logo

ఎంత పనిచేసినా అంతే..!

రోజంతా మండుటెండలో కష్టపడి పనిచేస్తున్న ఉపాధి పథక కూలీలకు సరైన వేతనం దక్కడం లేదు. చేతులు బొబ్బలెక్కేలా పనిచేస్తున్నా వివరాల నమోదులో తేడానో లేక పనికిరాని వారికీ మస్టర్ల కారణంగానో రోజురోజుకూ కూలీ తగ్గిపోతోందని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Published : 26 May 2022 06:22 IST

 ఉపాధి పథకంలో దక్కని శ్రమకు తగ్గ ఫలితం

జిల్లా సరాసరి వేతనం రూ.151

ఈనాడు డిజిటల్‌, శ్రీకాకుళం

ఎచ్చెర్లకు చెందిన ఉపాధి వేతనదారు ఎస్‌.రమణమ్మ పదేళ్లుగా పనులకు వెళ్తున్నారు. గతంలో వారానికి రూ.1300-1500 వరకూ వచ్చేది. ఇప్పుడు వారమంతా కష్టపడినా కనీసం రూ.1000 కూడా రావడం లేదు. ఎప్పుడూ చేసినట్టే చేస్తున్నా ఎందుకు తగ్గుతుందో ఎవరూ చెప్పలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పలాసకు సి.చిన్నంనాయుడు గతంలో హైదరాబాద్‌లో పనిచేసేవారు. కొవిడ్‌ తర్వాత స్వగ్రామానికి వచ్చి ఉపాధి పనులకు వెళుతున్నారు. కొత్తలో వారానికి కనీసం రూ.1400 వచ్చేది. ఇప్పుడు రూ.900 కూడా రావడం లేదని వాపోతున్నారు.

రోజంతా మండుటెండలో కష్టపడి పనిచేస్తున్న ఉపాధి పథక కూలీలకు సరైన వేతనం దక్కడం లేదు. చేతులు బొబ్బలెక్కేలా పనిచేస్తున్నా వివరాల నమోదులో తేడానో లేక పనికిరాని వారికీ మస్టర్ల కారణంగానో రోజురోజుకూ కూలీ తగ్గిపోతోందని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంత పనిచేస్తే ఎంత వస్తుందనే విషయం వివరించే వారే కరవయ్యారని వాపోతున్నారు. క్షేత్ర సహాయకుడు చూపించిన పని పూర్తిచేసి వెళ్లడం తప్ప తమకేమీ తెలియడం లేదని వివరిస్తున్నారు.

ఒక్కో శ్రమశక్తి సంఘంలో 30-40 మంది వేతనదారులు, ఒక మేట్‌ ఉంటారు. జిల్లాలో మొత్తం 5 లక్షల జాబ్‌ కార్డులుండగా 10 లక్షలకు పైగా కూలీలు నమోదై ఉన్నారు. ఏప్రిల్‌ రెండో వారం వరకూ రోజుకు 70-80 వేల మంది రోజు పనికి వచ్చేవారు. ఆ సంఖ్య మూడు వారాలుగా పెరుగుతూ ప్రస్తుతం 2.56 లక్షలకు చేరుకుంది. జిల్లాలో ఉన్న వేతనదారులు, అందుబాటులో ఉన్నపని బేరీజు వేస్తే రోజుకు కనీసం 3 లక్షల మందికి పని కల్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

గరిష్ఠం అందేదెప్పుడో..!

వేతనదారులు పొందే వేతనంలో 40 శాతాన్ని మెటీరియల్‌ కాంపొనెంట్‌ నిధులుగా కేంద్ర ప్రభుత్వం అదనంగా మంజూరు చేస్తుంది. వాటితో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ఆస్కారం ఉంది. గతేడాది మొత్తం రూ.425.48 కోట్లు వేతనంగా వేతనదారులు అందుకున్నారు. ఆ ఏడాదికి రోజువారీ సగటు వేతనం రూ.197 ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అది ఇప్పుడు ఏకంగా రూ.151కి పడిపోయింది. వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్కరికీ రోజువారీగా గరిష్ఠంగా రూ.257 ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా జిల్లాలో ఒక్కరంటే ఒక్కరికి ఈస్థాయిలో లేదు.

అవగాహన లేకనే..

క్షేత్రసహాయకులు నాలుగైదు చోట్ల జరుగుతున్న పనులను సమన్వయం చేసుకుంటూ మస్తర్లు తీసుకోవడంలోనే సమయం గడిచిపోతోంది. పనిపై దృష్టిపెట్టే అవకాశం ఉండట్లేదు. వేతనదారులు, మేట్‌లకు అవగాహన కల్పించేందుకు ఆస్కారం లేదు. రోజువారీ వేతనం భారీగా తగ్గేందుకు ఇదే ప్రధాన కారణం. ఈ అంశంపై అధికారులెవరూ దృష్టి సారించడం లేదు. గతంలో మేట్‌లు అందరికీ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులు అనుకున్నా కార్యరూపం దాల్చలేదు. ఫలితంగా శ్రమకు తగ్గ ఫలితం దక్కడం లేదు.

సగటు వేతనం పెంచేలా చర్యలు

రోజువారీ సగటు వేతనం తక్కువగా ఉన్న విషయం వాస్తవమే. దాన్ని ముందుగా రూ.230కి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికే క్లస్టర్ల వారీగా సమావేశాలు నిర్వహించి సిబ్బందికి అవసరమైన సూచనలు చేస్తున్నాం.

- ఎం.రోజారాణి, పీడీ, డ్వామా

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని