logo

అభివృద్ధి మరిచి.. పర్యాటకానికి పాతర

Published : 18 Apr 2024 03:08 IST

అయిదేళ్లూ పట్టించుకోని వైకాపా ప్రభుత్వం 
నిర్లక్ష్యం నీడలో ప్రజాప్రతినిధులు
మార్కాపురం, గిద్దలూరు, పెద్దదోర్నాల, కంభం, త్రిపురాంతకం

కంభం చెరువు కట్ట

పర్యాటక రంగాన్ని వైకాపా ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. అయిదేళ్లుగా ఈ రంగానికి నిధులు కేటాయించకుండా నిర్వీర్యం చేసింది. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధిచేసి పర్యాటకులను ఆకర్షించి ఆమేరకు ఆదాయాన్ని ఆర్జీంచే అవకాశాలను గాలికొదిలేసింది. గత ప్రభుత్వం హాయంలో ప్రతిపాదించిన కొన్ని ప్రాంతాల అభివృద్ధిని గాలికొదిలేసింది.నియోజకవర్గంలోని పలు పర్యాటక ప్రాంతాలు కనీస వసతులు, రవాణాసదుపాయలు లేకపోవడంతో వెలవెలబోతున్నాయి.  త్రిపురాంతకం బాలత్రిపురసందురీదేవి, మార్కాపురం చెన్నకేశవస్వామి వంటి ప్రసిద్ధ ఆలయాలు, కంభం చెరువు లాంటి జలాశయాలున్నాయి. వీటిని పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దే అవకాశం ఉన్నా పాలకులు పట్టించుకోలేదన్న విమర్శలున్నాయి.

జె.పి.చెరువు అటవీప్రాంతంలోని నెమలిగుండ్ల రంగనాయకస్వామి దేవస్థానం


ప్రత్యేక దృష్టి అవసరం 

త్రిపురాంతకంను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడంలో వైకాపా ప్రభుత్వం విఫలమైంది. ఈ అయిదేళ్లలో దీనిపై దృష్టి పెట్టలేదు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే భక్తులకు సౌకర్యంగా ఉంటుంది. జిల్లాలో పశ్చిమ ప్రాంతానికి ఓ ప్రత్యేక గుర్తింపు వస్తుంది.

అలవాట చంద్రశేఖర్‌ రెడ్డి, గణపవరం, త్రిపురాంతకం మండలం.


పనుల అతీగతి లేదు

నెమలిగుండ్ల రంగనాయకస్వామి దేవస్థానాన్ని  పర్యాటక ప్రాంతంగా  తీర్చిదిద్దుతామని వైకాపా నాయకులు గొప్పలు చెప్పుకున్నారు. ఆ పనుల అతీగతి లేదు. జలపాతం వద్ద బోటు సౌకర్యం ఏర్పాటు చేసి స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని  ఆశలు రేకెత్తించారు. అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఏడాది క్రితం గుత్తేదారు పనులు దక్కించుకున్నప్పటికీ  ప్రారంభించని పరిస్థితి నెలకొంది. దీంతో యువత ఉపాధి అవకాశాలు కోల్పోయింది.

పుట్టా వినాయక్‌, జె.పి.చెరువు


ప్రగతి ఏదీ

కంభం చెరువును పర్యాటకంగా అభివృద్ధి చేస్తే ఎంతో మందికి ఉపాధి దొరుకుతుంది.  బోటు షికారు, చెరువు మధ్యలో ఉండే చిన్నపాటి కొండలపై రిసార్టులు ఏర్పాటు చేస్తే బాగుంటుంది. పాలకులు, అధికారులు హామీలు ఇచ్చినా, ప్రగతి మాత్రం కనిపించడం లేదు.

సుబ్బారావు, కంభం


ఆ ఊసే లేదు

శ్రీశైలానికి ముఖద్వారమైన పెద్దదోర్నాల పర్యాటకానికి అనువుగా ఉన్నా వైకాపా ప్రభుత్వం పట్టించుకోలేదు. విభిన్న జాతులకు ఆవాసమైన నల్లమల విశిష్టతను తెలియజేస్తూ పెద్దదోర్నాలలో పార్కులు ఏర్పాటు చేయాల్సి ఉండగా చేయలేదు. శ్రీశైలం రహదారిలో అడ్వెంచర్‌ పార్కు ఏర్పాటు పనులు  రెండేళ్లుగా కొలిక్కిరాలేదు. నిధులు కేటాయించకపోవడమే కారణం.

చెంచయ్య, పెద్దదోర్నాల


కనీస సౌకర్యాలేవీ..

కంభం చెరువును పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని నాయకులు, అధికారులు అయిదేళ్లుగా పట్టించుకోనే లేదు. చారిత్రకమైన తటాకాన్ని బాగు చేయాల్సిన అవసరం ఉంది. నిత్యం చెరువు అందాలను చూసేందుకు వచ్చే  వారికి కనీస వసతులు లేవు.  బోటు షికారు, రిసార్టులు ఏర్పాటు చేస్తే బాగుండేది.

యశ్వంత్‌, సాధుమియా వీధి, కంభం


ఉపాధి అవకాశాలు కోల్పోతున్నాం

దిగువమెట్ట గ్రామంలోని అటవీప్రాంతంలో గత తెదేపా ప్రభుత్వం వనవిహారిని ఏర్పాటు చేసి గిరిజనలకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు చేపట్టింది.  వైకాపా ప్రభుత్వం దీనికి నిధులు కేటాయించకపోవడంతో అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయి. దీంతో స్థానిక యువతకు ఉపాధి  కోల్పోయారు.

దేశావత్‌ శ్రీనునాయక్‌, దిగువమెట్ట తండా


ఇబ్బంది పడుతున్నారు

మార్కాపురం పట్టణంలోని ప్రముఖ లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అయితే పర్యాటకంగా వసతుల కల్పనలో వెనుకబడి ఉంది. ఆలయంలో మౌలిక వసతులు ఏర్పాటుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. భక్తులకు తాగునీరు, వెయిటింగ్‌ హాలు, టాయిలెట్స్‌, టాన్మినేటర్స్‌ వంటివి నూతనంగా ఏర్పాటు చేస్తే భక్తులకు సౌకర్యంగా ఉంటుంది. 

ఆర్‌కెజె.నరసింహం, మార్కాపురం పట్టణవాసి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు