logo

సందర్శకులూ.. సౌకర్యాలు అడగొద్దు

సువిశాల తీర ప్రాంతం.. చారిత్రక ప్రసిద్ధి చెందిన ఆలయాలు, కట్టడాలు.. అద్భుతమైన ప్రకృతి వనరులు జిల్లా సొంతం. కానీ పర్యాటకంగా అభివృద్ధి ఎక్కడా కానరావడంలేదు. ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు, సందర్శకులకు వసతులు కల్పించేందుకు ప్రతిపాదనలైతే వెళ్తున్నాయి తప్ప నిధులు రావడంలేదు. నేడు ప్రపంచ పర్యాటక దినోత్సవం. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పరిస్థితులు పరిశీలిస్తే..

Updated : 27 Sep 2022 04:14 IST

కాగితాల్లోనే పర్యాటక ప్రాంతాల అభివృద్ధి

- న్యూస్‌టుడే, ఒంగోలు గ్రామీణం

కొత్తపట్నం సముద్ర తీర ప్రాంతం

సువిశాల తీర ప్రాంతం.. చారిత్రక ప్రసిద్ధి చెందిన ఆలయాలు, కట్టడాలు.. అద్భుతమైన ప్రకృతి వనరులు జిల్లా సొంతం. కానీ పర్యాటకంగా అభివృద్ధి ఎక్కడా కానరావడంలేదు. ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు, సందర్శకులకు వసతులు కల్పించేందుకు ప్రతిపాదనలైతే వెళ్తున్నాయి తప్ప నిధులు రావడంలేదు. నేడు ప్రపంచ పర్యాటక దినోత్సవం. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పరిస్థితులు పరిశీలిస్తే..

పునర్విభజనలో 50 కి.మీ తీర ప్రాంతం బాపట్ల, నెల్లూరు జిల్లాలకు వెళ్లింది. ప్రస్తుత ప్రకాశంలో కొత్తపట్నం, సింగరాయకొండ మండలం పాకల బీచ్‌లు మిగిలాయి. ఆదివారం వస్తే ఈ రెండుచోట్ల కోలాహలంగా ఉంటుంది. ప్రభుత్వ పరంగా విశ్రాంత గదులు, వ్యక్తిగత మరుగుదొడ్లు వంటి కనీస వసతులు లేవు. సముద్ర స్నానం అనంతరం దుస్తులు మార్చుకోవాలన్నా సమస్యగా మారింది. వారాంతాల్లో ఒంగోలు నగరానికి చెందిన ఉద్యోగులు, వ్యాపారస్తులు కుటుంబాలతో కలిసి కొత్తపట్నం బీచ్‌కు అధిక సంఖ్యలో వస్తుంటారు. కనిగిరి, కొండపి, కందుకూరు నియోజకవర్గ పరిధిలోని మండలాలవారు పాకల తీరానికి వెళ్తుంటారు. పాకలలో గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పనులకు రూ.4 కోట్ల మేర నిధులు మంజూరు చేయగా, తొలివిడత రూ.2 కోట్లతో పనులు చేపట్టారు. బీచ్‌కు వాహనాలతో చేరుకునేందుకు సిమెంట్లు రోడ్లు వేశారు. తీరం సమీపంలో వసతి కోసం భవనం నిర్మించారు. స్లాబ్‌ వేశారు తప్ప గదులు కట్టలేదు. దీంతో అసాంఘిక కార్యకలాపాలకు నెలవుగా మారింది. మిగతా నిధులు ప్రస్తుత ప్రభుత్వం మంజూరు చేయలేదు. దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు ఉండేందుకు ఎటువంటి కాటేజీలు లేక ఆదరాబాదరాగా తిరుగుముఖం పట్టాల్సి వస్తోంది.

బైరవకోన..పదే పదే ప్రతిపాదనలు

సీఎస్‌పురం మండలం బైరవకోనలో త్రిముఖ దుర్గాంబదేవి కొలువై ఉన్నారు. చోళుల కాలంలోనే ఒకే రాయిపై అమ్మవారి విగ్రహం చుట్టూ 8 గుళ్లు నిర్మించారు. పక్కనే జలపాతం ఉంది. శేషాచలం కొండలపై నుంచి వర్షాకాలంలో నిరంతరం నీళ్లు పడుతూనే ఉంటాయి. కార్తీక మాసంలో వేలాదిమంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ఇతర సమయాల్లోనూ సందర్శకుల సంఖ్య అధికమే. పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలన్న డిమాండ్‌ ఉన్నా నెరవేరడం లేదు. పార్కులు, సందర్శకులకు విశ్రాంతి గదులు, అతిథిగృహం, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలకు ప్రతిపాదనలు వెళ్లాయి.    గతంలో కొన్నింటికి నిధులు మంజూరైనా ప్రారంభించకపోవడంతో రద్దు చేశారు. మరికొన్ని నిర్మాణాలు మధ్యలోనే ఆగాయి. తాజాగా కలెక్టరేట్‌ నుంచి మరోసారి ప్రతిపాదనలు పంపారు.

సీఎస్‌పురం మండలం బైరవకోనలోని జలపాతం వద్ద  సందడి

గుండ్లకమ్మ.. పురోగతి లేక

ఒంగోలు నగరానికి 14 కిలోమీటర్ల దూరంలో గుండ్లకమ్మ జలాశయం ఉంది. ఆదివారంతోపాటు, ఇతర సెలవు దినాల్లో కుటుంబాలతో సహా అనేకమంది వెళ్తుంటారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో 2009లో బోటింగ్‌ ఏర్పాటు చేశారు. మరింత అభివృద్ధి చేసేందుకు అక్కడ రోప్‌ వే, రిసార్టుల నిర్మాణం నిమిత్తం పూర్వ కలెక్టర్‌ పోలా భాస్కర్‌ ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఇంతవరకు పురోగతి లేదు. నిధులు మంజూరు చేసి పనులు పూర్తిచేస్తే ఈ ప్రాజెక్ట్‌ పర్యాటక ప్రాంతంగా మరింత అభివృద్ధి చెందుతుంది. ‌్ర పాత సింగరాయకొండ, మాలకొండ లక్ష్మీనరసింహాస్వామి; త్రిపురాంతకం అమ్మవారి దేవస్థానం, దొనకొండ బౌద్ధారామాలు పర్యాటకపరంగా కూడా ఆకట్టుకుంటాయి. వీటి వద్ద అభివృద్ధి పనుల గురించి ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పట్టించుకోవడంలేదు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని