిఖీ చేశారు.

Published : 25 Apr 2024 02:49 IST

బార్ల నుంచి వైకాపా నేతలకు భారీగా మద్యం
దాడుల్లో పట్టుబడినా చర్యలు చేపట్టని యంత్రాంగం

దర్శిలోని కేబీ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లో జిల్లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు, ఎన్నికల ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందం సభ్యులు ఇటీవల తనిఖీ చేశారు. అక్కడ 133 మద్యం సీసాలు అక్రమంగా ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సదరు బార్‌ను సీజ్‌ చేశారు.


మార్కాపురం నేర విభాగం, న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ అభ్యర్థులు, నేతలు మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు. తమ అండదండలతో నడుస్తున్న బార్‌ అండ్‌ రెస్టారెంట్ల పేరుతో డిపోల నుంచి పెద్ద ఎత్తున సరకును ఇప్పటికే దిగుమతి చేసుకుని నిల్వ చేసుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పటిష్ఠ తనిఖీలు చేపట్టి మద్యానికి అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు స్వామిభక్తి చాటుకుంటున్నారు. తమకేం తెలియనట్లు నిద్ర నటిస్తున్నారు. మార్కాపురం ఉదంతమే ఇందుకు నిదర్శనం. పట్టణంలోని ఓ బార్‌ నుంచే పెద్ద ఎత్తున మద్యం తరలివెళ్తోందనే విమర్శలున్నాయి. ఇక్కడ అధికారులు మద్యం సీసాలు పట్టుకున్న విషయం తెలుసుకున్న వైకాపా నేత నేరుగా రంగంలోకి దిగారు. ఎలాంటి చర్యలు లేకుండా వారిపై ఒత్తిడి తెచ్చారు. అధికారులు కూడా వైకాపా నేతల ఆగడాలకు వంతపాడుతున్నారు. విచారణ పేరుతో సదరు బార్‌పై అధికారులు చర్యలు తీసుకునేందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారు. కాకిలెక్కలతో చర్యల నుంచి బయట పడేసేందుకు చూస్తున్నారు.

ఒప్పంద ఉద్యోగే సూత్రధారి...: జిల్లాలో ఒంగోలు, మార్కాపురం కేంద్రంగా ఉన్న మద్యం డిపోల నుంచి బార్‌ అండ్‌ రెస్లారెంట్లు, ప్రభుత్వ దుకాణాలకు సరఫరా చేస్తుంటారు. మార్కాపురం డిపో కింద మార్కాపురం, గిద్దలూరు, వై.పాలెం, కనిగిరి, దర్శి నియోజకవర్గాలున్నాయి. వీటి పరిధిలో తొమ్మిది బార్లు, అత్యధికంగా 101 మద్యం దుకాణలున్నాయి. వీటన్నిటికీ మార్కాపురం కేంద్రంగా ఉన్న డిపో నుంచి సరకు చేరవేస్తుంటారు. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన తర్వాత గతేడాది ఏ తేదీన ఎంత సరకు బార్లకు అందించారో.. అంతే సరకును ఇప్పుడు కూడా విక్రయించాలన్నది ఈసీ నిబంధన. అయితే వీటిని కొందరు తుంగలో తొక్కుతున్నారు. ఒక్కో కేసుపై రూ.500 అదనంగా తీసుకుని ఇప్పటికే పెద్ద ఎత్తున మద్యం నిల్వలను డిపో సిబ్బందే అందించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో డిపోలో పని చేసే ఓ ఒప్పంద ఉద్యోగి కీలకంగా వ్యవహరించినట్టు సమాచారం. మార్కాపురం నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు మూడు వేల కేసుల వరకు మద్యం చేరవేసినట్లు తెలిసింది.


ఈ నెల 22న వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థిగా అన్నా రాంబాబు నామపత్రం దాఖలు చేశారు. అంతకుముందు రోజు రాత్రి కళాశాల రహదారిలో ఉన్న అజంతా బార్‌ నుంచి 48 మద్యం సీసాలు అక్రమంగా తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. అనంతరం ఎస్సైకి అప్పగించగా నిందితులపై కేసు నమోదు చేశారు. బార్‌ నిర్వాహకులకు అధికార పార్టీ నేతల అండదండలు ఉండటంతో సీజ్‌ చేయకుండా కాలయాపన చేస్తున్నారు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు