logo

ఏదీ! మునుపటి కళ

గ్రానైట్‌ పరిశ్రమ నుంచి అధిక మొత్తంలో ఖజానాకు ఆదాయం తీసుకురావాలన్న ధ్యాస తప్ప వ్యాపారాన్ని పెంచే మార్గాలపై ప్రభుత్వం దృష్టిపెట్టడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Published : 07 Feb 2023 02:54 IST

 నానాటికీ పడిపోతున్న గ్రానైట్‌ ఎగుమతులు ‌

 క్వారీల్లో పేరుకుపోతున్న ముడిరాళ్లు

ఈనాడు డిజిటల్‌, ఒంగోలు: గ్రానైట్‌ పరిశ్రమ నుంచి అధిక మొత్తంలో ఖజానాకు ఆదాయం తీసుకురావాలన్న ధ్యాస తప్ప వ్యాపారాన్ని పెంచే మార్గాలపై ప్రభుత్వం దృష్టిపెట్టడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో క్వారీయింగ్‌ ప్రారంభమైనప్పటి నుంచి ఎప్పటికప్పుడు విదేశాలకు ఎగుమతులు పెరుగుతూ వచ్చాయి. 2020 వరకు ఇక్కడ ఉత్పత్తయ్యే రాయిలో 75 శాతం ఎగుమతి అవుతూ వచ్చింది. కొవిడ్‌, అనంతర పరిస్థితుల నేపథ్యంలో ఎగుమతులు తగ్గుతూ వచ్చాయి. ప్రత్యామ్నాయం చూడాల్సిన ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు చేయకపోగా అదనపు ఆదాయం కోసం పాకులాడటం, అధికారపార్టీ నాయకుల పెత్తనం ఎక్కువ కావడంతో వ్యాపారులు సతమతమవుతున్నారు.

రూ.245 కోట్ల వ్యాపారమే..

కొవిడ్‌కు ముందునాటి స్థాయికి చేరుకోవడానికి గ్రానైట్‌ పరిశ్రమ ఆపసోపాలు పడుతోంది. క్వారీల్లో పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పటికీ చైనాకు ఎగుమతులు నిలిచిపోవడం, ప్రత్యామ్నాయం లేకపోవడం, కంటైనర్ల కొరత, సముద్ర రవాణా ఛార్జీల పెంపు వంటివి ప్రభావం చూపుతున్నాయి. 2022-23లో రూ.450 కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేసినా జనవరి వరకు రూ.245 కోట్లు మాత్రమే వచ్చింది. మార్చి చివరిలోపు మిగిలిన ఆదాయం రావాల్సి ఉన్నా పరిస్థితులు అనుకూలంగా లేవు.

ఉమ్మడి జిల్లాలో 500 లీజులు

చీమకుర్తి ప్రాంతంలో గెలాక్సీ గ్రానైట్‌.. కనిగిరి, గురిజేపల్లి ప్రాంతాల్లోని బ్లాక్‌పెరల్‌, బల్లికురవ వద్ద స్టీల్‌గ్రే గ్రానైట్‌ నిక్షేపాలు ఉన్నాయి. వీటి పరిధిలో 105 క్వారీలు, అందులో 500 వరకు లీజులు ఉన్నాయి. వెలికితీసిన ముడిరాయిలో దాదాపు 75 శాతం విదేశాలకు వెళుతుంది. అందులో సింహభాగం చైనాకే. మిగిలిన 25 శాతం స్థానికంగా ఉన్న కటింగ్‌, పాలీషింగ్‌ యూనిట్లకు వెళ్లేది. గత రెండేళ్లుగా కొవిడ్‌తో స్థానిక పరిశ్రమలు ఒడుదొడుకులు ఎదుర్కొన్నాయి. ఇదే సమయంలో గోరుచుట్టుపై రోకలిపోటులా చైనాకు ఎగుమతులు నిలిచాయి. సముద్ర రవాణా ఛార్జీలు పెరగడం, ఆశించిన మేరకు విదేశీ ఆర్డర్లు రాకపోవడంతో క్వారీలో పెద్దమొత్తంలో రాయి నిలిచిపోయింది.  సాధారణంగా వ్యాపారం బాగుంటే ప్రభుత్వానికి రాయల్టీతోపాటు ఇంధన, విద్యుత్తు, జీఎస్‌టీ, ఆదాయపన్ను తదితర రూపాల్లో సొమ్ము సమకూరుతుంది. ప్రస్తుతం విదేశాల నుంచి ఆశించిన మేర ఆర్డర్లు రాకపోయినా దేశీయంగా, యూనిట్లు, పరిశ్రమలు వచ్చి రాయి తీసుకెళుతుండటంతో కొంతమేరకు వ్యాపారం జరుగుతోంది.

కలవరపెడుతున్న చైనా పరిస్థితులు

2020 తర్వాత కొవిడ్‌ పరిస్థితులతో చైనాలో గ్రానైట్‌ వ్యాపారం దెబ్బతింది. దీంతో జిల్లాలో ఆర్డర్లు ఇచ్చిన విదేశీ కొనుగోలుదారులు  యికి మార్కింగ్‌ చేస్తున్నప్పటికీ చెల్లింపులు చేయడంలేదు. పైగా చైనా నుంచి కంటైనర్లు మునుపటిలా రావడం లేదు. కనీసం జపాన్‌, బ్రెజిల్‌, ఆస్ట్రేలియా, మలేషియా, అమెరికా వంటి దేశాలకు నేరుగా వ్యాపారం చేసేందుకు ప్రభుత్వం నుంచి ప్రయత్నాలు చేయకపోవడంతో జిల్లాలోని క్వారీల్లో ముడిరాయి పేరుకుపోయిందని యజమానులు వాపోతున్నారు. ఇలా దాదాపు 20 వేల క్యూబిక్‌ మీటర్ల వరకు నిల్వ ఉన్నట్లు అంచనా. జిల్లా గనులశాఖకు చెందిన ఓ అధికారి మాట్లాడుతూ గ్రానైట్‌ వ్యాపారం సగానికి సగం తగ్గినమాట వాస్తవమేనన్నారు. మార్చిలో విదేశీ ఎగుమతులు పెరుగుతాయని అంచనా వేస్తున్నట్లు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని