logo
Published : 28 May 2022 06:53 IST

దారులా.. డంపింగ్‌ యార్డులా?

కాలుష్య కోరల్లో గ్రామాలు

పొంచి ఉన్న అంటువ్యాధులు

- న్యూస్‌టుడే, పొందూరు, సరుబుజ్జిలి

సారవకోట: జాతీయ రహదారి పక్కన చెత్త నిల్వలు

పంచాయతీల్లో పారిశుద్ధ్యం పడకేస్తోంది. పచ్చదనం, పరిశుభ్రతతో స్వాగతం పలకాల్సిన పలు గ్రామీణ దారులు చెత్తతో దర్శనమిస్తున్నాయి. డంపింగ్‌యార్డులను తలపిస్తున్నాయి. చెత్త ఎక్కడ వేయాలో తెలియక ప్రజలు రహదారులనే ఎంచు కుంటున్నారు. ఈ సమస్య పరిష్కరించాల్సిన పంచాయతీలు పట్టించుకోవడం లేదు. గ్రామ ముఖ ద్వారంలోనే చెత్త నిల్వలు పేరుకుపోతున్నాయి. దీనికితోడు రహదారుల పక్కన నాటిన మొక్కలు కనిపించడం లేదు. ఫలితంగా కాలుష్యమూ పెరిగిపోతోంది.

అలంకారప్రాయంగా చెత్త సంపద కేంద్రాలు..

పారిశుద్ధ్యం మెరుగు, చెత్త సమస్య పరిష్కారం కోసమని 912 చెత్త సంపద కేంద్రాలు ఏర్పాటుకు ప్రభుత్వం ఉపాధి నిధులు మంజూరు చేసింది. కొన్నిచోట్ల నిర్మాణం పూర్తిచేయలేదు. ఫలితంగా ఇంటింటా సేకరించిన చెత్తను ప్రధాన రహదారుల పక్కనే పడేస్తున్నారు. ఇక్కడ పందులు, కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. దీంతో ప్రయాణికులు దుర్గంధం భరించలేకపోతున్నారు.

దోమల వృద్ధికి అవకాశం.. వచ్చేది వర్షాకాలం.. అపరిశుభ్రత ఇలానే ఉంటే అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు ఉన్నాయని వైద్యులు పేర్కొంటు న్నారు. రహదారుల పక్కన చెత్త నిల్వ ఉండటంతో దోమలు వృద్ధి చెంది వ్యాధులకు కారణమవుతున్నాయి.

సరుబుజ్జిలి మండలం విజయరాంపురం గ్రామంలో చెత్త నుంచి సంపద కేంద్రం ఇది. 2018లో రూ.2,87,528 నిధులతో నిర్మించారు. అప్పటి నుంచి దీనిని ఉపయోగించకపోవడంతో నిరుపయోగంగా మారింది. దీంతో గ్రామ పరిసరాల్లో రహదారుల పక్కనే చెత్త నిల్వలు దర్శనమిస్తున్నాయి.

జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో పారిశుద్ధ్య మెరుగుకు పంచాయతీలు రూ.లక్షలు వ్యయం చేస్తున్నా ఫలితాలు అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. పేరుకుపోయిన చెత్తకుప్పలు, నిలిచిన మురుగు, కంపుకొడుతున్న కాలువలే కనిపిస్తున్నాయి. ఈ సమస్య లేకుండా చర్యలు తీసుకోవాల్సి ఉన్నా అరకొర పనులతో సరిపెడుతున్నారు. పారిశుద్ధ్య సిబ్బంది కొరత, నిధుల లేమి సమస్యలు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. గ్రామాల్లో ఇంటి చెత్త, ఇతర వ్యర్థాలు వేసుకునేందుకు సరైన సౌకర్యం ఉండటం లేదు.

కొన్నిచోట్ల పరిశీలన చేయగా..

పొందూరు మండలం: పొందూరు, కింతలి, రాపాక, లోలుగు, దల్లవలస, వి.ఆర్‌.గూడాం, లచ్చయ్యపేట, తాడివలస, కనిమెట్ట, బురిడికంచరాం, తదితర గ్రామాల్లో రహదారుల పక్కన చెత్త పోస్తున్నారు. స్థానికులు, వాహనదారులకు అవస్థలు తప్పడం లేదు.

ఆమదాలవలస: కొండంపేట, బొబ్బిలిపేట, శ్రీహరిపురం, వన్నవలస, అక్కులపేట, మెల్లిపర్తి, తురకపేట, పైలాడ, కుమ్మరిపేట, బెలమాం గ్రామాల్లో రోడ్ల పక్కనే పడేస్తున్నారు .

బూర్జ : మామిడివలస, పెద్దలంకాం, పి.డి.ఆర్‌.రాజుపేట, అన్నంపేట, తోటవాడ, లక్కుపురం, పనుకుపట్ట, డొంకలపర్త, గుత్తావిల్లిలోనూ ఇదే దుస్థితి.

సరుబుజ్జిలి : ఎల్‌.కె.పల్లి, కూనజమన్నపేట, సుభద్రపురం, కొత్తకోట, గోనుపాడు, యరగాం, సుబ్బపేట, సింధువాడ దారుల పక్కన చెత్త కుప్పలు స్థానికులను ఇబ్బంది పెడుతున్నాయి.

ఎల్‌.ఎన్‌.పేట : పూసాం, బొత్తడసింగి, ఎల్‌.ఎన్‌.పేట, గొట్టిపల్లి, డొంకలపడవంజా, తురకపేట, సిద్ధాంతం, తదితర గ్రామాల్లో రోడ్ల పక్కనే వేస్తున్నారు.

పారిశుద్ధ్యాన్ని మెరుగుపరుస్తాం..

గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగుకు చర్యలు చేపడుతున్నాం. దీనిపై మండల అధికారులతో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలను పూర్తిచేసి రహదారుల పక్కన చెత్త నిల్వలు లేకుండా చూస్తాం.- రవికుమార్‌, - జిల్లా పంచాయతీ అధికారి, శ్రీకాకుళం

Read latest Srikakulam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని