logo

యువకలల సాకారానికి.. వజ్రసంకల్పమే...లక్ష్యం కావాలి

తన బిడ్డలందరికీ ఉపాధి కల్పించగల సత్తా జిల్లాకుంది. అందుకు అవసరమైన వనరులూ ఇక్కడున్నాయి. వినియోగించుకోవడమే కావాల్సింది. స్వాతంత్య్రం సిద్ధించిన ఈ 75 ఏళ్ల కాలంలో అందుకు కొంత ప్రయత్నం జరిగినా చేయాల్సింది చాలానే ఉంది.

Published : 15 Aug 2022 06:42 IST

న్యూస్‌టుడే, పాతశ్రీకాకుళం, సోంపేట

తన బిడ్డలందరికీ ఉపాధి కల్పించగల సత్తా జిల్లాకుంది. అందుకు అవసరమైన వనరులూ ఇక్కడున్నాయి. వినియోగించుకోవడమే కావాల్సింది. స్వాతంత్య్రం సిద్ధించిన ఈ 75 ఏళ్ల కాలంలో అందుకు కొంత ప్రయత్నం జరిగినా చేయాల్సింది చాలానే ఉంది. జిల్లా నుంచి ఉపాధి వలసలను ఆపాలంటే.. ముఖ్యంగా తమశక్తిని సద్వినియోగం చేసుకోవాలంటే వజ్రోత్సవ వేళ నాయకులు ఈ విషయాలపై ఆలోచించాల్సిన అవసరముందని జిల్లా యువత కోరుకుంటోంది.

పర్యాటకం.. అవకాశాలు పుష్కలం..

జిల్లాలో 193 కిలోమీటర్ల మేర తీర ప్రాంతముంది. బారువ, బావనపాడు, కళింగపట్నం తదితర ఆరు పెద్ద బీచ్‌లు, 30కిపైగా చిన్నాచితకా బీచ్‌లో ఉన్నాయి. రోజుకు సుమారు 15 వేల మంది సందర్శిస్తున్నా.. ఎక్కడా తినడానికి తిండి, తాగడానికి నీరు కూడా ఇక్కడ లభ్యంకాదు. ఆయా ప్రాంతాల్లో ఆహారపదార్థాల విక్రయాలు, బస చేసేందుకు అవసరమైన లాడ్జిలు, హోటళ్లు, ఉల్లాసం పంచే సాధనాలు ఏర్పాటు చేస్తే కనీసం 5 వేల మంది యువతకు ఉపాధి లభిస్తుంది. వంశధార జలాశయం, సోంపేట బీల ప్రాంతాలను కూడా పర్యాటకంగా అభివృద్ధి చేసే అవకాశముంది.

అదనపు ఉపాధికి అవకాశం..

జిల్లాలో రెండు లక్షల మంది మత్స్యకారుల్లో యాభైవేల మంది వేటపైనే ఆధారపడుతున్నారు. వీరిలో ఇక్కడ ఉపాధి లభించక 30 వేల మంది వలస వెళుతున్న పరిస్థితి. బుడగట్లపాలెం, భావనపాడు, నువ్వలరేవు జెట్టీలు ఏర్పాటుచేసి, అధునిక వేట పద్ధతుల్లో శిక్షణ ఇచ్చి పరికరాలు సమకూర్చితే మన మత్స్యకారులు వలసవెళ్లే పరిస్థితే ఉండదు. అదనంగా మత్స్య ఉత్పత్తుల ప్రాసెసింగ్, ఎగుమతి చేయగలిగితే సుమారు 5 లక్షల మందికి ఉపాధి కల్పించవచ్చు.

సాంకేతికతతో కూడిన నైపుణ్యం 

జిల్లాకు సాంకేతిక నైపుణ్య శిక్షణా సంస్థలు ఒక్కటీ లేవు. ఏటా సుమారు 15 వేల మంది పాలిటెక్నిక్, ఇంజనీరింగ్‌ కోర్సుల చేసి నైపుణ్య శిక్షణకు వేర్వేరు ప్రాంతాలకు వలస వెళుతున్న పరిస్థితి ఉంది. ఇంతేమంది గ్రాడ్యుయేట్లు ఏటా తయారవుతున్నారు. ఇక్కడే శిక్షణ ఇప్పించగలిగే వారి ఉపాధి అవకాశాలను మరింత పెంపొందే అవకాశముంది. దీనికి ప్రభుత్వపరమైన తోడ్పాటు కూడా అవసరం. అప్పుడే మన యువకులు ఎక్కడైనా ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు.

ప్రోత్సాహం అవసరం..

జిల్లాలో 30 భారీ, రెండు వేలకుపైగా చిన్నాచితకా పరిశ్రమలు లక్షమందికిపైగా ఉపాధిని కల్పిస్తున్నాయి. ఇందులో సగం మంది జిల్లావాసులు ఉపాధి పొందుతున్నారు. కాగా జిల్లాకు చెందిన యువత ఇక్కడ పరిశ్రమలు స్థాపించేందుకు కల్పిస్తున్న అవకాశాలు, ప్రోత్సాహం పెరగాల్సి ఉంది. ఇందుకు ప్రభుత్వం నుంచి సాంకేతిక సహకారం అందాలి. అనుమతుల జారీ సులభతరం చేయాలి. ఉపాధి ఆధారిత కోర్సులు అందించే విద్యాసంస్థల ఏర్పాటును పెంచాలి.

మనమే ఎగుమతి చేయాలి...

జిల్లాలో 4.90 లక్షల ఎకరాల్లో వరి పండుతోంది. ఉద్దానం ప్రాంతంలో 52 వేల ఎకరాల్లో కొబ్బరి పండుతోంది. ఇంకా పప్పుదినుసులు, కూరగాయలు, పనస, అనాస విరివిగా పండిస్తున్నారు. వీటికి సంబంధించి ఎలాంటి ప్రాసెసింగ్, అనుబంధ పరిశ్రమలు జిల్లాలో లేవు. వీటిని అవసరం ఉంది. ఏర్పాటైతే వేల మందికి ఉపాధి కల్పించవచ్చు. గ్రానైట్ పరిశ్రమ ఉంది. పొందూరు ఖాదీ ఉత్పత్తులున్నాయి. బుడితిలో ఇత్తడి పరిశ్రమ ఉంది. వీటిని సక్రమంగా ఉపయోగించుకుంటే ఉపాధికి కొదవుండదు.

సద్వినియోగం చేసుకోండి..

జిల్లాలో అందుబాటులో ఉన్న వనరులను పాలకులు, ఉన్నతాధికారులు సద్వినియోగం చేసుకుని యువతను ప్రోత్సహించాలి. అప్పుడే వారికి మెరుగైన ఉపాధి అవకాశాలను అందుబాటులోకి తీసుకురాగలం. పోర్టుల అభివృద్ధి, వ్యవసాయ ఆధారిత పరిశ్రమల ఏర్పాట్లు, జిల్లా ప్రత్యేక ఉత్పత్తుల ఎగుమతులపై దృష్టి పెట్టాలి. జిల్లా యువతలో నెల జీతానికి పనిచేద్దామనే ధోరణిని పారదోలి పారిశ్రామికవేత్తల స్థాయి ఆలోచనలు తీసుకురాగలగాలి. - తమ్మినేని కామరాజు, మాజీ రిజిస్ట్రార్, బీఆర్‌ఏయూ


ఇదీ మా అంతరంగం

సర్వేలో జిల్లా యువత మనోగతం 

- ఈనాడు డిజిటల్, శ్రీకాకుళం, న్యూస్‌టుడే, బృందం

అభివృద్ధి అథమస్థాయికి చేరువకావాలి... పరిశ్రమల స్థాపనకు ఊతమివ్వాలి... పార్టీలూ మా ప్రాధాన్యతను పూర్తిస్థాయిలో గుర్తించాలి... ఉద్యోగావకాశాలు పెరగాలి... మారుతున్న సాంకేతిక మాకు సత్వరం అందుబాటులోకి రావాలి... వీటిని సమకూర్చండి.. మా సత్తా చాటుతాం అంటున్నారు.. ఈ వజ్రోత్సవాన మా ఆలోచనలకు మెరుగుపెట్టే అవకాశాలు మాకు కల్పించండి అంటున్నారు. ఈ విషయం ‘న్యూస్‌టుడే’ ఈ నెల 13న నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఒక్కో నియోజకవర్గం నుంచి 100 మంది చొప్పున మొత్తం 800 మంది యువతతో సర్వే నిర్వహించగా వచ్చిన ఫలితాలిలా ఉన్నాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని