logo

నిధుల్లేక సాకులు.. వేతనజీవులతో ఆటలు

ఉద్యోగులకు వేతనమే దిక్కు. ప్రతి నెలా చేతికందే మొత్తంతోనే కుటుంబ అవసరాలు తీర్చుకుంటుంటారు. ఇంటి నిర్మాణం, వాహనం, పిల్లల చదువుల కోసం బ్యాంకుల్లో తీసుకున్న రుణాలకు ప్రతి నెలా అయిదో తేదీలోపు ఈఎంఐ జమ చేయాల్సి ఉంటుంది.

Published : 17 Apr 2024 03:41 IST

రెండు నెలలుగా 1,200 మందికి అందని జీతాలు
ఇబ్బందుల్లో వైద్యశాఖ ఉద్యోగులు

ఒంగోలు నగరంలోని మాతా శిశు వైద్యశాల

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: ఉద్యోగులకు వేతనమే దిక్కు. ప్రతి నెలా చేతికందే మొత్తంతోనే కుటుంబ అవసరాలు తీర్చుకుంటుంటారు. ఇంటి నిర్మాణం, వాహనం, పిల్లల చదువుల కోసం బ్యాంకుల్లో తీసుకున్న రుణాలకు ప్రతి నెలా అయిదో తేదీలోపు ఈఎంఐ జమ చేయాల్సి ఉంటుంది. ఆలస్యమైతే వడ్డీ పేరుతో మరింత భారం తప్పదు. వేతనం ఒక్క నెల ఆగిపోతే సదరు ఉద్యోగుల పరిస్థితి గందరగోళంగా మారుతుంది. కుటుంబ అవసరాలకు అప్పులు చేయక తప్పని పరిస్థితి తలెత్తుతుంది. వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని వైద్య విధాన పరిషత్‌ ఉద్యోగులు ప్రస్తుతం ఇలాంటి ఇబ్బందే ఎదుర్కొంటున్నారు. వారికి గత రెండు నెలలుగా, డీఎంహెచ్‌వో పరిధిలో పనిచేస్తున్న నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ ఉద్యోగులకు ఒక నెల వేతనాలు నిలిచిపోయాయి. దీంతో దాదాపు 1,200 మంది ఉద్యోగులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు.

ఆర్థిక పరిస్థితి అదుపు తప్పి...: వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అదుపు తప్పింది. గతంలో ఒకటో తేదీన ఉద్యోగులకు వేతనాలు అందేవి. ప్రస్తుతం ఎప్పుడిస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. నెలలు తరబడి నిలిచిపోవడం సాధారణ ఉద్యోగులకు తీవ్ర ఇబ్బందులు తెచ్చి పెడుతోంది. వైద్యవిధాన పరిషత్‌ కింద ఉమ్మడి ప్రకాశంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆసుపత్రులు, ఒంగోలు మాతా శిశువైద్యశాల, మార్కాపురం జిల్లా స్థాయి ఆసుపత్రులు పనిచేస్తున్నారు. వీటిలో పనిచేస్తున్న అటెండర్‌ నుంచి సూపరింటెండెంట్‌ వరకు ఫిబ్రవరి, మార్చి వేతనాలు నేటికీ అందలేదు.

ఏప్రిల్‌కూ అందే పరిస్థితి లేదు...

తమకు ఏప్రిల్‌లో కూడా జీతాలు వస్తాయనే నమ్మకం లేదని ఆయా శాఖల ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 25వ తేదీలోపు ఏప్రిల్‌ నెల బిల్లులు పంపించాలి. అందుకు మరో వారం రోజులే సమయం ఉంది. ఫిబ్రవరి, మార్చి నెలలు వేతనాలు ఇవ్వకుండా ఏప్రిల్‌ నెల వేతనాలు ఇచ్చే అవకాశం ఉండదని చెబుతున్నారు. ఇదిలా ఉంటే డీఎంహెచ్‌వో పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో పనిచేస్తున్న నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ ఉద్యోగులు 1,024 మందికి, ఆప్కాస్‌ పరిధిలో 18 మందికి కూడా మార్చి నెల వేతనాలు నిలిచిపోయాయి. అసలు ఫిబ్రవరి నెల వేతనం ఎందుకు నిలిచిపోయిందో ఇప్పటికీ స్పష్టత లేదని ఒక సీనియర్‌ ల్యాబ్‌ టెక్నీషియన్‌ ఆవేదన వ్యక్తం చేయగా.. సాంకేతిక కారణాల వల్ల సమస్య తలెత్తిందని, త్వరలో చెల్లిస్తామని అధికారులు చెబుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద వేతనాల చెల్లింపునకు నిధులు లేకనే సాకులు చెబుతూ కాలం వెల్లదీస్తున్నారనే అభిప్రాయం వేతన జీవుల్లో వ్యక్తమవుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు