logo

పెళ్లి సందడికి వేళాయె!

మాఘ మాసం రాకతో జిల్లాలో పెళ్లి సందడి ఆరంభమైంది. ఈనెల 26 నుంచి మార్చి 17 వరకు ముహూర్తాలు ఉన్నాయని పండితులు పేర్కొనడంతో ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Published : 25 Jan 2023 03:06 IST

రేపటి నుంచి మార్చి 17 వరకు ముహూర్తాలు
జిల్లాలో రెండు వేల వివాహాలకు ఏర్పాట్లు
ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే:

మాఘ మాసం రాకతో జిల్లాలో పెళ్లి సందడి ఆరంభమైంది. ఈనెల 26 నుంచి మార్చి 17 వరకు ముహూర్తాలు ఉన్నాయని పండితులు పేర్కొనడంతో ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సుమారు 2 వేల వరకు వివాహాలు జరగనున్నట్లు అంచనా. వాటితోపాటు, గృహా ప్రవేశాలు, భూమి పూజ, నిశ్చయ తాంబులాలు వంటి శుభకార్యాలు జరగనున్నాయి. నెలన్నరపాటు ఎటుచూసినా పందిళ్లు...సందళ్లు... కల్యాణ మండపాలు మొదలు వివిధ రంగాలకు డిమాండ్‌ ఏర్పడింది. తద్వారా బడ్జెట్‌ 30 నుంచి 50 శాతం వరకు పెరగనుంది.

అనుబంధ రంగాలకు ఉపాధి

పెళ్లంటే ఎంతో మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి. పురోహితులు, వంటల తయారీదారులు, షామియానా సమకూర్చేవారు, ఫొటోగ్రాఫర్లు, లైటింగ్‌, పూల అలంకరణ చేసేవారు, మంగళ వాయిద్యాలు, దర్జీలు, ఆభరణాల తయారీదారులు, ఐస్‌క్రీం పార్లర్లు, కూరగాయల సరఫరాదారులకు ప్రస్తుత సీజన్‌లో డిమాండ్‌ పెరిగింది. గతంతో పోలిస్తే అన్ని ధరలూ పెరిగిపోయాయి. జిల్లాలో సుమారు 150 కల్యాణ మండపాలు ఉండగా; ఒంగోలులోనే 36 కనిపిస్తాయి. ఎక్కువమంది లీజుదారులు కావడంతో కొవిడ్‌ సమయంలో వచ్చిన నష్టాన్ని పూడ్చుకునే క్రమంలో నిర్వాహకులు ఒక్కటై ఛార్జీలు పెంచారు. శుభకార్యం చేసేవారి ఆర్థిక స్థోమతను బట్టి మండపాన్ని పూల అలంకరణ చేయిస్తారు. తద్వారా ఒక్కో పెళ్లి నిర్వహణకు కల్యాణ మండపానికే రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఖర్చవుతోంది.

ఏయే తేదీల్లో అంటే..

గత ఏడాది డిసెంబర్‌ 2 నుంచి 18వ తేదీ వరకు పరిమిత ముహూర్తాలు ఉండటంతో పెళ్లిళ్లు తక్కువగానే జరిగాయి.... డిసెంబర్‌ 24 నుంచి ఇప్పటివరకు ఎక్కడా కార్యక్రమాలు జరగలేదు. ఈ నెల 26, 27, 28 తేదీలు.. ఫిబ్రవరి 1, 8, 9, 10, 11, 12, 15, 16, 23, 24.. మార్చి 1, 5, 8, 9, 10, 11, 13, 15, 17 తేదీల్లో ముహూర్తాలు ఉండటంతో అంతటా సందడి కనిపిస్తుంది. ఒక్క ఒంగోలు నగరంలోనే సుమారు 1,000 పెళ్లిళ్లు జరగనున్నాయి. కొన్ని తేదీల్లో జిల్లా వ్యాప్తంగా ఎక్కడా కల్యాణ మండపాలు ఖాళీ లేకపోవడంతో బంధువర్గం ప్రత్యామ్నాయ ప్రాంతాలు లేదా స్వగ్రామాల్లోనే ఏర్పాటు చేసుకునేలా ప్రణాళిక చేసుకున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు