logo
Published : 14 Aug 2022 02:31 IST

ఉప్పొంగే దేశభక్తి

త్యాగధనుల విశేషాల నిలయం ఆ బడి
పెద్దారవీడు, న్యూస్‌టుడే


పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన నేతాజీ వనం

ఆ పాఠశాలను చూస్తే దేశభక్తి ఉప్పొంగుతుంది. ఎందరో త్యాగధనుల విశేషాలు, స్వాతంత్య్ర సంగ్రామంలో మైలురాళ్లు, శాస్త్రవేత్తల విజయాల పరంపర వంటివన్నీ కళ్లముందు సాక్షాత్కరిస్తాయి. దీనివెనుక ఓ విశ్రాంత సైనికుడైన ప్రభుత్వ ఉపాధ్యాయుడి కృషి ఉంది. ఆజాదీ కా అమృత మహోత్సవ్‌ నేపథ్యంలో అణువణువూ తన రూపు మార్చుకొన్న ఆ బడి అనంతపురం-అమరావతి జాతీయ రహదారిలో పెద్దారవీడు మండలం ఓబులక్కపల్లిలో కనిపిస్తుంది. ఈ మండల పరిషత్‌ ఆదర్శ ప్రాథమిక పాఠశాల గురించి తెలుసుకుంటే..
మార్కాపురం పట్టణానికి చెందిన పి.శ్రీనివాసులు 1992లో ఆర్మీలో చేరి 2009 వరకూ సైనికుడిగా విధులు నిర్వర్తించి ఉద్యోగ విరమణ చేశారు. అనంతరం డీఈడీ చేసి డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. తొలుత ఓబులక్కపల్లి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడిగా 2012 డిసెంబర్‌లో నియమితులయ్యారు. అప్పుడు అయిదు తరగతులకు 16 మంది మాత్రమే ఉండేవారు. ఏకోపాధ్యాయుడిగా శ్రీనివాసులు బోధన అందించేవారు. వేసవి సెలవుల్లోనూ వచ్చి తరగతులు నిర్వహించారు. ఆ మరుసటి ఏడాది 70 మంది చేరారు. ప్రస్తుతం 203 మంది విద్యార్థులు, ఆరుగురు ఉపాధ్యాయులతో ప్రైవేట్‌కు దీటుగా నడుస్తోంది.


భారతదేశ చిత్రపటం, రాకెట్లు, అశోకచక్రం నమూనాలతో ఓబులక్కపల్లి పాఠశాల

ప్రధాని పిలుపుతో..
ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ సందర్భంగా ప్రధానమంత్రి పిలుపు అందుకొని పాఠశాల స్వరూపాన్ని అయిదు నెలల కాలంలో మార్చివేశారు. స్వాతంత్య్రం కోసం పోరాటం చేసి అమరులైన వారిని చిన్నారులు స్ఫూర్తిగా తీసుకునేందుకు రూ.లక్ష వెచ్చించి గోడలపై 30 మంది మహనీయుల చిత్రాలు గీయించారు. పాఠశాల పైన అశోక చక్రం, భారతదేశ మ్యాప్‌ ఉన్నాయి. ఆవరణలో నేతాజీ విగ్రహం ఏర్పాటుచేసి పార్కు రూపొందించారు. రోజూ ఉదయాన్నే విద్యార్థులు యోగా, వ్యాయామాలు చేస్తారు. ఇక గోడలపై జలియన్‌ వాలాబాగ్‌ దురంతం, సహాయ నిరాకరణోద్యమం, సత్యాగ్రహం, వందేమాతరం ఉద్యమ విశేషాలు.. రాణి లక్ష్మీబాయి, తాంతియాతోపే, భగత్‌సింగ్‌, నానాసాహెబ్‌, అల్లూరి, శివాజీల విశేషాలు.. గాంధీ, నెహ్రూ, పింగళి, ప్రకాశం పంతుల పెయింటింగ్‌లు.. ఇలా ఒక్కో గది వద్ద ఒక్కో ప్రత్యేకత కనిపిస్తుంది. కలాంను గుర్తు చేసేందుకు ప్రహరీపై అగ్ని-1, బ్రహ్మోస్‌, త్రిశూల్‌, ఆకాష్‌, అగ్ని-2 క్షిపణుల నమూనాలున్నాయి. ఏప్రిల్‌లో అమృత్‌ మహోత్సవాన్ని నిర్వహించారు. గత పదేళ్లలో పాఠశాలలో సమస్యల పరిష్కారంతో పాటు స్ఫూర్తిదాయకంగా తీర్చిదిద్దేందుకు రూ.10 లక్షలు ఖర్చు చేశారు. ఉపాధ్యాయుడు శ్రీనివాసులు సొంతంగా రూ.5 లక్షలు.. గ్రామస్థులు, దాతలు మరో రూ.5 లక్షలు సమకూర్చారు. మొత్తం వ్యయంలో రూ.6 లక్షలు అమృతోత్సవాల కోసమే .


స్వాతంత్య్ర ఉద్యమాలను గుర్తుచేసేలా చిత్రపటాలు


గొప్ప లక్ష్యాల దిశగా

మహనీయుల త్యాగాలు, విజయాలను వివరించడంతో పాటు భావితరాల్లో దేశభక్తిని ప్రోది చేసేందుకు పాఠశాలను ఈ స్థాయిలో తీర్చిదిద్దినట్లు ఉపాధ్యాయుడు శ్రీనివాసులు తెలిపారు. ఇక్కడి చిత్రాలను చూడగానే విద్యార్థి దశలోనే గొప్ప లక్ష్యాలను ఏర్పాటు చేసుకునే ఆలోచనలు కలుగుతాయన్నారు. వసతుల కల్పన, విద్యా బోధనలో ఎటువంటి లోటు లేకుండా ఉపాధ్యాయులమంతా కృషిచేస్తున్నట్లు తెలిపారు.

Read latest Prakasam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts