logo

Adimulapu Suresh: సురేషూ.. ఈ కన్నీళ్లకు బాధ్యులెవరు!

మార్కాపురం పట్టణం రాజీవ్‌ నగర్‌ కాలనీకి చెందిన బుడిగ మహేష్‌(26), మహేశ్వరి(24) దంపతులు. ద్విచక్ర వాహనంపై గ్రామాల్లో తిరుగుతూ సీజనల్‌ వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు.

Updated : 07 Mar 2024 07:55 IST

మృత్యుపాశాలుగా మంత్రి కాన్వాయ్‌లోని కార్లు
వేర్వేరు ప్రమాదాల్లో ఇప్పటికి ముగ్గురి మృతి

మార్కాపురం నేర విభాగం, త్రిపురాంతకం- న్యూస్‌టుడే: మార్కాపురం పట్టణం రాజీవ్‌ నగర్‌ కాలనీకి చెందిన బుడిగ మహేష్‌(26), మహేశ్వరి(24) దంపతులు. ద్విచక్ర వాహనంపై గ్రామాల్లో తిరుగుతూ సీజనల్‌ వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. మార్కాపురంలో ఉన్న మంత్రి ఆదిమూలపు సురేష్‌ కోసం కాన్వాయ్‌లోని ఓ వాహనం యర్రగొండపాలెం నుంచి వస్తూ.. పెద్దరావీడు మండలం గొబ్బూరు సమీపంలో జాతీయ రహదారిపై మహేష్‌ దంపతుల ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటన 2021 డిసెంబరు 9న చోటుచేసుకుంది. తీవ్రంగా గాయపడ్డ దంపతులను మార్కాపురం ప్రభుత్వ జిల్లా వైద్యశాలకు తరలిస్తుండగా మార్గంమధ్యలోనే మహేష్‌ మృతి చెందారు. భార్య మహేశ్వరిని కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా.. మృత్యువుతో పోరాడుతూ రెండు రోజుల తర్వాత ప్రాణాలు విడిచింది. ఆమె వైద్యానికి దాదాపు రూ.3 లక్షల వరకు బాధిత కుటుంబం అప్పు చేయాల్సి వచ్చింది.

రూ.50 వేలిచ్చి.. చేతులు దులుపుకొని...: ప్రమాదం చోటుచేసుకున్న రోజు మంత్రి తాలూకు మధ్యవర్తులు వచ్చి బాధిత కుటుంబానికి రూ.50 వేలిచ్చారు. ముందు అంత్యక్రియలు పూర్తిచేయాలని సూచించారు. కర్నూలు ఆసుపత్రిలో చికిత్స మహిళ వైద్యానికయ్యే ఖర్చులను తామే చూసుకుంటామని హామీ ఇచ్చారు. రెండు రోజుల తర్వాత ఆమె కూడా ప్రాణాలు కోల్పోయింది. అనంతరం మంత్రి వైపు మనుషులెవరూ బాధిత కుటుంబం వైపు ఇంతవరకు కన్నెత్తి చూడలేదు.

పోషణ భారమై కర్నూలుకు వలస...: మహేష్‌, మహేశ్వరి దంపతులకు జాన్‌(9), రీతూమేరీ(7) సంతానం. తల్లిదండ్రుల మృతితో వీరిద్దరూ అనాథలయ్యారు. చిన్నారుల పోషణ భారం వృద్ధులైన దుర్గప్ప, కాసమ్మలపై పడింది. అప్పటికే దుర్గప్పకు అనారోగ్య సమస్యలు వెంటాడుతుండటంతో ఏ పనీ చేయలేని దయనీయ పరిస్థితి. ఇక దుర్గప్ప బిందెలు, ప్లాస్టిక్‌ వస్తువులను వీధుల్లో విక్రయిస్తూ వచ్చిన కొద్దిపాటి మొత్తంతో పిల్లలతో పాటు భర్త పోషణ చూస్తూ కొద్ది రోజులు నెట్టుకొచ్చింది. కుటుంబం గడవక చివరికి కర్నూలుకు వలస వెళ్లారు.

తాజాగా మరో యువకుడు...: మంత్రి సురేష్‌ ఎస్కార్ట్‌ వాహనం ఢీకొని ఇటుక బట్టీలో కూలిగా పనిచేసే ఇశ్రాయేల్‌(21) అనే యువకుడు ఇప్పుడు ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యమంత్రి వెలిగొండ పర్యటనలో పాల్గొనేందుకు విజయవాడ నుంచి వస్తున్న మంత్రి ఎస్కార్ట్‌ వాహనం త్రిపురాంతకం సమీపంలోని కేశినేనిపల్లి వద్ద ఎదురుగా వస్తున్న ఆటోను వేగంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తో మంత్రి ఎస్కార్ట్‌ డ్రైవర్లు ఇప్పటికే ముగ్గురు అమాయకుల ప్రాణాలను గాలిలో కలిపేశారు. వారి కుటుంబాలను రోడ్డున పడేశారు. వారిని ఆదుకోవాలనే విషయాన్ని మంత్రి మరిచారు. ఈ నిర్లక్ష్యంపై బాధిత కుటుంబాలు మండిపడుతున్నాయి. మృతి చెందిన యువకుడి కుటుంబానికి న్యాయం చేయాలని అనంతపురం- అమరావతి జాతీయ రహదారిపై బుధవారం రాత్రి పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. ఇప్పటికైనా ఇచ్చిన హామీ నెరవేర్చుకుని కన్నీళ్లు తుడుస్తారో.. విస్మరించి మానవత్వం లేదనే విషయాన్ని చాటుకుంటారో వేచి చూడాల్సి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని