logo

వెంచర్‌ కోసం అధికారిక విధ్వంసం

ఒంగోలు నగరం వెంగముక్కపాలెంలో అధికార పార్టీకి చెందిన కీలక నాయకుడు వేసిన రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌కు లక్షలాది క్యూబిక్‌ మీటర్ల గ్రావెల్‌ను అక్రమంగా తరలించారని తెదేపా నాయకులు ధ్వజమెత్తారు.

Published : 28 Mar 2023 02:09 IST

బాధ్యులపై చర్యలు కోరుతూ ఆందోళన

కలెక్టరేట్‌ వద్ద నిరసన తెలుపుతున్న తెదేపా నాయకులు

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: ఒంగోలు నగరం వెంగముక్కపాలెంలో అధికార పార్టీకి చెందిన కీలక నాయకుడు వేసిన రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌కు లక్షలాది క్యూబిక్‌ మీటర్ల గ్రావెల్‌ను అక్రమంగా తరలించారని తెదేపా నాయకులు ధ్వజమెత్తారు. ఇందుకోసం ఒంగోలు మండలం యరజర్ల, సర్వేరెడ్డిపాలెం; టంగుటూరు మండలం కందులూరు, మర్లపాడు, కొణిజేడు గ్రామాల మధ్య ఉన్న కొండను పిండి చేశారని విమర్శించారు. వెంటనే వెంచర్‌ నిర్వాహకులతో పాటు, వారికి సహకరించిన గనుల, రెవెన్యూ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ... కలెక్టరేట్‌ వద్ద సోమవారం ఆందోళన చేపట్టారు. కోట్లాది రూపాయల విలువ చేసే గ్రావెల్‌ తోలుకుని... కేవలం రూ.12 లక్షలు మాత్రమే ప్రభుత్వానికి చెల్లించారని ఆరోపించారు.

అడ్డగోలుగా బోర్లు, పైపులైన్లు...

యరజర్ల చెరువు దగ్గరలో భూములు కొనుగోలు చేసి, ఎలాంటి అనుమతులు లేకుండా అక్కడ బోర్లు వేశారని... అక్కడి నుంచి పైపులైన్ల ద్వారా వెంచర్‌లో నిర్మాణాలకు నీటిని తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ, ప్రైవేటు భూముల్లోకి చొరబడి పైపులైన్లు వేశారన్నారు. దీనివల్ల యరజర్ల, పరిసర ప్రాంతాల్లో తాగు, సాగు నీటి సమస్య తలెత్తే ప్రమాదం ఉందన్నారు. వెంటనే ఆ బోర్లను ఆపించాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయమై ‘ఈనాడు’లో వచ్చిన కథనాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. అక్రమాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ... స్పందనలో డీఆర్వో శ్రీలతకు వినతిపత్రం అందజేశారు. తెదేపా నగర అధ్యక్షుడు కొఠారి నాగేశ్వరరావు, ఏఎంసీ మాజీ ఛైర్మన్‌ కామేపల్లి శ్రీనివాసరావు, నాయకులు నలమోతు గంగాధర్‌, చుండి శ్యామ్‌, బండారు మదన్‌, పోలవరపు వెంకటరామయ్య, గుండపనేని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని