logo

అర్ధరాత్రి.. వైకాపా నేతల రచ్చ

ఒంగోలులో మంగళవారం అర్ధరాత్రి వైకాపా ద్వితీయ శ్రేణి నాయకులు మద్యం తాగి హడివిడి చేశారు.

Updated : 26 Jan 2023 07:07 IST

నడిరోడ్డుపై మద్యం తాగుతూ, హారన్లు మోగిస్తూ వీరంగం
పోలీసులకే సవాలు విసురుతూ వాగ్వాదం
ఒంగోలు ట్రంకురోడ్డు, న్యూస్‌టుడే

ఒంగోలులో మంగళవారం అర్ధరాత్రి వైకాపా ద్వితీయ శ్రేణి నాయకులు మద్యం తాగి హడివిడి చేశారు. ప్రశ్నించిన పోలీసులతోనే వాగ్వాదం చేస్తూ పోలీసు సైరన్‌కు ప్రతిస్పందనగా హారన్లు మోగిస్తూ రచ్చ చేసిన వైనం వెలుగులోకి వచ్చింది.. వివరాలిలా ఉన్నాయి.. ఒంగోలు సత్యనారాయణపురం చంద్రయ్యనగర్‌ ప్రాంతానికి ఓ కారులో కొందరు వైకాపా నాయకులు వచ్చారు.. డోర్లు తెరిచి స్పీకర్ల సౌండ్‌ పెంచి మద్యం తాగడం ఆరంభించారు. ఆ ప్రాంతంలో నివసించే కానిస్టేబుల్‌ ఇంటికి వెళ్తుండగా ఆయనను నిలిపి గొడవకు దిగారు. వెంటనే కానిస్టేబుల్‌ డయల్‌-100కు ఫోన్‌ చేశారు. రక్షక్‌ వాహనంలో పోలీసులు రాగా వారిని చూసి వీరు బిగ్గరగా కారు హారన్‌ మోగించారు. ఇటు పోలీస్‌ సైరన్‌, అటు కారు హారన్‌ పోటాపోటీగా మోగించడం, గంట పాటు అదే పంచాయతీ కొనసాగడంతో ఏం జరుగుతుందో అర్థంకాక ఆ ప్రాంతవాసులు హడలెత్తిపోయారు.

గొడవెందుకు.. వచ్చేయండి

పోలీసు సిబ్బంది ఏమీ చేయలేక తమ పైఅధికారికి సమాచారం ఇచ్చారు. ‘వారితో మనకు గొడవెందుకు?.. వెనక్కు వచ్చేయండి’ అంటూ సూచనలు రావడంతో తిరిగి రక్షక్‌ సిబ్బంది వెళ్లిపోయారు. రాజకీయ బలాన్ని చూసుకొని విధి నిర్వహణలో ఉన్న పోలీసులను అవమానించేలా వీరు ప్రవర్తించడం స్థానిక ప్రజానీకంతో పాటు పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ రచ్చ చేసింది ఒంగోలుకు చెందిన సుభానీ, మరికొందరు నాయకులుగా తెలుస్తోంది. వీరు 2021 డిసెంబరులో తమ పార్టీకే చెందిన సుబ్బారావు గుప్తాపై గుంటూరులోని ఓ లాడ్జిలో దాడి చేయడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఒంగోలు ఒకటో పట్టణ పోలీస్‌ స్టేషన్‌ ముందు గతంలో ఓ సీఐపైనా దౌర్జన్యం చేశారు. నెల్లూరు బస్టాండ్‌ ప్రాంతంలోని ఓ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ ముందూ పోలీసులపై దౌర్జన్యం చేయడంతో అధికారులు రాజీ చేశారు.  తరచూ ఒంగోలు నగరంలో ఎక్కడో చోట ఈ తరహా ఘటనలు వెలుగు చూస్తుండటంతో నగరవాసుల్లో ఆందోళన నెలకొంటోంది

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని