logo

కీలక ఘట్టం ఆరంభం

సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కీలకఘట్టం ప్రారంభం కానుంది. గురువారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల్లోపు ఆర్వోలు నామినేషన్లు స్వీకరించనున్నారు.

Published : 18 Apr 2024 03:28 IST

నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ
ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే

సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కీలకఘట్టం ప్రారంభం కానుంది. గురువారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల్లోపు ఆర్వోలు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఒంగోలు పార్లమెంట్‌ నియోజకవర్గానికి సంబంధించి కలెక్టరేట్‌లోని ఛాంబర్‌లో కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌., అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఒంగోలు, కనిగిరి ఆర్డీవో కార్యాలయాలు; మార్కాపురం ఉప కలెక్టర్‌ కార్యాలయం, సంతనూతలపాడుకు చీమకుర్తిలోని తహసీల్దార్‌ కార్యాలయం, యర్రగొండపాలెంలో స్త్రీశక్తి భవన్‌, దర్శి, గిద్దలూరు, కొండపి నియోజకవర్గాలకు సంబంధించి ఆయా మండల కేంద్రాల్లోని తహసీల్దార్‌ కార్యాలయాల్లో స్వీకరిస్తారు. జిల్లా వ్యాప్తంగా 2,183 పోలింగ్‌ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహించనుండగా, అందుకు అవసరమైన పీవో, ఏపీవో, ఓపీవోలకు ఇప్పటికే శిక్షణ ఇచ్చారు.

32 వేల పోస్టల్‌ బ్యాలెట్లు...: ఎన్నికల విధులకు సంబంధించిన పోలింగ్‌ సిబ్బందిని ఇప్పటికే గుర్తించి వారికి శిక్షణ పూర్తి చేశారు. వీరందరికీ ఓటు హక్కు నిమిత్తం పోస్టల్‌ బ్యాలెట్‌ అవకాశం కల్పించారు. 14,500 మంది పోలింగ్‌ సిబ్బంది, అయిదు వేల మంది పోలీసులు, ఇతర ఉద్యోగులు; 6,802 సర్వీసు ఓటర్లు, 5,698 విభిన్న ప్రతిభావంతులు, 85 సంవత్సరాల పైబడిన ఓటర్లు ఉండనున్నట్లు అధికారుల అంచనా. ఈ సారి ఎన్నికల విధుల్లో పాల్గొనున్న పాత్రికేయులకు(ఈసీ గుర్తింపు) కూడా పోస్టల్‌ బ్యాలెట్‌ ఇవ్వనున్నారు.

ఇంటి వద్దకే రానున్న ఓటు...: పోలింగ్‌ సిబ్బందికి మే 3 నుంచి 5 వరకు; విభిన్న ప్రతిభావంతులు, వృద్ధులకు 4 నుంచి 9వ తేదీలోపు ఇంటి వద్దనే ఓటింగ్‌ కార్యక్రమం అమలు చేసేలా ముందస్తు ప్రణాళిక చేశారు. పోస్టల్‌ బ్యాలెట్‌ కావాలనుకునేవారు ఈ నెల 22వ తేదీలోపు ఫారం-12డీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఆ తేదీల్లోనే ఎక్కువ..!: షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 18 నుంచి 25వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 18, 19, 24, 25 తేదీల్లోనే ప్రధాన పార్టీలతో పాటు, స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్‌ దాఖలుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 19న కొండపి తెదేపా అభ్యర్థిగా ప్రస్తుత ఎమ్మెల్యే డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి, 24న ఒంగోలు అసెంబ్లీ తెదేపా అభ్యర్థిగా దామచర్ల జనార్దన్‌ నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. ఒంగోలు పార్లమెంట్‌ ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులురెడ్డి గురువారం ఉదయం 11 గంటలకు నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. 25న మరోసారి భారీ ర్యాలీతో దాఖలు చేసేలా ప్రణాళిక చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని