logo

ప్రమాదవశాత్తూ మంటలంటుకొని రైతు సజీవ దహనం

ఎండిపోయిన పంటకు నిప్పంటించగా ప్రమాదవశాత్తూ మంటలు అంటుకొని రైతు సజీవ దహనమైన సంఘటన తాళ్లూరులో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది.

Published : 18 Apr 2024 03:04 IST

సుబ్బారెడ్డి (పాతచిత్రం)

తాళ్లూరు, న్యూస్‌టుడే: ఎండిపోయిన పంటకు నిప్పంటించగా ప్రమాదవశాత్తూ మంటలు అంటుకొని రైతు సజీవ దహనమైన సంఘటన తాళ్లూరులో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. గ్రామస్థుల వివరాల ప్రకారం.. స్థానిక వెంకటరెడ్డిపాలేనికి చెందిన కోట సుబ్బారెడ్డి (67), తన పొలంలోని మొక్కజొన్న చేనులో ఉన్న చెత్తను తగులబెట్టేందుకు నిప్పుపెట్టారు. ఆ పంట కాలిపోయిన తర్వాత పక్కనున్న సుబాబుల్‌ తోటకు మంటలు అంటుకున్నాయి. వాటిని ఆర్పేందుకు ప్రయత్నం చేస్తుండగా మంటలు అంటుకొని మృతి చెందారు. అతడు ఎంతసేపటికీ ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు పొలం వద్దకు వెళ్లి చూశారు. అతడు తీసుకెళ్లిన ద్విచక్ర వాహనం పొలం పక్కనే ఉంది. ఆచూకీ కోసం వెతకగా సుబాబుల్‌ తోటలో కాలిపోయి మృతి చెంది ఉన్నాడు. విగతజీవిగా పడిఉన్న అతడిని చూసి కుటుంబ సభ్యులు భోరున విలపించారు. ఈ సంఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.


ట్రాక్టర్‌ బోల్తాపడి విద్యార్థి మృతి

మరో ఇద్దరికి తీవ్ర గాయాలు

కంభం (రాచర్ల), న్యూస్‌టుడే : ట్రాక్టర్‌ బోల్తా పడి విద్యార్థి మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన రాచర్ల మండలం చిన్నగానిపల్లి సమీపంలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. అర్థవీడుకు చెందిన పోలిశెట్టి ఆంజనేయులు తన అత్తవారి ఊరైన చినగానిపల్లికి భార్య అల్లూరమ్మ, పిల్లలతో వచ్చి అక్కడే నివాసముంటున్నారు. బుధవారం స్థానికుడు షేక్‌ ఖాసిం సాహెబ్‌ ట్రాక్టర్‌కు నీటి ట్యాంకర్‌ తగిలించుకొని పొలంలోని బోరు వద్ద నీటిని పట్టుకునేందుకు వెళ్తుండగా, ఆంజనేయులు కుమారుడు పోలిశెట్టి రంగ చరణ్‌ (13), మరో బాలుడు పెనమలూరి శ్రీహరి ట్రాక్టర్‌ ఎక్కారు. పొలంలో ట్యాంకర్‌కు నీటిని పట్టుకుని బయలుదేరారు. బాలురిద్దరూ ట్రాక్టర్‌ ఇంజిన్‌, ట్యాంకర్‌కు నడుమ ఉండే ఇనుప రాడ్‌పై నిలుచుని వస్తుండగా  వాహనం అదుపుతప్పి పడిపోయింది. దీంతో రంగ చరణ్‌ అక్కడికక్కడే మృతి చెందగా, మరో బాలుడు శ్రీహరి, చోదకుడు ఖాసింసాహెబ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వారిని 108 వాహనంలో గిద్దలూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. మృతుడి సోదరి ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందింది. సంఘటన తెలిసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై హరిబాబు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని