logo

పర్యాటకాన్ని చిదిమేసిన పాలకుడు

Published : 18 Apr 2024 03:18 IST

రూపురేఖలు కోల్పోయిన సందర్శనీయ స్థలాలు
తెదేపా హయాంలో రూ.కోట్లతో అభివృద్ధి పనులు
జగన్‌ నిర్వాకంతో జిల్లా వాసులకు కరవైన ఆహ్లాదం
చంద్రబాబు రూ.95 కోట్లు కేటాయించినా..
ఈనాడు, ఒంగోలు న్యూస్‌టుడే, మద్దిపాడు, సంతనూతలపాడు

గుండ్లకమ్మ జలాశయం

ప్రకృతి రమణీయతతో విలసిల్లే ప్రాంతాలపై నిర్లక్ష్యం నీడలు కమ్ముకుంటున్నాయి. తెదేపా హయాంలో ప్రకృతి ప్రేమికులతో కళకళలాడినవి నేడు ఓ శిథిల చిత్రాలను తలపిస్తున్నాయి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుండ్లకమ్మ జలాశయం సమీపంలో కాటేజీల ఏర్పాటుకు నాబార్డు నుంచి రూ.65 కోట్లు, ప్రభుత్వం నుంచి రూ.30 కోట్లు కేటాయించేలా చొరవ చూపారు. నాబార్డు నుంచి నిధులు సైతం మంజూరవ్వగా రూ.3 కోట్లతో పనులు చురుగ్గా సాగాయి. సుందరంగా నిర్మాణం సాగింది. తదనంతరం వైకాపా ప్రభుత్వం కొలువుదీరాక దీన్ని పూర్తిగా విస్మరించింది.

ఈతకొలను ఇలా...

ఈత కొలను పాడైపోయి..: జలాశయం ప్రాంతంలో అత్యాధునిక వసతులతో ఏడు రూములు, ఓ విశాలమైన హాలును నిర్మించారు. ఈత కొలను సైతం ఏర్పాటు చేసినా నేటి పాలకుల నిర్లక్ష్యంతో వృథాగా మిగిలింది. కాటేజీల్లో సీలింగ్‌ దెబ్బతింది. తలుపులు, అద్దాలు పగిలిపోయాయి. ఫ్లోరింగ్‌ పాడైంది. అక్కడ విలువైన వస్తువులు చోరీకి గురవుతున్నాయి. పర్యవేక్షణ లేక అసాంఘిక శక్తులకు అడ్డాగా మారింది.

జలాశయం వద్ద నిరుపయోగంగా కాటేజీలు

బోటింగ్‌కు మంగళం : సెలవు రోజు వచ్చిందంటే చాలు ఈ ప్రాంతం కోలాహలంగా ఉండేది. నిర్వహణ సక్రమంగా ఉండటంతో పుష్కలంగా నీరుండి బోటింగ్‌ సాగేది. వైకాపా ప్రభుత్వం కొలువుదీరాక దీన్ని నిలిపివేసింది. జలాశయ గేట్లు కొట్టుకుపోయి ఒట్టిపోవడంతో బోట్లను ఒడ్డుకు చేర్చడంతో అవి శిథిలమైపోతున్నాయి.


నాడు ఎకో కళా కాంతులు

ప్రారంభంకాని వన విహారి పార్కు

గిద్దలూరు పట్టణం: గిద్దలూరు మండలం దిగువమెట్టలో తెదేపా పాలనలో ఎకో టూరిజం అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. 2018లో అప్పటి మంత్రి శిద్దా రాఘవరావు సుమారు రూ.కోటికి పైగా నిధులు మంజూరు చేశారు. దీంతో దిగువమెట్ట వద్ద నిర్మాణాలు చేపట్టడం.. స్థానికులు 40 మందికి ఉపాధి అవకాశాలు కల్పించడం.. అభయారణ్యంపై అవగాహన కల్పించడం లక్ష్యంగా వడివడిగా అడుగులేశారు. అక్కడ  3.75 హెక్టార్లలో ఎకో టూరిజం పార్కు, కాటేజీలు, పిల్లల కోసం పార్కు, మ్యూజియం ఏర్పాటు చేసేందుకు నిధులు కేటాయించారు. అయితే జగన్‌ ప్రభుత్వం కొలువుదీరాక దీన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. కాటేజీల నిర్మాణం, పిల్లల కోసం పార్కు, డైనింగ్‌ హాలు, వంట గదుల నిర్మాణాలు చేపట్టారు. టైగర్‌ సఫారీ కోసం అటవీ ప్రాంతంలో వ్యూ పాయింట్లను గుర్తించి అక్కడకి వెళ్లేందుకు వాహనాలు సమకూర్చాల్సి ఉంది.  వనవిహారి ప్రారంభించకపోవడంతో స్థానికులకు ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయి.


తెలంగాణ లక్కవరం చెరువులా మారేదెన్నడో

అందాల కంభం చెరువు

కంభం: విశ్వవ్యాప్త ఖ్యాతి ఉన్న కంభం చెరువునూ పాలకులు విస్మరించారు. దీన్ని కేరళ,  తమిళనాడుల్లో రిజర్వాయర్‌ బేస్‌ టూరిజంలా అభివృద్ధి చేసే అవకాశమున్నా వారిలో కదలిక కరవైంది. చెరువులో చిన్నపాటి కొండలు.. చుట్టూ పచ్చని పొలాలతో అలరారే ఈ చెరువును అభివృద్ధి చేస్తే భారీగా ఆదాయం సమకూరే అవకాశముంది. దీని నీటి నిల్వ సామర్థ్యం 3 టీఎంసీలు. తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లాలోని లక్కవరం చెరువును ప్రసిద్ధ పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దారు. ఆసియాలోనే రెండో అతి పెద్దదైన కంభం చెరువును ఆ మాదిరిగా తీర్చిదిద్దాల్సి ఉన్నా నేతలు, పాలకులు        పట్టించుకోవడం లేదు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కనీస మరమ్మతులకు నిధులివ్వడం లేదు. కట్టపై అతిథి గృహం ఉన్నా, దానికి తలుపులు, కిటికీలు ధ్వంసమై అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతోంది. అక్కడ వసతుల కల్పనకు గతంలో రూ. 60 లక్షలతో ప్రతిపాదనలు పంపించినట్లు నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు.


వేల ఏళ్లనాటి చరిత్రకు బూజు

కనపర్తి తీరం

నాగులుప్పలపాడు : వేల సంవత్సరాల నాటి శిలా సంపదకు బూజు పడుతోంది. కనపర్తి పురావస్తు మ్యూజియంలో ఎన్నో విలువైన చారిత్రక వస్తువులను భద్రపరిచారు. ఇక్కడ జౌనులు, బౌద్ధులు, శైవ మతస్థుల జీవనానికి సంబంధించిన ఆనవాళ్లున్నాయి. మ్యూజియంలో సప్తమాత్రికలు, వారాహి, కౌమరిణి, ధారాలింగం, దిగంబేశ్వరుడు, వివిధ ఆకృతుల్లో శివలింగాలు, నందులున్నాయి. బ్రాహ్మీ, పాళీ, ప్రాకృత, ప్రాచీన తమిళ, చోళ శాసనాలు ఉన్నాయి. నాటి మట్టిపాత్రలు, వివిధ రాతి విగ్రహాలున్నాయి. క్రీస్తు పూర్వం రెండో శతాబ్దం నుంచి శాతవాహనులు, చోళులు, తూర్పు చాళుక్యులు, కాకతీయులు, విజయనగర రాజులు ఈ ప్రాంతాన్ని పరిపాలించినట్లు ఇక్కడి శాసనాల ద్వారా తెలుస్తుంది. 11వ దశాబ్దం నాటి చౌళరాజుల కాలంలోని ఏలేశ్వర, చౌళమాంళ, సీతారామ స్వామి దేవస్థానాలు కనపర్తిలో ఉన్నాయి. ఇంత కీలకమైన మ్యూజియాన్ని జగన్‌ ప్రభుత్వం విస్మరించింది. ఇక్కడి ఆహ్లాదభరిత సముద్ర తీరం వద్ద పర్యాటక అభివృద్ధి పనులు చేపట్టకపోవడంపై ప్రకృతి ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కనపర్తి మ్యూజియంలో విభిన్న ప్రాచీన శివలింగాలు


రామా.. పర్యటక స్థలి ఎక్కడ..

రామతీర్థానికి వెళ్లేదారి ఇలా..

చీమకుర్తి,న్యూస్‌టుడే: జిల్లా వరప్రసాదినిగా ఉన్న రామతీర్థం జలాశయాన్ని పర్యటక ప్రదేశంగా తీర్చిదిద్దే అవకాశం ఉన్నా వైకాపా ప్రభుత్వం దాన్ని అçకెక్కించింది.  రామతీర్థ జలాశయం సహజ సిద్ధంగా ఉన్న ఎర్ర, నల్ల కొండల మధ్య సుమారుగా 1100 ఎకరాల విస్తీర్ణంలో పర్యాటకాన్ని అభివృద్ధి చేయవచ్చు. రిజర్వాయర్‌లో ఏడాది పొడవునా నీరు ఉంటున్న పరిస్థితుల్లో బోటింగ్‌కు అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఉద్యానవనాలు ఏర్పాటు చేసేందుకు రెండు కట్టలకు సమీపంలోనే ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి. గతంలో కట్టలపై పనులు చేపట్టినా ప్రస్తుతం విద్యుత్తు వసతి లేకపోవడంతో గతంలో ఏర్పాటు చేసిన దీపాల ఆనవాళ్లే కనుమరుగవుతున్నాయి. గతంలో ఎంతో సుందరంగా ఉన్న పైలాన్‌ ప్రాంతం ప్రస్తుతం పిచ్చిమొక్కలకు నిలయంగా మారింది. సాగర్‌ కాలువపై సుమారుగా 40 సంవత్సరాల కిందట నిర్మాణం చేసిన రాతివంతెన తప్ప పూర్తిస్థాయిలో వంతెన నిర్మాణం చేపట్టలేదు. గత ప్రభుత్వంలో నిధులు మంజూరు చేసినా జగన్‌ ప్రభుత్వం పనులు ప్రారంభించిన దాఖాలాలు లేవు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని