logo

రోడ్డు ప్రమాదంలో జిల్లా యువకుడి దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో జిల్లాకు చెందిన యువకుడు హైదరాబాద్‌లో దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటన దుండిగల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది.

Published : 08 Dec 2022 05:32 IST

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: రోడ్డు ప్రమాదంలో జిల్లాకు చెందిన యువకుడు హైదరాబాద్‌లో దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటన దుండిగల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. సారవకోట మండలం అలుదు గ్రామానికి చెందిన మన్మథరావు(20) ఉద్యోగరీత్యా నగరానికి వలసవచ్చి గండిమైసమ్మ చౌరస్తాలోని ఓ వసతిగృహంలో ఉంటున్నాడు. మేడ్చల్‌లోని ఓ సంస్థలో పనిచేస్తున్నాడు. బుధవారం విధులు ముగిసిన తర్వాత తన స్నేహితుడి ద్విచక్ర వాహనం తీసుకుని వసతిగృహానికి బయలుదేరాడు. దుండిగల్‌ పోలీస్‌స్టేషన్‌ సమీపంలోని పెట్రోల్‌బంక్‌ వద్ద ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి గుర్తుతెలియని కారు ఢీ కొట్టింది. తలకు తీవ్రగాయాలవ్వడంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శిరస్త్రాణం ధరించి ఉంటే యువకుడు ప్రాణాలతో బయటపడేవాడని పోలీసులు భావిస్తున్నారు.


 పిల్లిని తప్పించబోయి..  ఆటో బోల్తా పడి...

వజ్రపుకొత్తూరు, న్యూస్‌టుడే: అన్నదమ్ములిద్దరూ కలిసి ఎప్పటిలాగే గ్రామాల్లో పాలు సేకరించి ఆటోలో తిరిగి వెళ్తుండగా డొంక పిల్లి కారణంగా వాహనం బోల్తా పడింది. వజ్రపుకొత్తూరు మండలంలోని గల్లీ-బెండి మధ్య సమీపంలో బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో అన్న మృతి చెందగా తమ్ముడు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పలాస పురపాలిక సంఘం పరిధిలోని తాళభద్రకు చెందిన డి.సింహాచలం (19), తమ్ముడు రేవతిపతి గ్రామాల్లో పాలు సేకరించి, డెయిరీకి పోస్తుంటారు. బుధవారం నగరంపల్లి సమీప గ్రామాల్లో పని పూర్తి చేసుకుని ఆటోలో తిరిగి వెళ్తున్నారు. కొద్దిదూరం వెళ్లగానే డొంక పిల్లి ఎదురుగా రావడంతో తప్పించుకునే క్రమంలో వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. సింహాచలం తలకు తీవ్ర గాయాలై ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. మృతదేహాన్ని, క్షతగాత్రుడు రేవతిపతిని 108 వాహనంలో పలాస సామాజిక ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వజ్రపుకొత్తూరు ఎస్‌.ఐ. మధుసూదనరావు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని